యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందు 4 సార్లు విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇలా స్వదేశానికి తీసుకొచ్చారు

వీడియో క్యాప్షన్, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఎన్నోసార్లు ఇలా స్వదేశానికి చేర్చారు

యుక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, గతంలో ఇలాంటి యుద్ధ సమయాల్లో ఆయా దేశాల నుంచి భారతీయుల్ని ప్రభుత్వం ఎలా స్వదేశానికి చేర్చింది? ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వాటిని ఇండియన్ గవర్నమెంట్ ఎలా అధిగమించింది?

యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందు భారత్ 4 సార్లు అంటే 1990లో ఇరాక్ - కువైట్ యుద్ధ సమయంలోనూ, అలాగే 2006లో లెబనాన్ యుద్ధం జరిగినప్పుడు, 2011లో లిబియన్ సివిల్ వార్ సమయంలోనూ, 2015లో యెమెన్ యుద్ధం సమయంలోనూ భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించింది.

1990లో కువైట్-ఇరాన్ యుద్ధ సమయంలో భారతీయుల్ని ఎలా రక్షించింది?

1990, ఆగస్టు 2న ఇరాక్‌, కువైట్‌ను ముట్టడించింది. ఆ సమయానికి సుమారు 2 లక్షల మంది భారతీయులు కువైట్‌లో నివాసముంటున్నారు. యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి వల్ల వారు తిరిగి స్వదేశానికి వచ్చేందుకే మొగ్గు చూపారు. కువైట్‌లో ఉన్న భారతీయుల అభ్యర్థన మేరకు వారిని స్వదేశానికి తీసుకురావడంలో భాగంగా నాటి విదేశాంగ మంత్రి ఐ.కె.గుజ్రాల్, అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌తో ఆగస్టు 21న భేటి అయ్యారు. ఆపై భారతీయుల్ని సురక్షితంగా కువైట్ నుంచి తీసుకొచ్చేందుకు ఆయన అనుమతి తీసుకున్నారు.

అయితే అప్పటికే అమెరికా కువైట్ పరిసరాల్లో ఉన్న సముద్ర మార్గంపై నిషేధం విధించింది. అటు కువైట్, బాగ్దాద్‌లలో విమానాల ల్యాండింగ్ పై నిషేధం విధించింది ఇరాక్.

దీంతో భారత్ చాలా తెలివైన వ్యూహాన్ని అనుసరించింది. సుమారు లక్ష ఇరవై వేల మంది భారతీయుల్ని బస్సుల ద్వారా 1120 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్డాన్‌కు తరలించింది. భారతీయులకు తాత్కాలికంగా వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు జోర్డాన్ అంగీకరించింది. ఆపై భారతీయుల్ని అధికారులు అమ్మన్‌కు తరలించి, అక్కడ నుంచి ముంబైకి సురక్షితంగా విమానాల్లో తీసుకొచ్చారు.

ఈ ఆపరేషన్ సుమారు 2 నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. రోజుకు 16 నుంచి 18 గంటల ప్రయాణం. అక్టోబర్ చివరి వరకు సుమారు 448 ట్రిప్స్ వేసింది ఇండియన్ ఎయిర్ లైన్స్. గల్ఫ్ ప్రాంతం నుంచి దాదాపు లక్ష పది వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చారు.

ఆపరేషన్ సుకూన్

2006 జులై 12 హెజ్బొల్లా-ఇరాకీ సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణలు లెబనాన్ యుద్ధానికి దారి తీశాయి. అప్పటికి లెబనాన్లో సుమారు 10 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సుమారు 2వేల మంది విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. అటు నేపాల్, శ్రీలంక దేశాలు తమ దేశస్థుల్ని కూడా సురక్షితంగా స్వదేశాలకు తీసుకొని రావాలని భారత్‌ను అభ్యర్థించాయి.

సరిగ్గా అదే సమయానికి ఇండియన్ నేవీకి చెందిన 54వ టాస్క్ ఫోర్స్ బృందం మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణంలో ఉంది. ఆ టాస్క్ ఫోర్స్‌లో ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర, ఐఎన్ఎస్ బెత్వా అలాగే ఫ్లీట్ ట్యాంకర్ ఐఎస్ఎస్ శక్తి ఉన్నాయి. ఆ సమయానికి ఫ్లీట్ సుయిజ్ కెనాల్ సమీపంలో ఉంది. అయితే ఒక్కసారి సూయిజ్ కెనాల్లోకి ప్రవేశిస్తే అక్కడ నుంచి లెబనాన్ వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో వెంటనే నౌకలన్నింటికి లెబనాన్ వెళ్లాలలని అక్కడ భారతీయుల్ని రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అక్కడ నుంచి సైప్రస్ వరకు సముద్ర మార్గంలో తీసుకొచ్చి, అపై సైప్రస్ నుంచి వాయు మార్గంలో తీసుకొని రావాలన్నది భారత్ ప్లాన్. అప్పటికప్పుడు మన ప్రభుత్వం సైప్రస్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపి భారతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు తీసుకొంది.

మొత్తంగా 2,280 మందిని కాపాడగా వారిలో 1794 మంది భారతీయులు, 112 మంది శ్రీలంక వాసులు, 64 మంది నేపాలీలు ఉన్నారు. వారిలో భారతీయుల్ని వివాహం చేసుకొన్న లెబనీయులు కూడా ఉన్నారు. వీరితో పాటు మరి కొందర్ని కూడా కాపాడాలంటూ భారత అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో వారిని కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయ నేవీ ఆధ్వర్యంలో జరిగిన అతి పెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇది.

2011 లిబియా సివిల్ వార్

ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో అప్పటి అధ్యక్షుడు గడాఫీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. 2011 ఫిబ్రవరి 15 నాటికి ఈ ఆందోళనలు సివిల్ వార్‌గా మారాయి.

ఆ సమయానికి సుమారు 18 వేల మంది భారతీయులు లిబియాలో ఉన్నారు. అప్పటికే ట్రిపోలి ఎయిర్ పోర్ట్‌లో తీవ్రమైన గందరగోళం, అలజడి నెలకొని ఉన్నాయి. మరో అంతర్జాతీయ విమానాశ్రయం బెనీనా రన్ వే అప్పటికే పూర్తిగా ధ్వంసమయ్యింది.

లిబియాలో ఉన్న భారతీయుల్ని రక్షించేందుకు ఫిబ్రవరి 26న ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ఆదిత్య, ఐఎన్ఎస్ జలాశ్వ నౌకల్ని భారత ప్రభుత్వం పంపింది. వాటితో పాటు మరో రెండు కమర్షియల్ నౌకలు స్కోషా ప్రిన్స్, 1600 సీట్ల సామర్థ్యం కల్గిన ల సుపర్బెలను పంపించింది. కేవలం 2 రోజుల్లోనే లిబియాలోని బెంగాజీ నౌకాశ్రయానికి స్కోషా ప్రిన్స్ నౌక చేరుకుంది. బెంగాజీ, ట్రిపోలీ ప్రాంతాల్లో నివాసముంటున్న భారతీయుల్ని అలెగ్జాండ్రియాకు తీసుకొచ్చింది ఈ నౌక. అక్కడ నుంచి వాయు మార్గం ద్వారా వారిని ఇండియాకు తరలించారు.

ట్రిపోలీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అనుమతులు వచ్చిన వెంటనే 500 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సభా ఎయిర్ పోర్ట్ నుంచి 1000 మందిని, అలాగే సియరట్ ఎయిర్ పోర్ట్ నుంచి మరో 1000 మందిని భారత్ తీసుకొచ్చారు.

మరి కొంత మంది భారతీయులు కాలినడకన ఈజిప్టు సరిహద్దుల్ని చేరుకోగా, అక్కడ భారతీయ అధికారులు వారిని విమానాల ద్వారా ముంబై చేర్చారు. సుమారు 15 వేల మంది భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన అనంతరం మార్చ్ 11న ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

ఆపరేషన్ రాహత్

2015 మార్చి 27న అరబ్ సంకీర్ణ దళాలు యెమెన్‌లోకి ప్రవేశించి హుతీ రెబల్స్ పై దాడి చేశాయి. అప్పటికే యెమెన్లో చాలా ప్రాంతాలు రెబల్స్ అధీనంలోకి వెళ్లిపోయాయి.

అంతకుముందే అంటే జనవరి 21 నాటికే అంటే అరబ్ దళాలు దాడి చేసిన సమయంలోనే తక్షణం యెమెన్ దేశాన్ని విడిచి పెట్టి వచ్చేయాలంటూ భారత విదేశాంగ శాఖ భారతీయులకు విజ్ఞప్తి చేసింది. అప్పటికి సుమారు 5 వేల మంది భారతీయులు యెమెన్ దేశంలో ఉండేవారు.

అప్పటికి అది నో ఫ్లైజోన్ కావడంతో ఆపరేషన్ మొత్తం సముద్ర మార్గానే జరిగింది. మొదట సుమారు 5 నేవీ నౌకల్ని ఈ ఆపరేషన్ కోసం వినియోగించారు. ప్రయాణీకులు డ్జిబూటీ చేరుకోగానే అక్కడ నుంచి వారికి కార్గో విమానాల్లో భారతీయ వైమానిక దళం స్వదేశానికి చేర్చింది.

ఆ ఆపరేషన్లో మొత్తం 4640 మంది భారతీయుల్ని, 960 మంది విదేశీయుల్ని రక్షించారు. ఏప్రిల్ 11న ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)