యూకేలోని ఆసియన్లకు కిడ్నీల కొరత

    • రచయిత, రాహుల్ జోగ్లేకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ మధ్య దాదాపు ఓ యాభై మంది యూకేలోని స్వామి నారాయణ్ ఆలయానికి చేరారు. వాళ్లు వచ్చింది ప్రార్థన చేయడానికి కాదు.. అవయవ దానంపై చర్చించడానికి, అపోహలు దూరం చేసుకోవడానికి.

యూకేలోని అతిపెద్ద హిందూ ఆలయాల్లో స్వామి నారాయణ్ మందిరం ఒకటి. హిందూ శాస్త్రాలేవీ అవయవ దానానికి వ్యతిరేకం కావనీ, అందరూ స్వచ్ఛందంగా అవయవ దానానికి ముందుకు రావాలనీ ఆ ఆలయం కోరుతోంది.

యూకేలో అవయవ దానానికి ముందుకొచ్చే ఆసియన్ల సంఖ్య చాలా తక్కువ. అవయవదానం పైన హిందువుల్లో కొన్ని అపోహలు నెలకొన్నాయని ఆలయ నిర్వహకుల అభిప్రాయం. అవగాహనా కార్యక్రమాల సాయంతో వాటిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘అవయావాల్ని దానం చేయడమంటే ఎదుటి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే’ అంటారు ఆలయ ప్రధాన సాధువు యోగి వివేక్‌దాస్.

2017లో యూకేలోని దాదాపు వెయ్యిమంది ఆసియన్లు అవయవాల కోసం ఎదురు చూశారు. వాళ్లలో ఎక్కువ మందికి కిడ్నీల అవసరం ఉంది. కానీ కేవలం 79మంది ఆసియన్లు మాత్రమే బతికుండగా కిడ్నీలను దానం చేశారు. మరణానంతరం మరో 29మంది తమ కిడ్నీలను దానం చేశారు.

నేషనల్ హెల్త్ సర్వీస్‌ డేటా ప్రకారం 2015లో సమయానికి అవయవాలు అందక 466మంది రోగులు చనిపోయారు. మరో 881మందిని అవయవాల వెయిటింగ్ లిస్టు నుంచి తొలగించారు. ఆ తరవాత వాళ్లలో చాలామంది చనిపోయారు.

మరో పక్క యూకేలోని ఆసియన్ల నుంచి కిడ్నీల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఒకే ప్రాంతానికి చెందిన వారి అవయవాలైతే అవి మార్పిడికి సులువుగా సరిపోలే అవకాశం ఉంది. అందుకే ఆసియన్లకు అవయవాల కొరతను తగ్గించేందుకు యూకేలోని కొందరు వ్యక్తులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు.

అలాంటి వాళ్లలో కిరీట్ మోదీ ఒకరు. గతంలో కిరీట్ రెండు మూత్ర పిండాలూ ఫెయిలయ్యాయి. ఆ సమయంలో అతడి ముందు రెండు అవకాశాలు మాత్రమే మిగిలాయి. ఒకటి.. మూత్రపిండాల మార్పిడి చేసుకోవడం, రెండు.. డయాలసిస్‌పై ఆధారపడటం.

కిరీట్ మూత్రపిండాల మార్పిడికే సిద్ధమయ్యారు. అతడి సోదరుడూ, భార్యా కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చారు. సోదరుడికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో భార్య కిడ్నీనే అమర్చాలని నిర్ణయించారు.

‘కిడ్నీని దానం చేయడం అంటే రోగితో పాటు దాతలు కూడా శస్త్ర చికిత్సకు సిద్ధపడటమే. అందులో రిస్క్ ఉన్నా, మరొకరికి జీవితాన్ని ఇచ్చామన్న సంతృప్తీ ఉంటుంది. చనిపోయిన వారికంటే బతికున్న వారి కిడ్నీని పొందగలగడమే ఆరోగ్యానికి ఉత్తమం’ అంటారు కిరీట్.

సర్జరీ తరవాత కిరీట్‌తో పాటు ఆయన భార్య కూడా పూర్తిగా కోలుకున్నారు. ‘నేను జీవితంలో చేసిన అత్యంత మంచి పని, నా భర్తకు కిడ్నీని ఇవ్వడమే’ అంటారు కిరీట్ భార్య మీనా.

‘చాలామంది ఏళ్ల తరబడి అవయవాల కోసం ఎదురుచూస్తారు. అవి అందేలోగా వారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అందుకే దాతలు వీలైనంత త్వరగా స్పందించి ముందుకు రావాలి’ అంటారామె.

ప్రస్తుతం భర్తతో కలిసి మీనా కూడా అవయవదానంపై యూకేలోని ఆసియన్లలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఇతరులకు జీవితాన్ని ఇవ్వడం కంటే మంచి అనుభూతి ఏముంటుంది’ అనేది మీనా మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)