అమెరికా అధ్యక్షుడు ట్రంప్: తొలి ఆసియా పర్యటన వ్యూహాలు, నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి అధికారిక ఆసియా పర్యటన మొదలైంది. ఆయన జపాన్‌లో దిగారు.

ఈ నెల 14 వరకూ జపాన్, దక్షిణ కొరియా, చైనాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత వియత్నాం, ఫిలిప్పైన్స్‌లకు వెళ్తారు.

ఉత్తర కొరియాతో ఉన్న అణుముప్పు దృష్ట్యా యూఎస్‌తో ఆసియాన్ దేశాల ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశంగా కనబడుతోంది. ఆసియా దేశాల నేతలతో జరిగే సమావేశాల్లో సైతం ఈ అంశమే ప్రధానంగా చర్చకు రావొచ్చు.

12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్‌ (టీపీపీ)పై అమెరికా విధానం ఎలా ఉండబోతోందనే దానిపైనా ఆసక్తి నెలకొంది. ట్రంప్ అధ్యక్షుడైన నెలరోజుల్లోనే అమెరికా దీనినుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

మూడురోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న ట్రంప్, ప్రధాని షింజో అబేతో సమావేశమవుతారు. అబే ప్రతిపాదిస్తున్న అబేనామిక్స్ ప్యాకేజీ అమలుకు టీపీపీలో అమెరికా కొనసాగడం చాలా ముఖ్యమని జపాన్ నాయకత్వం భావిస్తోంది. అమెరికా లేకపోతే ఈ ఒప్పందానికి అసలు విలువే లేదనేది జపాన్ భావన.

దక్షిణ కొరియాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అమెరికాతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. కోరస్ నుంచి వైదొలుగుతామని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చకు రావొచ్చు. ఉత్తర కొరియాతో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికాకు కూడా ఈ ఒప్పందం అవసరమే.

తర్వాత చైనాలో రెండు రోజులు పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. బీజింగ్ విషయంలో అమెరికా విధానం ఎలా ఉండబోతోందనే దానిపై ఈ పర్యటన ద్వారా స్పష్టత రావచ్చని అందరూ ఆశిస్తున్నారు. ఉత్తర కొరియా అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇరు దేశాలూ ఓ ప్రకటన చేయవచ్చని అమెరికాలో చైనా రాయబారి క్యూ టియాంకై వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ భద్రతపై అమెరికా ఎలాంటి ప్రకటన చేస్తుందోనని ఆసియాన్, అపెక్ దేశాలు సైతం ఎదురుచూస్తున్నాయి. 10, 11 తేదీల్లో వియత్నాంలో జరగనున్న అపెక్ సదస్సులో ట్రంప్ పాల్గొననున్నారు. ఆసియాన్ 50 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా మద్దతుపై అమెరికా అనుకూలంగా స్పందించవచ్చనుకుంటున్నారు.

ఫిలిప్పైన్స్‌లో జరిగే తూర్పు ఆసియా సదస్సుకు హాజరుకాకూడదని ట్రంప్ నిర్ణయించుకోవడాన్ని చూస్తుంటే చైనా ప్రభావానికి అమెరికా లొంగిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ గతంలో ఏ అమెరికా అధ్యక్షుడూ ప్రాంతీయ సదస్సుల్లో పాల్గొనలేదని, అందుకే ట్రంప్ కూడా ఈ సదస్సుకు వెళ్లడం లేదనే వాదనా వినిపిస్తోంది.

నవంబర్ 10న అపెక్ సమావేశాల్లో ట్రంప్ చేయబోయే ప్రసంగమే ఈ పర్యటనలో అన్నింటికన్నా ముఖ్యమైన అంశం. ఇండో-పసిఫిక్ స్వేచ్ఛా వాణిజ్యంపై ఆయన ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు. తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో చైనాకు దీటుగా నిలబడగలిగే దేశం భారత్‌ మాత్రమేనని ట్రంప్ భావిస్తుండటమే దీనికి కారణమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)