You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గీతాంజలిశ్రీ నవల 'రేత్ సమాధి'కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
హిందీ నవల 'రేత్ సమాధి'కి దాని రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఒక హిందీ నవలకు మాత్రమే కాదు, భారతీయ భాషల్లో వచ్చిన ఒక రచనకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించడం ఇదే తొలిసారి.
రేత్ సమాధి అంటే ఇసుక సమాధి అని అర్థం.
దేశ విభజన సమయంలో భర్త మరణించిన తర్వాత ఒక 80 ఏళ్ల మహిళ జీవితంలో జరిగిన ఘటనల గురించి ఆమె రేత్ సమాధి నవల చెబుతుంది.
'రేత్ సమాధి' ఇంగ్లిష్ అనువాదం 'టూంబ్ ఆఫ్ శాండ్'కు 2022కు గాను ఈ అంతర్జాతీయ పురస్కారం లభించింది.
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న నవలకు 50 వేల పౌండ్ల (దాదాపు రూ.50 లక్షలు) నగదు బహుమతి అందిస్తారు.
"బుకర్ ప్రైజ్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నేను అది సాధించగలనని అనుకోలేదు. ఇంత గుర్తింపు వచ్చినందుకు ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది" అని గీతాంజలిశ్రీ అన్నారు.
హిందీ రచయితలు ఎవరూ ఇప్పటివరకూ బుకర్ ప్రైజ్ గెలుచుకోలేదు.
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ నవల తనదే అవుతుందని గీతాంజలిశ్రీ చెప్పారని పీటీఐ పేర్కొంది.
"నాకు, ఈ పుస్తకానికి మధ్య హిందీ, ఇతర దక్షిణాసియా భాషల్లో అభివృద్ధి చెందుతున్న సాహిత్య సంప్రదాయం ఉంది. ఈ భాషలకు సంబంధించిన అత్యుత్తమ రచయితల్లో కొందరి గురించి తెలుసుకోవడం వల్ల ప్రపంచ సాహిత్యం సుసంపన్నం అవుతుంది" అని ఆమె అన్నారు.
రాజ్‌కమల్ పబ్లికేషన్స్ ప్రచురించిన 'రేత్ సమాధి' నవల బుకర్ ప్రైజ్ కోసం ఎన్నో నవలలతో పోటీపడి షార్ట్ లిస్ట్ అవడమే కాకుండా, చివరకు దానిని గెలుచుకున్న హిందీ నవలగా నిలిచింది.
ప్రముఖ అనువాదకులు డేసీ రాక్‌వెల్ రేత్ సమాధిని ఇంగ్లిష్‌లో 'టూంబ్ ఆఫ్ శాండ్'గా అనువదించారు.
బుకర్ ప్రైజ్ పురస్కారం కోసం ఈ నవలకు మరో ఐదు నవలలు గట్టి పోటీనిచ్చాయి. 50 లక్షల బహుమతి మొత్తాన్ని రచయిత్రి, అనువాదకులకు సగం సగం అందించనున్నారు.
గీతాంజలిశ్రీ రాసిన ఈ నవలను జ్యూరీ అద్వితీయమైన నవలగా పేర్కొంది.
నిజానికి ఇది చదవాల్సిన నవల. దీనిలోని ఒక కథ అనే దారంతో ఎన్నో దారాలు ముడిపడి ఉంటాయి. పడక పైనుంచి లేవడమే ఇష్టం లేని ఒక 80 ఏళ్ల వృద్ధురాలు, పడక నుంచి లేవగానే అంతా కొత్తగా మారిపోతుంది. ఆ వృద్ధురాలు కూడా కొత్తగా మారుతారు. అది సరిహద్దులను అర్థం లేనిదిగా మార్చేస్తుంది అన్నారు.
గీతాంజలి రచనలు
64 ఏళ్ల గీతాంజలిశ్రీ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురీలో జన్మించారు.
ఆమె గత మూడు దశాబ్దాలుగా నవలలు రాస్తున్నారు. గీతాంజలిశ్రీ తొలి నవల 'మాయీ', రెండో నవల 'హమారా షహర్ ఉస్ బరస్' 1990వ దశకంలో ప్రచురితం అయ్యాయి. తర్వాత ఆమె 'తిరోహిత్', 'ఖాలీ జగహ్' నవలలు రాశారు.
గీతాంజలిశ్రీ ఎన్నో కథల సంపుటాలు కూడా రాశారు. ఆమె రచనలను ఇతర భారతీయ భాషలతోపాటూ ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ సహా ఎన్నో భాషల్లో అనువదించారు. ఆమె నవల 'మాయీ' ఇంగ్లిష్ అనువాదం 'క్రాస్‌వర్డ్ అవార్డ్'కు కూడా నామినేట్ అయ్యింది.
గీతాంజలి రాసిన 'టూంబ్ ఆఫ్ శాండ్' బ్రిటన్‌లో ప్రచురితమైన ఆమె తొలి నవలగా నిలిచింది. హిందీలో 'రేత్ సమాధి' పేరుతో ఈ నవల 2018లో ప్రచురితమైంది.
సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఈ నవల విశ్వవ్యాప్తమైన మనిషి కథలను చెబుతుందని గీతాంజలిశ్రీ బీబీసీతో చెప్పారు.
"పుస్తకంలో ఎన్నో కథలు ఒక చోట కలుస్తాయి. తన జీవితాన్ని పునరావిష్కరించుకోడానికి మరణశయ్యపై నుంచి లేచిన ఒక వృద్ధురాలి కథే ఇది" అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)