పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ: హంగులు ఎక్కువ... విషయం తక్కువ

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

క‌మ‌ర్షియ‌ల్ సినిమా అన‌గానే ద‌ర్శ‌కుల‌కు ఎన‌లేని స్వాతంత్య్రం వ‌చ్చేస్తుంది. హీరోయిజం, ఎలివేష‌న్లు, ఫైట్లు, పాట‌లు... వీటిమ‌ధ్య ఓ చిన్న క‌థ‌.. ఇది స‌రిపోతుంది అనుకుంటారు. కొంత‌మంది `ఇవి చాలు.. క‌థ లేక‌పోయినా ఫ‌ర్వాలేదు` అని లెక్క‌లేసుకుంటారు.

నిజానికి క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ట‌యిన ఏ సినిమానైనా తీసుకోండి, ఆ సినిమాల‌న్నీ ఊర‌కే హిట్ట‌యిపోలేదు. క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ల వ‌ల్లే ఆడేయ‌లేదు. వాటిని అల్లుకొంటూ, కాపాడుకుంటూ... ఓ క‌థో, ఏ ఎమోష‌నో.. న‌డిచి ఉంటుంది. అందుకే... ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టి ఉంటారు.

దురదృష్టవశాత్తు, కొందరు మాత్రం క‌మ‌ర్షియ‌ల్ అంశాల మ‌ధ్య అంత‌ర్లీనంగా ఉండే ఆ బ‌ల‌మైన పాయింట్‌ను మ‌ర్చిపోయి, కేవ‌లం హంగుల వ‌ల్లే సినిమా ఆడింద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తారు. అవే న‌మ్ముకొని సినిమా తీస్తారు. అయితే, క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ తెలిసిన గోపీచంద్‌, దాన్ని బ‌లంగా ఫాలో అయ్యే మారుతి, ఎప్పుడూ క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూసర్ బ‌న్నీ వాసు... ముగ్గురూ క‌లిసి చేసిన ఈ పక్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఎలా ఉంది? ఇందులో విష‌యం ఎంత‌? వివ‌రాల్లోకి వెళ్తే?

తండ్రీ కొడుకుల స‌వాల్‌!

సూర్య నారాయ‌ణ‌ మూర్తి (స‌త్యరాజ్‌) నిజాయ‌తీపరుడైన న్యాయ‌మూర్తి. త‌న వ‌ల్ల ఓ ఆడ‌కూతురికి అన్యాయం జ‌రిగింద‌నే బాధతో న‌ల్ల‌కోటుని వ‌దిలేస్తాడు. అయితే, ఆయన కొడుకు ల‌క్కీ (గోపీచంద్‌) తండ్రి బాట‌లోనే న‌డిచి `లా` చ‌దువుతాడు. లాయ‌ర్‌గా మార‌తాడు. అయితే ఒక్క‌టే తేడా. తండ్రి నాన్ క‌మ‌ర్షియ‌ల్ అయితే, ల‌క్కీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. తండ్రి ముందు నీతిగా, న్యాయంగా, ధ‌ర్మంగా ఉంటున్నాడ‌నే క‌ల‌రింగ్ ఇస్తూ.... లోప‌ల ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా మారిపోతాడు. సూట్ కేసు బ‌రువుని బ‌ట్టి కేసు వాదించి, నేర‌స్థుల్ని కూడా నిర్దోషిగా నిరూపించి, వాళ్ల‌ని గెలిపిస్తుంటాడు. వివేక్ (రావు ర‌మేష్‌) ప‌క్కా క్రిమిన‌ల్ అని తెలిసి... త‌న కేసుల్ని వాదించే ప‌ని పెట్టుకొంటాడు. ఒక‌ప్పుడు వివేక్ వ‌ల్లే... సూర్య నారాయ‌ణ మూర్తి త‌న ఉద్యోగాన్ని వ‌దులుకోవాల్సివ‌స్తుంది. ఇప్పుడు అదే వివేక్ కోసం.. ల‌క్కీ ప‌ని చేయ‌డాన్ని ఆయన జీర్ణించుకోలేక‌పోతాడు. అందుకే పాతికేళ్ల క్రితం వ‌దిలేసిన న‌ల్లకోటుని మ‌ళ్లీ తొడుక్కుంటాడు. కొడుకుపై స‌వాల్ విసురుతాడు. మ‌రి ఈ తండ్రీ కొడుకుల స‌వాల్‌లో ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడారు? అనేదే మిగిలిన క‌థ‌.

ప‌క్కా రొటీనే...!

ఇది ప‌క్కా క‌మర్షియ‌ల్ సినిమా అని ముందే చెప్పేశాడు మారుతి. కాబ‌ట్టి... కొత్త‌గా ఆశించ‌డానికి, ఆలోచించ‌డానికి ఏం లేదు. అయితే... ఎంత క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయినా ట్రీట్‌మెంట్ బాగుండాలి. అందులో అయినా వెరైటీ చూపించాలి. కానీ అదీ లేకుండా పోయింది.

స‌త్యరాజ్ ఎపిసోడ్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. త‌ను ఎందుకు, ఎవ‌రి చేతిలో, ఎలా ఓడిపోయాడో చెబుతూ సినిమా మొద‌లెట్టాడు. నిజాయ‌తీని న‌మ్ముకున్న ఓ వ్య‌క్తి ఇంట్లోంచి, నోటుని న‌మ్ముకునే కొడుకు వ‌స్తాడు. ఆ త‌ర‌వాత ల‌క్కీ ఎలా ఎదిగాడు? ల‌క్కీ ఎంత క‌మ‌ర్షియ‌ల్‌గా మారాడో చూపించారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మారుతి త‌న‌దైన స్టైల్‌లో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ అమ‌ర్చుకుంటూ వెళ్లాడు. అందులో కొన్ని ఆక‌ట్టుకొన్నాయి. ఇంకొన్ని తేలిపోయాయి.

సీరియ‌ల్ ఆర్టిస్టుగా హీరోయిన్‌ను ప‌రిచేయం చేశాడు మారుతి. తెలుగు సినిమాలో హీరోయిన్‌కి ఈ టైపు పాత్ర రాసుకోవ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. అయితే, ఆ సీన్లు మ‌రీ లెంగ్తీగా సాగ‌డం, ప్ర‌తీ సీన్‌లోనూ.. ఒకే మేట‌ర్ చెబుతుండ‌డంతో.. రాను రాను.. లాయ‌ర్‌ ఝాన్సీ పాత్ర కూడా విసుగు పుట్టిస్తుంది.

ఇదొక్క‌టే కాదు, ప్ర‌తి విష‌యంలోనూ మారుతి ఈ `అతి` వ‌దులుకోలేక‌పోయాడు.

సినిమాలో సినిమాకి సంబ‌ధించిన రిఫ‌రెన్సులు ఎక్కువ‌య్యాయి. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అలాంటి సీన్లు ఓకే అనిపిస్తాయి కానీ... మ‌రీ వాటితోనే సీన్లు న‌డిపేయ‌డం ఇబ్బందిగా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఓచోట‌.. హీరోయిన్ `ఇక్క‌డ డైలాగ్ వ‌ద్దు.. పాటైతే బాగుంటుంది` అంటుంది. క‌ట్ చేస్తే పాటేసుకుంటారు. ఇంకోచోట హీరోయిన్ హీరోని కొట్టించ‌డానికి సినిమా ఫైట‌ర్ల‌ని తీసుకొస్తుంది. వాళ్లేమో ట‌చ్ చేయ‌కుండానే సినిమాటిక్ ఎఫెక్టులో ఎగిరెగిరి ప‌డుతుంటారు. ఇవ‌న్నీ సినిమాల‌పై వేసుకొన్న సెటైర్లు. ఓ సినిమాలో సినిమాపై సెటైర్లు వేయ‌డం కామెడీగా ఉంటుంది అని ద‌ర్శ‌కుడు అనుకుని ఉంటాడు. కానీ, సినిమాలోని సీరియెస్‌నెస్‌ను అవి బాగా త‌గ్గించేస్తాయి. క‌థ‌లోకి వెళ్ల‌డానికి అడ్డుప‌డుతుంటాయి.

ఎమోష‌న్ ఎక్క‌డ‌?

మారుతి సినిమాల్లో వినోదంతో పాటు ఎమోష‌న్లు బాగా వ‌ర్క‌వుట్ అవుతుంటాయి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తీరోజూ పండ‌గే విజ‌యాల‌కు అదే కార‌ణం. ఈ సినిమాలో ఆ ఎమోష‌న్ మిస్స‌య్యింది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఛాలెంజ్ అయితే ఉంది కానీ... దాన్ని స‌రిగా చూపించ‌లేక‌పోయాడు. న‌ల్ల‌కోటు వేసుకున్న తండ్రి.. కోర్టు రూమ్‌లో ఒక్క‌సారైనా కొడుకుపై గెలిచి ఉంటే బాగుండేది. కానీ... ఈ సినిమాలో హీరోకి ఎదుర‌న్న‌దే ఉండ‌దు. దాంతో సంఘర్ష‌ణ మిస్స‌య్యింది.

తండ్రీ కొడుకుల మ‌ధ్య సీరియ‌స్ ఎమోష‌న్ న‌డ‌వాల్సిన స‌న్నివేశంలోనూ... రాశీఖన్నా ఎంట‌రైపోయి, దాన్ని కామెడీ చేసేస్తుంటుంది. దాంతో ఎమోష‌న్ ఒక్క‌చోట కూడా క్యారీ అవ్వ‌లేదు.

ఈ సినిమా క‌థ ఇదని చెప్ప‌గానే... క్లైమాక్స్ లో హీరో క‌చ్చితంగా మార‌తాడు అని తెలిసిపోతుంది. ఆ సీన్ కోసం ప్రేక్ష‌కుడూ ఎదురు చూస్తుంటాడు. స‌ద‌రు స‌న్నివేశాన్ని ఎంతో ఆస‌క్తిగా తీర్చిదిద్దితే త‌ప్ప‌... అది ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌దు. అది కాస్త‌... ట్విస్ట‌న్న‌ట్టు స‌ర్‌ప్రైజింగ్ గా రివీల్ చేశాడు ద‌ర్శ‌కుడు.

హీరో ఇంత క‌మ‌ర్షియ‌ల్‌గా ఎందుకు త‌యార‌య్యాడు? అనేదానికి కొన్ని ఫ్లాష్ క‌ట్స్ వేశాడు. దాని వ‌ల్ల ఉప‌యోగ‌మే లేదు. హీరో చెప్పాల్సిన డైలాగుల్ని చివ‌ర్లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌తో చెప్పించారు. అలా చెప్ప‌డం వ‌ల్ల ఓ పాత్ర జోడించాల్సివ‌చ్చింది త‌ప్ప‌... సినిమాకీ, ఈ క‌థ‌కూ అద‌నంగా అందిన ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. సినిమాటిక్ లాంగ్వేజ్ ఎక్కువ‌గా వాడ‌డం, క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని చెప్పుకొన్నాం కాబట్టి లిబ‌ర్టీ ఎక్కువగా తీసుకోవ‌డం.. ఈ క‌థ‌కు ప్ర‌తికూల అంశాలుగా మారిపోయాయి.

క్యాస్టింగ్ భ‌ళా

గోపీచంద్‌, రాశీఖ‌న్నా, స‌త్యరాజ్‌, రావు ర‌మేష్‌, అజ‌య్ ఘోష్‌, స‌ప్త‌గిరి, ప్ర‌వీణ్‌.. అంతా పేరున్న ఆర్టిస్టులే. ఎవ‌రి పాత్ర‌కు వాళ్లు న్యాయం చేశారు. గోపీచంద్ చాలా స్టైలీష్‌గా క‌నిపించాడు. త‌న డ్ర‌స్సింగ్ చాలా బాగుంది. చాలాకాలం త‌ర‌వాత స్టెప్పులు వేసే పాట‌లు దొరికాయి. కామెడీ పండించ‌డంలో త‌న‌కో మార్క్ ఉంది. దాన్ని మారుతి బాగానే వాడుకొన్నాడు.

నిజం, జ‌యం, వ‌ర్షంలో గోపీచంద్ విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. ఇవి మూడూ మిక్స్ చేస్తూ.. ఓ ఫైట్ క్రియేట్ చేశాడు మారుతి. అది గోపీచంద్ ఫ్యాన్స్‌కి న‌చ్చుతుంది. రాశీఖ‌న్నాకి ఇది కొంత వ‌ర‌కూ విభిన్న‌మైన పాత్రే. కానీ మ‌రీ ఓవ‌ర్ యాక్టీవ్‌గా క‌నిపించింది. స‌త్య‌రాజ్ పాత్ర నిడివి ఎక్కువే. స‌త్య‌రాజ్ లాంటి న‌టుడు ఉన్న‌ప్పుడు ఆ పాత్ర‌ని మ‌రింత స‌మ‌ర్థంగా వాడుకోవాల్సింది. రావు ర‌మేష్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకొన్నాడు. `మ‌డిస‌న్నాక కుసింత క‌ళాపోస‌న ఉండాల‌ని మా నాన్న‌గారు అంటుండేవారు` అని రావు గోపాల రావును తల‌పించాడు. చిన్న పాత్ర‌ల‌కు కూడా పేరున్న వాళ్ల‌ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆ లుక్ పూర్తిగా మారిపోయింది.

మారుతి ఎంచుకొన్న క‌థ ప‌ర‌మ రొటీన్‌. ఈ విష‌యం మారుతికీ తెలుసు. కానీ త‌ను కామెడీని, క‌మ‌ర్షియ‌ల్ హంగుల్నీ న‌మ్మాడు. అయితే.. అవి ఈ సినిమాని కాపాడ‌లేక‌పోయాయి. మారుతిపై ఇది వ‌ర‌కు బూతు ముద్ర ఉండేది. దాన్ని చెరిపేసుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది. ఈ సినిమాలో ఓ చోట కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగుల్ని య‌థేచ్ఛగా వాడాడు. నిజానికి అది అవ‌స‌రం లేదు. ఇలాంటి డైలాగుల వ‌ల్ల‌.... తాను వ‌ద్ద‌నుకొన్న ఇమేజ్‌ను మ‌ళ్లీ తిరిగి తీసుకొచ్చి త‌గిలించుకొన్న‌ట్టుగా అనిపిస్తుంది.

గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ప్రొడ‌క్ష‌న్ పరంగా ఖ‌ర్చుకు ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పాట విన‌డానికి చూడ్డానికి బాగున్నాయి. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ న‌చ్చుతుంది. కానీ థియేట‌ర్లో అంత ఊపు మాత్రం రాలేదు.

రొటీన్ క‌థ‌ల‌తో సినిమాని న‌డిపేద్దాం అనుకునే రోజులు కావివి. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమా న‌డిపేద్దాం అంటే కుద‌ర‌ని ప‌ని. ఈ విష‌యం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మ‌రోసారి నిరూపించింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా న‌చ్చేవాళ్ల‌కు కూడా... విసిగించే విష‌యాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)