You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్: జాతీయగీతం పాడితే నిలబడటమే దేశభక్తికి సంకేతమా?
మీరు సినిమా హాల్‌కి ఎందుకు వెళ్తారు? వినోదం కోసమా లేక మీలోని దేశభక్తిని రుజువు చేసుకోవడానికా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు సినిమా హాల్లో జాతీయ గీతాలాపన, లేచి నిలబడడం, దేశభక్తి వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
దేశభక్తిని నిరూపించుకోవడానికి సినిమా హాళ్లలో లేచి నిలబడాల్సిన అవసరమేమీ లేదని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించడంతో చాలా మందిలో వ్యక్తమైన సందేహాలు ట్వీట్లు, పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి వంటివారు సైతం ఇలాంటి వాటితో తమ దేశభక్తిని ప్రశ్నించవద్దని ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్లు పెట్టారు.
"సింగపూర్లో ప్రతి అర్ధరాత్రీ అక్కడి టీవీల్లో జాతీయగీతం ఆలపిస్తారు. కావాలంటే ఇక్కడ దూరదర్శన్‌లో కూడా అలా చేయండి. కానీ నా దేశభక్తిని ఎక్కడ పడితే అక్కడ బలవంతంగా పరీక్షకు పెట్టొద్దు" అని కమల్ హాసన్ విమర్శించారు.
"జాతీయగీతం ఎప్పుడు, ఎవరు పాడినా నేను నిలబడి, వారితో కలిసి నేనూ పాడతాను. దీనికి నేను గర్వపడతాను. కానీ ఇది సినిమా హాళ్లలో మాత్రమే ఎందుకు తప్పనిసరి చేశారో నాకైతే అర్థం కావడం లేదు" అని సినీ నటుడు అరవింద్ స్వామి ట్వీట్ చేశారు.
ఎక్కడ ఎప్పుడు పాడాలనే దానిపై చర్చ కాదు గానీ, పాడితే నిలబడాల్సిందే అని సంగీత దర్శకుడు అద్నాన్ సామీ తమ భావాల్ని పంచుకున్నారు.
"జాతీయగీతం ఎక్కడ ఆలపించాలి అనే సంగతి సరే, కానీ ఎప్పుడు పాడినా లేచి నిలబడాలి, గౌరవించాలి" అని సామీ ట్వీట్ చేశారు.
రచయిత, కవి జావేద్ అఖ్తర్ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే ట్విటర్లో వ్యక్తం చేశారు. "జాతీయగీతం వినపడగానే ఒక తెలియని భావన మనసులోంచి పొంగుకొస్తుంది. అలా రాలేదంటే వారిలో ఏదో లోపం ఉన్నట్లే."
ఇక దీనిపై సరదా ట్వీట్లైతే చెప్పనవసరం లేదు.
"సినిమా హాళ్లలో జాతీయగీతం సమయంలో నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అంటోంది. కానీ కోర్టులోకి జడ్జిగారు వస్తే మాత్రం ఎందుకు నిలబడాలి?"
"మొఘల్ చక్రవర్తులు చాలా క్రూరులు అని మనం అనుకుంటాం. కానీ వాళ్లే జాతీయగీతం పాడుతున్నప్పుడు నిలబడమని చెప్పలేదు."
"సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటానికి నేను వ్యతిరేకం. కానీ పాడాల్సి వస్తే.. లేచి నిలబడాల్సిన అవసరం లేదు అనడాన్ని నేను సమర్థించను."
"ఔరంగజేబ్‌కి కూడా జాతీయగీతం సమయంలో నిలబడటానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. దంగల్ సినిమా సమయంలో ఆయన నిలబడిన ఫొటో ఇదిగో చూడండి.." అంటూ మరొకరు ఓ ఫన్నీ ట్వీట్ చేశారు.
మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయంపై కొద్దిమంది అసహనాన్ని వ్యక్తం చేశారు.
"జాతీయగీతాన్ని సినిమా హాళ్లలో తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టే. ఇప్పుడు దాన్ని అమలు చేసినందుకు తప్పుబడుతున్నదీ సుప్రీంకోర్టే" అంటున్నారు మధుపూర్ణిమ కిష్వర్
"ఒకసారి ఉత్తర కొరియాలో కొంతమంది సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించినపుడు నిలబడటానికి ఆసక్తి చూపించలేదు. అప్పటినుంచి అక్కడ సినిమాలను నిషేధించారు" అని కిమ్ పేరుతో ఉన్న ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)