You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 11 ఏళ్ల ఇజ్రాయెల్ పిల్లాడిని భారత్‌కు ఎందుకు పిలిచారో తెలుసా?
2008 ముంబయి టెర్రరిస్టు దాడుల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినప్పుడు మోషె హొల్ట్‌బెర్గ్ వయసు 2. ఇప్పుడా పిల్లాడి వయసు 11.
ఇజ్రాయెల్‌కు చెందిన మోషె మంగళవారంనాడు భారత్‌లో అడుగుపెట్టాడు. ’నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అతడు హిందీలో రిపోర్టర్లతో చెప్పాడు.
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విదేశీయుల్లో మోషె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ల మరణానంతరం మోషె ఇజ్రాయెల్‌లోని తన తాతయ్య దగ్గరకి వెళ్లిపోయాడు.
దాడులు జరగడానికి ఏడేళ్ల ముందే మోషె తల్లిదండ్రులు భారత్‌లో స్థిరపడ్డారు. ముంబైలోని యూధులకు చెందిన చాబాద్ కేంద్రంలో మోషె తండ్రి రబ్బీ గావ్రియల్ సేవలందించేవారు.
పదేళ్ల క్రితం ఆ కేంద్రంపై దాడి జరిగినప్పుడు రబ్బీ, ఆయన భార్య రివ్కా చనిపోయారు. భారత్‌కు చెందిన సాండ్రా సామ్యుల్స్ అనే మహిళ మోషెను కాపాడగలిగారు. ఆ సమయంలో సాండ్రా.. మోషెకు ఆయాగా ఉండేవారు.
గతేడాది ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో ప్రధాని మోదీనే స్వయంగా మోషెని భారత్ రావల్సిందిగా ఆహ్వానించారు. దాంతో నానమ్మ, తాతయ్య, సాండ్రాతో కలిసి మోషె భారత్‌కు రావడానికి సిద్ధమయ్యాడు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న మోషె తాతయ్య రబ్బీ రోసెన్‌బర్గ్‌ను బీబీసీ పలకరించింది. సైకాలజిస్ట్ సూచన మేరకు మోషెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు.
‘మోషెకు అతడి తల్లిదండ్రులు ఎలా చనిపోయారో తెలుసు. వాళ్లను మోషె చాలా మిస్సవుతున్నాడు. రోజూ నిద్రపోయే ముందు తల్లిదండ్రుల ఫొటోకు గుడ్‌నైట్ చెప్పి పడుకుంటాడు.
ఇజ్రాయెల్‌కు వచ్చిన కొత్తలో రాత్రులు నిద్రలో నుంచి లేచి తల్లిదండ్రుల్ని కలవరిస్తూ మోషె ఏడ్చేవాడు. కొన్నాళ్ల వరకూ అతడు నా దగ్గరకు కూడా వచ్చేవాడు కాదు. నా వేషధారణ చూసి నేనూ టెర్రరిస్టునే అనుకునేవాడేమో.
ఆ సమయంలో సాండ్రానే వాడికి తోడుగా ఉంది. ఆమె మాకు చేసిన మేలుని మేమెన్నటికీ మరచిపోలేం’ అంటారు రోసెన్‌బర్గ్. సాండ్రా చేసిన పనికి గుర్తింపుగా ఆమెకు ఇజ్రాయెల్ తమ దేశ పౌరసత్వాన్నీ ఇచ్చింది.
దాడుల అనంతరం స్వదేశానికి వెళ్లిపోయిన మోషె ఇన్నేళ్ల తరవాత తాను పుట్టిన ప్రాంతానికి రానున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి ముంబయిలోని యూధుల కేంద్రంలో మోషె కాస్త సమయం గడపనున్నాడు.
ఇజ్రాయెల్‌లో మోషె జీవితం గురించి వివరిస్తూ, ‘అమ్మానాన్నలకు దూరమవడం మోషె మానసిక స్థితిపై ప్రభావం చూపింది. అతడికి మేం దగ్గరవడానికి చాలా సమయం పట్టింది. అతడికోసం నేను కూడా చిన్న పిల్లాడిలా మారా.
మోషెతో పాటు నేను కూడా సైకిల్ తొక్కడానికి వెళ్లేవాణ్ణి. అలా క్రమంగా అతడికి దగ్గరయ్యా’ అని రోసెన్‌బర్గ్ చెబుతారు.
‘భారత్‌కు రావడానికి మోషె చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ముంబయిలోని చాబాద్ హౌజ్ గురించి అతడు అప్పుడప్పుడూ అడుగుతుంటాడు.
మోషె కూడా తన తండ్రిలానే ముంబయికి వెళ్లి చాబాద్ హౌజ్‌లో సేవలందిస్తాడని నేను అనుకుంటున్నా. బహుశా 20-22ఏళ్లు వచ్చేసరికి అతడు ముంబయిలో తన తండ్రి స్థానంలోనే స్థిరపడే అవకాశం ఉంది’ అంటారు రోసెన్‌బర్గ్.
ముంబయి చాబాద్ హౌజ్‌లో సేవలందించడానికి ఇప్పటినుంచే మోషెకు అతడి తాతయ్య శిక్షణ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)