You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కళ్యాణ్: కులమత భేదం లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతాలు
‘‘కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సాంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. ఇవి దేశపటిష్టతకు మూలాలు - ఇవే ‘జనసేన’ సిద్ధాంతాలు’’ అంటూ.. రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
2014 సాధారణ ఎన్నికలకు ముందు మార్చి 14న రాజకీయ పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు. అయితే.. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీలను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.
మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలు రానున్న పరిస్థితుల్లో.. పార్టీని విస్తరించటం మీద పవన్‌కళ్యాణ్ ఇటీవల దృష్టి కేంద్రీకరించటంతో పాటు రాజకీయంగా క్రియాశీలమవుతుండటంతో.. ఆయన మీద విమర్శలు కూడా పెరుగుతున్నాయి. పవన్‌కు కానీ జనసేన పార్టీకి కానీ ఒక సిద్ధాంతం, స్పష్టత అంటూ లేదనేది ఆ విమర్శల్లో ముఖ్యమైనవి.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ లక్ష్యాలు ఇవీ అంటూ పవన్ ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
పవన్ చేసిన ఈ ట్వీట్ మీద.. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ సిద్ధాంతాలు ఆచరణ సాధ్యమేనా? అన్న ప్రశ్నలూ ట్విటర్ వేదికగా పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. అటువంటి ప్రతిస్పందనలు కొన్ని...
’’అన్ని పార్టీలు ఇలాగే వాగ్దానం చేస్తాయి....అధికారంలోకి వచ్చాక అన్ని ఒకటే‘‘ అని చందు బేతి అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
‘‘ఈ సిద్దాంతాలు ఓట్లు పడేవరకు మాత్రమే ఆతర్వాత యధరాజా తథా ప్రజా...‘‘ అని శ్రావణ్ కుమార్ సిహెచ్ అనే వ్యక్తి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
‘‘ఆచరణలో సాధ్యం కాని సిద్ధాంతాలు’’ అని వలీషా మల్లికార్జున నాయుడు అనే వ్యక్తి పెదవి విరిచారు.
‘‘మీ యొక్క ఆలోచన సరళి ఒక సిద్ధాంతంగా మారాలి అంటే ముందుగా ఇంతవరకు ఎవరూ వెళ్ళని ఒక నూతన మార్గంలో మీరు వెళ్ళాలి. మత, కుల, వర్గ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటు వదలి, పార్టీలు మారే వారిని మీమీద వాలకుండా చూడాలి‘‘ అని మణిరాజు మోరుసుపల్లి అనే వ్యక్తి సూచించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)