You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జర్మనీ: ముస్లిం వ్యతిరేక ట్వీట్స్ చేసిన మితవాద ఎంపీ
ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జర్మనీ మితవాద ఏఎఫ్‌డీ పార్టీ నేత బీట్రిక్స్ వాన్ స్టార్చ్ అకౌంట్‌ను ట్విటర్ సోమవారం సస్పెండ్ చేసింది.
నూతన సంవత్సరాదిన కొలోన్ పోలీసులు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్‌తో పాటు పలు భాషలలో శుభాకాంక్షలు తెలిపారు.
దీనిని ఆమె తప్పుబడుతూ, పోలీసులు 'అనాగరిక, సామూహిక అత్యాచారాలకు పాల్పడే ముస్లిం పురుష సమూహా'న్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు అరబిక్‌లో ట్వీట్ చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ ఆరోపణ చేశారు.
అయితే విద్వేషాన్ని రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేయొచ్చా, లేదా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్టార్చ్ పోస్టుకు ప్రతిస్పందనగా సోషల్ సైట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ట్విటర్ ఆమె అకౌంట్‌ను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది.
తర్వాత ఆమె అదే మెసేజ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న కారణంతో దానిని కూడా బ్లాక్ చేశారు.
జర్మనీలో ద్వేషపూరిత ప్రసంగాలపై ఓ చట్టం చేసిన కొన్ని నెలలలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఈ చట్టం కింద అలాంటి రెచ్చగొట్టే పోస్టులను తొలగించకుంటే సోషల్ మీడియా సైట్లపై జరిమానా విధిస్తారు.
అయితే స్టార్చ్ వ్యాఖ్యలను ఆమె పార్టీ సమర్థించింది. ఆమె వ్యాఖ్యలను తొలగించడాన్ని సెన్సార్‌షిప్‌గా అభివర్ణించింది.
ఏఎఫ్‌డీ నేత అలైస్ వైడెల్, 'మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు, బందిపోట్లు, కత్తులతో బెదిరించే గుంపు'లకు పోలీసులు లొంగిపోతున్నారని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.
గత రెండేళ్ల నుంచి కొలోన్ నూతన సంవత్సర వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శరణార్థలుగా వచ్చిన కొందరు వ్యక్తులు మహిళలపై దాడులకు పాల్పడుతూ ఈ ఉత్సవాలను ఆటంకపరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
2017 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, బెర్లిన్‌లో మొదటిసారి 'మహిళలకు మాత్రమే' జోన్‌ను నెలకొల్పారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)