పంజాబ్-మొహాలీ: దసరా ఎగ్జిబిషన్‌లో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన జెయింట్ వీల్

పంజాబ్‌లోని మొహాలీలో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 అడుగుల ఎత్తులో గుండ్రంగా తిరిగే చక్రం (జెయింట్ వీల్) లాంటిది తిరుగుతూ, తిరుగుతూ కింద పడిపోయింది. ఇందులో సుమారు 50 మంది కూర్చుని ఉన్నారు. వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

మొహాలీలోని ఫేజ్-8లో దసరా ఉత్సవాల సందర్భంగా ఒక మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని పీటీఐ తెలిపింది. అక్కడ జెయింట్ వీల్, ఊయల, రంగుల రాట్నం సహా పలురకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి.

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులందరినీ మొహాలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

నిర్వహాకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.

"ఇక్కడ అంబులెన్స్, పీసీఆర్ లాంటి సౌకర్యాలేమీ లేవు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తరువాత నిర్వాహకులు అక్కడికి వచ్చారు. వాళ్లు తాగేసి ఉన్నారు. ఘటనలో ఎవరూ చనిపోలేదని ఒక మహిళా చీఫ్ చెప్పారు. ఎలాంటి భద్రత, అత్యవసర ఏర్పాట్లు లేకుండా ఈ జాతర ఎలా జరుగుతోంది?" అని ప్రత్యక్ష సాక్షి అన్నారు.

ప్రమాదం జరుగుతుండగా రికార్డయిన వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది.

ఆస్పత్రిలో చేర్చినవారికి పెద్దగా గాయాలు కాలేదని సివిల్ హాస్పిటల్ డాక్టర్ సుభాష్ ఏఎన్ఐకి తెలిపారు.

ఎగ్జిబిషన్ నిర్వహణకు అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు డీఎస్పీ హరిసిమ్రన్ సింగ్ బల్ తెలిపారు. నిర్వాహకుల నుంచి తప్పు ఉన్నట్టు నిరూపణ అయితే, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)