You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అభిప్రాయం: రజనీకాంత్‌కు అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- రచయిత, డా. సురేష్ కుమార్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, చెన్నై
తన రాజకీయ భవిష్యత్‌పై డిసెంబర్ 31న ప్రకటన చేస్తానని రజనీకాంత్ తెలిపారు. అయితే ఆయన వెంటనే జయలలిత లేని లోటును మాత్రం పూడ్చలేరు.
జయలలిత మరణాంతరం కూడా ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల ద్వారా తేలింది.
ప్రస్తుతం తమిళనాడులో ఒక మూడో శక్తి పుట్టుకొచ్చింది. ఒకవైపు జయలలిత మరణించారు. మరోవైపు డీఎంకే నేత కరుణానిధి అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయారు.
కానీ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
గత ఏడాది నుంచి రజనీకాంత్ ఇస్తున్న ప్రకటనలను చూస్తే, రాజకీయాల్లో విజయంపై ఆయనకు ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు.
రాజకీయాల్లో గెలవడం చాలా ముఖ్యం అన్న ఆయన, విజయంపై తనకు ఇంకా నమ్మకం కుదరడం లేదన్నారు. అయితే కేవలం అభిమానులతోనే రాజకీయాల్లో విజయం సాధించలేరు.
ఎంజీఆర్ ఎలా పార్టీ పెట్టారో, ఐదేళ్లలో ఎలా అధికారంలోకి వచ్చారో అని అందరూ ఆయనను ఉదహరిస్తుంటారు. కానీ వారంతా ఎంజీఆర్ డీఎంకే సభ్యుడన్న మాటను మర్చిపోతుంటారు. ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
1972లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినపుడు, ఆయనతో పాటు చాలా మంది డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లారు. అందుకే ఆయన రాజకీయాల్లో నెగ్గుకొచ్చారు.
జయలలిత కూడా ఏఐఏడీఎంకే పార్టీలో పని చేశారు. రజనీకాంత్‌కు కానీ, కమల్‌హాసన్‌కు కానీ అలాంటి రాజకీయ పునాది లేదు. వారి బలమల్లా వారి అభిమానులే.
గత 20 ఏళ్ల నుంచి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటున్నా, ఆయన ఎప్పుడు వస్తారో ఆయనకే తెలీదు. సినీ డైలాగులు ప్రజలను ఎక్కువ రోజులు ఆకర్షించలేవు.
50 ఏళ్లుగా ఏఐఏడీఎంకే, డీఎంకేల పాలన
కమల్‌హాసన్‌కు రాజకీయాలు బొత్తిగా కొత్త. జయలలిత మరణానికి ముందు ఆయన రాజకీయాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
వీరిద్దరికీ తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు.
రాజకీయాలపై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నా, ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడిందన్న విషయం మాత్రం ఇద్దరికీ తెలుసు.
తాను రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు కమల్‌హాసన్ ప్రకటించారు. ఆ తర్వాత తాను ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నట్లు మరో మాట అన్నారు.
అయితే రజనీకాంత్, కమల్‌హాసన్‌లను చూస్తే, వీళ్లిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనీ చేయలేదని తెలుస్తోంది.
జనవరిలో తాను తమిళనాడు రాష్ట్రమంతటా పర్యటిస్తానని కమల్‌హాసన్ నవంబర్‌లో అన్నారు. కానీ ఆ ప్రయత్నాలు తగినంత వేగంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
తమిళనాడు ప్రజలు కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ఇంకా నమ్మడం లేదు. కమల్‌హాసన్ కూడా తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.
తమిళనాడు ప్రజలు గత 50 ఏళ్లుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పాలననే చూస్తున్నారు. వారు కూడా మార్పును కోరుకుంటున్నారు.
జాతీయ పార్టీల ప్రభావం సున్నా
2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా విజయ్‌కాంత్ నేతృత్వంలో పీపుల్స్ వెల్ఫేర్ అలయెన్స్ పేరిట మూడో కూటమి ఏర్పడింది.
అన్ని స్థానాలకూ పోటీ చేసిన ఆ కూటమి, ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. తమిళనాడులో ద్రవిడేతర పార్టీలు విజయం సాధించలేవు.
ఆర్కేనగర్ ఎన్నికలలో, బీజీపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. అందువల్ల ఇక్కడ జాతీయ పార్టీల ప్రభావం కూడా ఉండే అవకాశం లేదు.
ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దదే కానీ...
తమిళనాడులో సినీ నటులకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. ఇక్కడ అభిమాన నటులకు క్షీరాభిషేకాలు జరుగుతాయి.
వీరిలో కొందరు మాత్రం తమ అభిమాన నటులను పూర్తిగా విశ్వసిస్తారు. తమ అభిమాన నటులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీకే ఓటు వేస్తారు.
అయితే కొందరు అభిమానులు మాత్రం ఇతర పార్టీలలో సభ్యులుగా ఉంటారు. వారి రాజకీయ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి.
ఉదాహరణకు రజనీకాంత్‌నే తీసుకోండి. రాజకీయాల్లోకి వస్తానని ఆయన 1996 నుంచి అంటున్నారు. ఆ సమయంలో ఆయన డీఎంకే, టీఎంసీలకు మద్దతు ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో అవి భారీ మెజారిటీతో విజయం సాధించగా, జయలలిత ఓడిపోయారు. కానీ రెండేళ్ల తర్వాత 1998లో ఆయన మద్దతు ఇచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీలు విజయం సాధించలేకపోయాయి.
2004లో రజనీకాంత్ లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బహిరంగంగా మద్దతు తెలిపారు. తన అభిమానులంతా వారికి ఓటు వేయాలని కోరారు. కానీ ఆ కూటమి ఒక్క సీటూ గెల్చుకోలేకపోయింది.
నిజానికి రజనీకాంత్ ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ పాపులర్. అయినా ఆయన అభిమానులెవ్వరూ ఆయన చెప్పిన వారిని గెలిపించలేదు. వారంతా 40 సీట్లలో డీఎంకేనే గెలిపించారు.
చెప్పొచ్చేదేమిటంటే, అభిమానులకు కూడా వారికంటూ కొన్ని సొంత ఆలోచనలుంటాయి.
(బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరేతో జరిగిన సంభాషణ ఆధారంగా)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)