‘చివరి రోజుల్లో అమ్మను మేమెవరం చూడలేదు. ఆ 75 రోజులూ శశికళే కథానాయకి’

‘‘జయలలిత చివరి రోజుల్లో మాతో మాట్లాడారని, ఇడ్లీ తిన్నారని మేం అబద్దం చెప్పాం. జయలలిత అపోలో హాస్పిటల్‌లో ఉన్న 75 రోజుల్లో.. మాలో ఏ ఒక్కరూ ఆమెను చూడలేదు’’ అని తమిళనాడు మంత్రి, ఏఐఏడీఎంకే నాయకుడు శ్రీనివాసన్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపాయి.

జయలలిత మరణం తర్వాత, తమిళనాడులో పొలిటికల్ డ్రామా కొత్త మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ఒక వర్గంగా.. శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ మరో వర్గంగా ఏర్పడ్డారు. జయలలిత మృతిపై ఈ రెండు వర్గాల మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి.

మధురైలో జరిగిన అన్నాదొరై జయంతి ఉత్సవాల్లో శశికళ వర్గంపై మంత్రి శ్రీనివాసన్ పలు ఆరోపణలు చేశారు. పార్టీ పరువును కాపాడటానికే ఆ రోజు అబద్దం చెప్పానని, ఈ విషయంలో తనని క్షమించాలని నిండుసభలో చేతులెత్తి ప్రజలను వేడుకున్నారు.

రాజకీయ ఉనికి కోసమే అనవసర రాద్దాంతం: దినకరన్

శ్రీనివాసన్ వ్యాఖ్యలను శశికళ మేనల్లుడు, ఏఐఏడిఎంకే బహిహ్కృత నేత దినకరన్ ఖండించాడు. 18 మంది తన వర్గం ఎమ్మెల్యేలతో కర్ణాటకలోని ఓ ప్రైవేటు రిసార్టులో ఉంటున్న దినకరన్ మీడియాతో మాట్లాడారు.

పార్టీని కాపాడటానికి తాము ప్రయత్నిస్తుంటే, కొందరు నాశనం చేయాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు.

జయలలితకు ఇన్‌ఫెక్షన్ ఉన్నందునే ఆమెను చూడటానికి ఎవ్వరినీ అనుమతించలేదన్నారు. అక్టోబర్ 1 తర్వాత జయను చూడటానికి శశికళను కూడా డాక్టర్లు అనుమతించలేదని చెప్పారు.

శశికళను చూసి తాము భయపడేవాళ్లమని, అబద్దం చెప్పడానికి ఆ భయం కూడా ఓ కారణమని శ్రీనివాసన్ అన్నారు. జయలలిత ఇడ్లీ తినడం, టీ తాగటం, మాట్లాడటం ఏ ఒక్కరూ చూడలేదని స్పష్టంచేశారు.

అరుణ్ జైట్లీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, రాహుల్ గాంధీ.. వీరంతా జయలలితను చూడటానికి వచ్చినా వారినీ అనుమతించలేదని, వీరంతా శశికళనూ, డాక్టర్ ప్రతాప్ రెడ్డిని మాత్రమే కలిశారని చెప్పారు. జయలలిత మరణం వెనుక దాగివున్న రహస్యాలను ఎంక్వయిరీ కమిషన్ బయట పెడుతుందని శ్రీనివాసన్ అన్నారు.

‘సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టేందుకు సిద్ధం’

చాలా సంవత్సరాల తర్వాత శ్రీనివాసన్‌కు మంత్రి పదవి వచ్చిందని, తన పదవిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దినకరన్ విమర్శించారు.

జయలలిత ట్రీట్‌మెంట్ మొత్తం సి.సి. కెమెరాల సాక్షిగా జరిగిందని వివరించారు.

ఫుటేజ్‌ను విడుదల చేయటానికి శశికళ అనుమతి కావాలని, అయితే ఎంక్వయిరీ కమిషన్ అడిగితే ట్రీట్‌మెంట్ ఫుటేజ్‌ను తక్షణమే అధికారులకు ఇవ్వడానికి సిద్ధమన్నారు. తాను ఎంక్వయిరీ కమిషన్‌కు భయపడనని దినకరన్ చెప్పారు.