You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొలరాడోలో జాగర్ బహిరంగ మలవిసర్జనపై ఫిర్యాదు
అమెరికాలోని కొలరాడో రాష్ట్ర పోలీసులు ఒక గుర్తుతెలియని మహిళా జాగర్ కోసం గాలిస్తున్నారు. ఆమెను ’పిచ్చి జాగర్‘గా అభివర్ణిస్తున్నారు.
కొలరాడో స్ప్రింగ్స్ నగరంలో తరచుగా ఒక ఇంటి ముందు మలవిసర్జన చేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల ఏడుసార్లు తన ఇంటి ముందు మానవ మలాన్ని గుర్తించామని కేథీ బడ్ అనే మహిళ ఫిర్యాదు చేశారు.
సమీపంలో సామూహిక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ.. ఆ గుర్తు తెలియని మహిళ తన ఇంటి ముందు మలవిసర్జన చేస్తుండగా తాను, తన పిల్లలు చూశామని ఆమె చెప్పారు.
ఇది విపరీత ప్రవర్తన అని పోలీసులు పేర్కొన్నారు.
బహిరంగ మలమూత్ర విసర్జనలను నిషేధించే నగర ఆర్డినెన్స్ కింద అనుమానితురాలిపై అభియోగం నమోదు చేయవచ్చునని లెఫ్టినెంట్ హోవార్డ్ బ్లాక్ బీబీసీకి తెలిపారు.
‘‘నా 35 ఏళ్ల పోలీస్ సర్వీస్‌లో ఇటువంటి ఉదంతాన్ని ఎన్నడూ చూడలేదు‘‘ అని ఆయన చెప్పారు.
మానసిక అనారోగ్యమా?
ఈ ప్రవర్తనలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన అంశాలేమైనా ఉన్నాయా అన్నది తెలియదన్నారు.
తన ఇంటి ముందు మలవిసర్జన చేస్తున్న సదరు మహిళను తాను నిలిపి ఇదేం పని అని అడిగానని కేథీ స్థానిక కేకేటీవీ న్యూస్ స్టేషన్‌కు తెలిపారు.
‘‘నేను బయటకు వచ్చాను. ‘ఇదేం పని? ఇక్కడ, నా పిల్లల ముందు మలవిసర్జన చేస్తావా?‘ అని అడిగాను. ఆమె ‘సారీ’ అని చెప్పింది. బహుశా ఆమె అనుకోకుండా ఇలా చేసిందేమో అనుకున్నాను. మలాన్ని శుభ్రం చేస్తుందని, ఇక ఇటువైపు రాదని అనుకున్నా. కానీ అలా జరగలేదు. తర్వాత రెండు సార్లు ఆమెను పట్టుకున్నాం. నిన్న కూడా పట్టుకున్నాం. నేను చూస్తున్నానని చెప్పి ఆమె కొంచెం టైమ్ మార్చింది‘‘ అని కేథీ వివరించారు.
‘‘నేను వేడుకుంటున్నా. ఇలా చేయొద్దు... అని గోడ మీద బోర్డు కూడా పెట్టాను. కానీ ఆ మహిళ ఆ పని ఆపలేదు‘‘ అని పేర్కొన్నారు.