ప్రపంచ మార్కెట్లు ఎందుకిలా పతనమయ్యాయి?

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/gettyimages
మంగళవారం భారత్ సహా, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ప్రధాన మార్కెట్లు పతనమవ్వడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో ప్రధాన మార్కెట్లన్నీ నేలచూపులు చూశాయి.
వరుసగా మూడో రోజు భారత మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
అయితే, ప్రారంభంలో భారీగా పతనమైన భారత మార్కెట్లు, తర్వాత మెరుగుపడి మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 561 పాయింట్లు (1.61 శాతం), నిఫ్టీ 168.20 పాయింట్లు (1.58 శాతం) నష్టపోయాయి.
జపాన్ మార్కెట్ 'నిక్కీ 225 ఇండెక్స్' 7 శాతం (1071.8 పాయింట్లు) పడిపోయింది. తర్వాత కాస్త కుదుటపడటంతో ఆ నష్టం 4.73 శాతానికి తగ్గింది.
ఆసియాలోని ఇతర మార్కెట్లు సైతం నష్టాల్లోనే నడిచాయి.
లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 3 శాతం వరకు పతనమయ్యాయి.
అమెరికాలో ప్రధాన స్టాక్ మార్కెట్ డౌజోన్స్ ఒక్కసారిగా 1175 పాయింట్లు (4.6 శాతం) నష్టపోయింది. 2011 తర్వాత డౌ ఇంతగా కుదేలవ్వడం ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, Digital Look
2017లో మదుపరులకు మార్కెట్లు లాభాల పంట పండించాయి. డౌజోన్స్ దాదాపు 25 శాతం వృద్ధి చెందింది.
అంతగా జోష్ ఇచ్చిన మార్కెట్లు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అమెరికాలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం శుక్రవారం వెలువడిన ఉద్యోగాల నివేదికే అని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యోగుల జీతాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
అయితే జీతాలు పెరిగితే, ద్రవ్యోల్బణం కూడా పరుగులు పెడుతుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఆ ఊహాగానాలే డౌజోన్స్ పతనానికి కారణమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా మూడో రోజూ ఇక్కడి మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. అయితే, కొన్ని నెలలుగా భారీగా పుంజుకున్న మార్కెట్లకు ఈ పతనాన్ని దిద్దుబాటుగానే చూడాలని నిపుణులు అంటున్నారు.
"తాజా నష్టాలపై గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ దిద్దుబాటుగానే చూడాలి" అని బీఎన్‌పీ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు గౌరంగ్ షా అన్నారు.
మరి కొందరు నిపుణులు మాత్రం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు మదుపరులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
"అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్(ఎల్‌టీసీజీ) ప్రభావంతో భారత మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపరులు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది" అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ అధినేత జయంత్ మాంగ్లిక్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం మార్కెట్ నిపుణులు అంతా బుధవారం రిజర్వ్ బ్యాంకు ప్రకటించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్ష వైపు చూస్తున్నారు. వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








