'సంతోషం' అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ

పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, పవన్ కళ్యాణ్ ఏంటో తనకు తెలియదని రాష్ట్ర మంత్రి పితాని వ్యాఖ్యానించడం "సంతోషం" అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులు, టీడీపీ అభిమానులూ ఎవరి వాదనలకనుగుణంగా వారు పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే పవన్‌కీ టీడీపీకి మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొన్ని కామెంట్లు చూస్తే...

"పవన్ కళ్యాణ్ చేతల మనిషి, మాటల మనిషి కాదు. ఇదొక చిన్న వార్నింగ్ లాంటిది" అనీ, "ఇది తుపాను వచ్చేముందు జారీ చేసే 3వ ప్రమాద హెచ్చరికలాంటిది." అని కొందరు ట్వీట్ చేశారు.

ఏకేఅనిల్0848 అనే మరో ఆయన "వార్నింగ్‌ని కూడా చాలా పద్ధతిగా ఇచ్చారు.. చంద్రబాబుగారు వాళ్ళ పార్టీ వాళ్లని కంట్రోల్‌లో ఉంచుకుంటే మంచిది" అన్నారు.

"పవన్ కళ్యాణ్ గారు ముందు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి. లేకపోతే ఇలానే ఉంటుంది." అంటూ రాఘవేంద్ర రెడ్డి ఫేస్‌బుక్ ద్వారా కామెంట్ చేశారు.

"2019లో చూడండి." అంటూ ఫణిదీప్ జిడుగు సింపుల్‌గా వ్యాఖ్యానించారు.

"సంతోషం. పితాని గారు మరో గజనీ అయిపోయారు పాపం వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శెలవు" అంటూ మల్లేశ్వరరావు గిడుతూరి పోస్ట్ చేశారు.

మరో యూజర్ వినోద్ కుమార్... "పవన్ కళ్యాణ్ ఎవరో ప్రజలకు తెలుసు, కానీ మీరు ఎవరో ప్రజలకి తెలుసా, తెలుసుకోండి. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడైనా చూశారా తెలుసుకోండి, మంత్రులూ" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు.. "తెలియకపోతే నష్టం లేదు. పవన్ యూనివర్సల్ సెలబ్రటీ కాదు. ఓ స్థానిక నటుడు. పైగా చిరంజీవికన్నా పెద్దవాడైతే కాదు కదా!" అంటూ శివబొడ్డురావు1 అనే ఆయన తన ట్విటర్ హ్యాండిల్‌పై పోస్ట్ చేశారు.

విజయ్ సాయి మలినేని అనే యూజర్ "తెలియకపోతే ఏమైనా నేరమా ఏంటి... ఏపీలో చాలామందికి పీఎం ఎవరో కూడా తెలియదు" అని ట్వీట్ చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)