You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జ్ఞాన్‌వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుమారు 31 సంవత్సరాల కిందట పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బిల్ (స్పెషల్ ప్రొవిజన్స్) తెచ్చే నాటికి దేశంలో రామ మందిర ఉద్యమం ఉధృతంగా ఉంది.
1947 ఆగస్టు 15 నాటికి మతపరమైన స్థలాలు ఎలా ఉంటే, ఆ తర్వాత కూడా అలాగే ఉండాలని, దాని స్వభావాన్ని మార్చరాదని ఈ చట్టం చెబుతుంది.
"అయోధ్య పాత కేసు. అప్పటికే కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నందున ఆ విషయంలో ఏమీ చేయలేమని నరసింహారావు నిర్ణయించుకున్నారు. మిగతా అన్ని వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బిల్ (స్పెషల్ ప్రొవిజన్స్) ను రూపొందించాలని భావించారు. చట్టం బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దీనికి అంగీకరించాయి" అని 1991లో నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పని చేసిన పి.చిదంబరం గుర్తు చేసుకున్నారు.
న్యాయ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ చట్టాన్ని రూపొందించాలని నరసింహారావు తనను కోరారని, తాను అదే చేశానని చిదంబరం చెప్పారు.
అయితే, ఈ చట్టాన్ని బీజేపీ వ్యతిరేకించింది. బిల్లుపై ఆనాటి చర్చలో ఖజురహో పార్లమెంటు స్థానం సభ్యురాలిగా ఉన్న ఉమాభారతి ప్రతిపక్షం తరఫున ప్రధాన వక్తగా వ్యవహరించారు.
''నేను మొదటి స్పీకర్‌ని కాబట్టి, నాకు ఎక్కువ సమయం ఇచ్చారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కింది" అన్నారు ఉమాభారతి.
ఇది పాత విషయం కాబట్టి గుర్తు పెట్టుకోవడం అంత తేలిక కాదన్న ఉమాభారతి, ఈ చట్టం తీసుకురావడం సరికాదని తమ పార్టీ అప్పట్లో వాదించినట్లు గుర్తు చేసుకున్నారు. ''మా పార్టీ వాకౌట్ చేసింది. అద్వానీజీ అప్పటి మా నాయకుడు'' అని ఉమాభారతి అన్నారు.
''స్వాతంత్ర్యం తర్వాత గత గాయాలను మాన్పడానికి ఇది మా ప్రయత్నం. సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మేం ఈ చట్టం తెస్తున్నాం'' అని ఈ చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో కేంద్ర హోంమంత్రిగా పని చేస్తున్న ఎస్‌బీ చవాన్ లోక్‌సభలో తన ప్రసంగంలో పేర్కొన్నారు.
31 ఏళ్ల తర్వాత ఈ చట్టం మళ్లీ చర్చనీయాంశమైంది. జ్ఞాన్‌వాపి మసీదుపై కోర్టు విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని ముస్లిం వర్గాలు చెబుతున్నాయి.
అయితే, హిందూ పక్షాలు అందుకు అంగీకరించడం లేదు. ఈ చట్టం చెల్లుబాటుపైనే ప్రశ్నలు సంధిస్తున్నాయి.
''చట్టాలు దేశం కోసమే. దేశం ముందు చట్టాలు చాలా చిన్నవి. చట్టాలు మారుతూనే ఉంటాయి. పాత చట్టాలు పోయి కొత్తవి వస్తుంటాయి'' అని ఉమా భారతి అన్నారు.
ఈ చట్టం చేసిన సమయంలో సీపీఎం పార్టీ తరఫున ఎంపీగా ఉన్న మాలినీ భట్టాచార్య బిల్లుకు అనుకూలంగా మాట్లాడారు. ఈ చట్టం కటాఫ్ తేదీ ఆగస్టు 15, 1947గా నిర్ణయించడాన్ని ఆమె సమర్ధించారు. 2019 నాటి సుప్రీంకోర్టు అయోధ్య తీర్పులో మాలినీ భట్టాచార్య ప్రస్తావన కూడా ఉంది.
''దీని అర్ధం బాబ్రీ మసీదుకు ఈ చట్టం వర్తించదని కాదు. మసీదును ఎవరైనా ఏదైనా చేయవచ్చని అర్ధం కాదు. దానిని సురక్షితంగా ఉంచడానికి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పించడం'' అన్నారు భట్టాచార్య.
రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పులో, 1991లో పార్లమెంటు రూపొందించిన ప్రార్థనా స్థలం చట్టాన్ని ప్రస్తావించి, రాజ్యాంగపు ప్రధాన విలువలను ఈ చట్టం పరిరక్షిస్తుందని వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే చట్టంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకారం, ఈ చట్టాన్ని అమలయ్యేలా చూడటం కోర్టుల బాధ్యత. మరి ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని ఆయన ప్రశ్నించారు.
చట్టానికి సంబంధించిన ప్రశ్నలపై చర్చ
పూజలు చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి దిగువ కోర్టు ఆదేశాలు ఇవ్వడంపై కొంత వ్యతిరేకత, కొంత హర్షం వినిపించింది.
''ట్రయల్ కోర్టు వ్యవహరిస్తున్న తీరు, ఈ చట్టం స్ఫూర్తిని పూర్తిగా విస్మరిస్తున్నట్లు నేను భావిస్తున్నాను'' అని అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గోవింద్ మాథుర్ అన్నారు. కోర్టు సర్వేకు అనుమతి ఇవ్వడం తప్పని, అందుకే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జస్టిస్ మాథుర్ అభిప్రాయపడ్డారు.
అయితే, వారణాసి కోర్టు ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించిందన్న వాదనను సుప్రీంకోర్టులో న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ అంగీకరించడం లేదు.
ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ 4లోని ఉప-సెక్షన్ 1లో, ఆగస్ట్ 15, 1947 నాటికి మతపరమైన స్థలం స్థితి ఏదైనప్పటికీ, ఆ తర్వాత కూడా అలాగే ఉండాలని, దాని స్వభావం మార్చరాదని రాసి ఉంది.
అలాగే ఈ చట్టంలోని సెక్షన్ 5లో రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుకు ఈ చట్టం వర్తించదని కూడా రాసి ఉంది.
అయితే, ఈ చట్టం వర్తించకపోవడానికి మూడు షరతులు ఉన్నాయని శ్రీవాస్తవ చెప్పారు.
''ఆగస్ట్ 15, 1947 తర్వాత మతపరమైన ప్రదేశం స్వభావం మారినట్లయితే, ఈ చట్టం ఉన్నప్పటికీ కేసు నమోదు చేయవచ్చని చట్టం చెబుతోంది. అయితే, ఆగస్ట్ 15, 1947 తర్వాత ఆ మతపరమైన స్థలం స్వభావం మారిందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది''
''ఒక మతపరమైన స్థలం 100 సంవత్సరాల కంటే పురాతనమైనదై ఉండి, చారిత్రక ప్రాముఖ్యమున్న స్మారక చిహ్నం లేదా పురావస్తు ప్రదేశం అయినట్లయితే కోర్టు ఆ స్థలంలో సర్వే నిర్వహించవచ్చు. ''
''ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందే విభిన్న పక్షాల మధ్య ఒప్పదం కుదిరినప్పుడు'' అనే ఈ మూడు సందర్భాల్లో ఈ చట్టం వర్తించదని అశుతోష్ శ్రీవాస్తవ వివరించారు.
ఈ చట్టం జూలై 11, 1991 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ముసాయిదా ప్రతి రూపకల్పనలో పాలు పంచుకున్న కాంగ్రెస్ నేత పి. చిదంబర్, "రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం కాకుండా మరి దేనికీ ఈీ చట్టం ఎలాంటి మినహాయింపు ఇవ్వ లేదు" అని అన్నారు.
అదే సమయంలో రిటైర్డ్ జస్టిస్ మాథుర్ ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని, కానీ అవేవీ ఈ కేసుకు వర్తించవని అన్నారు.
చట్టం అమలు గురించి ప్రశ్నలు
1947 ఆగస్టు 15 తర్వాత ఏదైనా మతపరమైన స్థలం స్వభావం మార్చడం కోసం ఏదైనా దావా, అప్పీల్ లేదా ప్రొసీడింగ్ కోర్టులో పెండింగ్‌లో ఉంటే, చట్టం అమలు మొదలైనప్పుడు అది రద్దవుతుందని సెక్షన్ 4 పేర్కొంది.
కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జ్ఞాన్‌వాపి మసీదులో ఒక భాగంలో 'శివలింగం' ఉందని రుజువైతే, హిందువులను అక్కడ పూజలు కొనసాగించమని ఏదైనా కోర్టు ఉత్తర్వు చెప్పగలదా?
‘‘ఆగస్టు 15, 1947న మతపరమైన ప్రదేశానికి కేటాయించిన పాత్ర కొనసాగుతుందని సెక్షన్ 4 చెబుతుంది. కాబట్టి ఇది అస్సలు జరగదు’’ అని జస్టిస్ మాథుర్ అన్నారు.
అయితే, కోర్టు పూజలు చేయడానికి అనుమతించవచ్చని న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
మరి అలాంటి పరిస్థితిలో అది ఆ మందిరం (ఈ సందర్భంలో జ్ఞాన్‌వాపి మసీదు) పాత్ర లేదా స్వభావాన్ని ప్రభావితం చేయలేదా? ప్రార్థనా స్థల చట్టాన్ని ఉల్లంఘించేలా, మసీదు స్వరూపాన్ని మార్చే దిశగా, అక్కడ పూజల కోసం పిటిషన్ పై సర్వే నిర్వహించడం ఒక అడుగుగా పరిగణించకూడదా?
'శివలింగం' స్థలానికి సీలు వేయాలని వారణాసి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఇది బాబ్రీ మసీదు కేసును పునరావృతం చేయడమేనని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
‘‘పిటిషన్‌లోని మహిళలు పూజల కోసం అక్కడికి వెళ్లడానికి అనుమతి కోరుతున్నారు తప్ప మసీదును దేవాలయంగా మార్చమని అడగడం లేదు. ప్రార్థనా స్థలానికి వెళ్లనివ్వమని అడగడానికి చట్టంలో నిషేధం లేదు’’ అని న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు.
చారిత్రక సాక్ష్యాలను చట్టం తారుమారు చేయగలదా?
జ్ఞానవాపి మసీదులో చారిత్రక లేదా పురావస్తు ఆధారాలు దొరికితే, మసీదును శివాలయంగా మార్చవచ్చా?
‘‘ఈ చట్టం ప్రకారం ఇది జరగదు’’అని జస్టిస్ మాథుర్ అనగా, ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను కోర్టులో సవాలు చేశారని, సుప్రీంకోర్టు కేంద్రం నుండి ప్రతిస్పందనను కోరిందని న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ గుర్తు చేశారు.
పూజలు చేయడానికి అనుమతించాలంటూ మహిళలు చేసిన విజ్ఞప్తి మీద వారణాసిలోని స్థానిక కోర్టు వీడియో సర్వేకు ఆదేశించవచ్చా?
"మసీదు బయటి గోడలపై మూడు విగ్రహాలు ఉన్నాయని, అక్కడ కొన్నేళ్ళ వరకు, అంటే1989 వరకు పూజలు జరిగాయని చెబుతున్నారు. ఇది మసీదును దేవాలయంగా మార్చడానికి వేసిన టైటిల్ పిటిషన్ కాదని, మసీదు వెలుపలి గోడపై మూడు విగ్రహాలను పూజించడానికి అనుమతించడానికి సంబంధించిన వివాదమని అంటున్నారు. అలాంటప్పుడు, కోర్టు వీడియో సర్వే చేయాలని ఆదేశించవచ్చా?" అని మాథుర్ ప్రశ్నించారు.
మరో ప్రశ్న ఏమిటంటే, మసీదులో 'శివలింగం' కనిపించిన తర్వాత 1991 చట్టం ఉన్నప్పటికీ కోర్టు విచారణను కొనసాగించగలదా?
జస్టిస్ మాథుర్ ప్రకారం, అక్కడ 'శివలింగం' దొరికిందని భావించినప్పటికీ, పూజా స్థలాల చట్టం, 1991 ఇప్పటికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఇది "ఆలయం ఉందని రుజువు చేయదు."
‘‘ఇది పురాతన స్మారక చిహ్నమని లేదా ఆగస్టు 15, 1947 తర్వాత ఈ స్థలం స్వరూపం మారిందని సర్వే నివేదిక ద్వారా కోర్టుకు తెలిస్తే, అప్పుడు కోర్టు తన విచారణను కొనసాగించవచ్చు’’ అని న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు.
'శివలింగం' ప్రదేశాన్ని సీల్ చేయడం ద్వారా, మసీదును పరిపూర్ణ దేవాలయంగా మార్చడానికి సుప్రీంకోర్టు పాక్షికంగా తలుపులు తెరిచిందా?
‘‘1991 చట్టం ప్రకారం ఎలాంటి విచారణను కొనసాగించవచ్చన్నది సుప్రీంకోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ మాథుర్ అభిప్రాయ పడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కోనసీమ ఉద్రిక్తం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు, మూడు బస్సుల దహనం
- దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)