You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడు: కమల్‌హాసన్ రాజకీయ అరంగేట్రం
దక్షణాది రాష్ట్రం తమిళనాడు మరో కొత్త రాజకీయ నాయకుడి రంగ ప్రవేశానికి వేదిక కానుంది.
సినిమా చరిష్మాతోనే తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి ఇప్పటివరకూ ముగ్గురు ముఖ్యమంత్రులయ్యారు.
సినీ స్టార్ కమల్‌హాసన్‌కు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనను అభిమానులు "ఉళగ నాయగన్" అని పిలుస్తారు. అంటే తెలుగులో ’లోక నాయకుడు‘ అని అర్థం.
రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడానికి, ప్రజా జీవనంలో మతతత్వాన్ని అడ్డుకోవడానికి తాను రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని కమల్ గతంలో ప్రకటించారు.
తమిళనాడు ప్రజలు మారాలని, వారు సామాజికంగా, రాజకీయంగా మరింత అవగాహన పెంచుకోవాలని కూడా 62 ఏళ్ల కమల్ పిలుపునిచ్చారు.
2016 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడంతో తమిళనాట తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఇది కీలక పరిణామం.
ఇతర నేతలతో భేటీలు
రాజకీయాల్లోకి వస్తానంటూ కమల్ చేసిన ప్రకటన మీద భారీ స్థాయి ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆయన సొంత పార్టీ స్థాపిస్తారని, క్షీణిస్తున్న తమిళనాడు రాజకీయాలకు పునరుజ్జీవం ఇస్తారని చాలా మంది అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ‘‘రాబోయే వంద రోజుల్లో ఎన్నికలు పెడితే.. నేను ఆ ఎన్నికల్లో పోటీచేస్తా‘‘ అని ప్రకటించారు. గత నెల నుంచి ఆయన దేశంలో పలువురు కీలక నాయకులను కలిసే పనిలో ఉన్నారు.
ఇందులో భాగంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్టు (సీపీఐ-ఎం)కి చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతో భేటీ అయ్యారు.
ఈ భేటీల తర్వాత పలు ఇంటర్వ్యూల్లో కమల్ మాట్లాడుతూ భవిష్యత్తులో సంకీర్ణాల ఏర్పాటు అవకాశాలపై ఆయా రాజకీయ నాయకులతో చర్చిస్తున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌లా కాకుండా కమల్‌హాసన్ ముందు నుంచీ ఉదారవాద రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారు. రజనీకాంత్ తాను మే నెలలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.
‘‘స్నేహపూర్వక ప్రత్యర్థులం’’
అయితే.. రజనీకాంత్, తాను స్నేహపూర్వక ప్రత్యర్థులమని.. రాజకీయాల్లో పెద్దమనుషుల్లాగా నడుచుకుంటామని కమల్‌హాసన్ పేర్కొన్నారు. తమిళ రాజకీయ నాయకులు గతంలో చేసినట్లుగా తామిద్దరం వ్యక్తిగత దూషణలకు దిగబోమని చెప్పారు.
అవినీతి, కుల, వర్గ రాజకీయాలతో నిండిన రాష్ట్రంలో సరైన ఆలోచనాపరుడిగా కమల్‌కు ప్రజల్లో మంచి పేరుంది.
అటు బహిరంగ వేదికల మీదా, ఇటు తన సినిమాలలోనూ కుల ఛాందసత్వాలను సవాల్ చేసే ఉదారవాదిగా కమల్‌కు గల ఇమేజీ.. మతం కన్నా మానవత్వం మిన్న అని తన చిత్రాల్లో పిలుపునివ్వడం.. తమిళనాట ఒక సాంస్కృతిక మార్పుకు నాంది పలికింది.
ఎం.జి.రామచంద్రన్ (ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు), రజనీకాంత్ వంటి వారికి గల ’హీరో ఆరాధన‘ సంస్కృతి మారుతూ వస్తోంది.
తమిళనాట రాజకీయ నాయకత్వం విషయంలో ప్రస్తుతం ఒక శూన్యత నెలకొన్న పరిస్థితుల్లో కమల్ రాజకీయ ప్రవేశానికి వ్యతిరేకత వ్యక్తంకాలేదు.
సామాజిక సేవలో అభిమానులు
తమిళనాడులో రజినీకాంత్‌కు 50,000 అభిమాన సంఘాలు, విస్తారమైన అభిమానులు ఉన్నారు. వారు ఓటు బ్యాంకు కూడా కాగలరు. అయితే 5 లక్షల మంది వరకూ గల కమల్ హాసన్ అభిమాన వర్గం చూడ్డానికి తక్కువగా ఉన్నా అవి పూర్తిగా వ్యవస్థీకృతంగా, సామాజిక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించి ఉన్నాయి.
"నార్పని ఇయ్యకం" అని పిలిచే ఈ అభిమాన సంఘాలు వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రజనీకాంత్ సంఘాల తరహాలో ఉద్వేగపూరితమైన, హీరో ఆరాధనకు దూరంగా ఉంటాయి.
‘‘సగటు రాజకీయ నాయకుల్లాగా ప్రజల ముందు నటించడం కమల్‌హాసన్‌కు రాదు. ఆయన ఇయ్యక్కం ద్వారా సమాజానికి చాలా సేవ చేశారు" అని ఇటీవల ఆయన అభిమాన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.
మాటలతో మిశ్రమ సంకేతాలు
కమల్ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం, పెద్ద నోట్ల రద్దు చర్యలకు మద్దతుగా మాట్లాడటంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
"కమల్‌హాసన్ సాధారణంగా స్పష్టంగా మాట్లాడుతుంటారు. అయితే సామాన్యులకు అర్థంకాకుండా అస్పష్టంగా మాట్లడతారని కూడా ఆయనకు పేరుంది" అని చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ పేర్కొన్నారు.
"రజినీకాంత్‌కు భిన్నంగా కమల్‌హాసన్ సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తారు. అయితే పొడుపుకథలతో మాట్లాడే ఆయన అలవాటు మిశ్రమ సంకేతాలు ఇస్తుంటుంది. అవి సగటు ఓటరుకు అర్థం కావు" అని ఓ రాజకీయవేత్త అభిప్రాయపడ్డారు.
కమల్ నిర్మొహమాటంగా మాట్లాడతారని, రాజకీయాలకు అవసరమైన మాటల చతురత ఆయనకు లేదని తమిళనాడు రాజకీయ పండితులు అంటున్నారు.
తమిళనాడులో విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగం వంటి అంశాలపై తన ఆలోచనలు ఏమిటి, ఎలా పనిచేయాలనుకుంటున్నారు అనే అంశాలను ఇంకా వివరించాల్సి ఉంది. అంతకన్నా ముందుగా సొంత పార్టీ స్థాపన ప్రణాళిక మీద కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తమిళనాడులోని పరమాకుడి అనే ప్రాంతానికి చెందిన ఎగువ తరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు కమల్‌హాసన్. ఆ కుటుంబంలో న్యాయవాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలైన నటులను - కమల్‌హాసన్ అన్నయ్య చారుహాసన్, ఆయన కుమార్తె సుహాసిని మణిరత్నంలను కూడా ఇచ్చింది.
సినిమాల్లో వాదాలు.. వివాదాలు
కమల్ 50 ఏళ్లలో సాధించిన విజయాలే ఆయన టాలెంట్‌కి నిదర్శనం. ఆయన 1960లో తొలిసారిగా బాల నటుడిగా సినిమాలో నటించారు. అప్పటి నుంచి చాలా భారతీయ భాషల్లో 200 పైగా సినిమాల్లో నటించారు. అనేక ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.
ఆయనకు భరతనాట్యం, కర్ణాటక సంగీతంలోనూ మంచి నైపుణ్యం ఉంది. తను నటించిన చిత్రాలకు కూడా ఆయన పాటలు పాడారు. ఆయన కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు కూడా.
కమల్ సినిమాలు తరచుగా వివాదాలను ఎదుర్కొంటుంటాయి. ఉగ్రవాదంపై పోరాటం (విశ్వరూపం), ముస్లిం ఐడెంటిటీ (హే రామ్)ల నుండి మానవవాదం, మత విశ్వాసం (అన్బే శివం, దశావతారం) వరకూ అనేక అంశాలను ఆయన తన సినిమాల ద్వారా విశ్లేషించారు.
మరి కమల్ సినిమా చరిష్మా రాజకీయాల్లో పనిచేస్తుందా? ఆయన సృజనాత్మక మేథస్సు రాజకీయ వేదిక మీద కూడా ఫలిస్తుందా?
మా ఇతర కథనాలు:
- ‘పవన్, కమల్, ఉపేంద్రలకు ఓటేయొద్దు’
- రజనీకాంత్: ‘కమల్ దారిలో వెళ్లకూడదని.. నా దారి మార్చుకున్నా’
- నచ్చితే పవన్ కల్యాణ్ పార్టీకి మద్దతు: ప్రకాశ్‌రాజ్
- 'నా దేశభక్తిని బలవంతంగా పరీక్షించకండి'
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
- తెలంగాణ జేఏసీ పార్టీగా మారుతోందా? లేదా?
- ఎమ్మెల్యేగా హీరో విశాల్ పోటీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)