You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్ విషయంలో అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యాతో సంబంధాలలో సమతౌల్యతను కొనసాగించడంలో ఇండియా తీవ్రమైన పరీక్షను ఎదుర్కుంటోంది.
ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో ఈ అంశంపై దిల్లీ చేసిన మొదటి ప్రకటనలో నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించలేదు. అయితే దౌత్యానికి, చర్చలకు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన పిలుపులను పట్టించుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
రష్యాపై పరోక్షంగా చేసిన విమర్శ అంతటితోనే ఆగిపోయింది. యుక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్ఎస్‌సి) ముసాయిదా తీర్మానంపై ఓటు వేయడానికి ముందు, సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీకి అటు రష్యా, యుక్రెయిన్, ఇటు అమెరికాల నుంచి కాల్స్ వచ్చాయి.
సరైన నిర్ణయం తీసుకోవాలంటూ యుక్రెయిన్, రష్యాలు బహిరంగంగానే ఇండియాకు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఇండియా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, దాని ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని పరోక్షంగా మాస్కోను కోరినట్లు అర్ధమవుతుంది.
ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు గౌరవం ఇవ్వడం గురించి ఇండియా తన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించింది.
''అన్ని సభ్య దేశాలు నిర్మాణాత్మక మార్గాన్ని కనుగొనడంలో ఈ సూత్రాలను గౌరవించాల్సిన అవసరం ఉంది'' అని ఇండియా తన ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలా ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరో ఆప్షన్ లేదు
''ఈ పరిస్థితుల్లో ఇండియాకు సరైన ఆప్షన్లు లేవు'' అని భారత మాజీ దౌత్యవేత్త జె.ఎన్.మిశ్రా బీబీసీతో అన్నారు.
''ఒకరు ఇరువైపులా మొగ్గు చూపడం కష్టం. భారత్ ఏ దేశం పేరునూ ప్రస్తావించలేదు. అంటే తాను మాస్కోకు వ్యతిరేకంగా లేను అని చెప్పడం దీని ఉద్దేశం. ఇక్కడ ఒక పక్షాన్ని ఎంచుకోవడంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇండియా ఆ పని చేయగలిగింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్ విషయంలో భారత్ దౌత్యపరమైన సమతుల్యత కొనసాగించాలన్న ప్రయత్నాలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనవి మాస్కోతో భారతదేశపు రక్షణ, దౌత్య సంబంధాలు.
రక్షణ రంగంలో సొంత తయారీ వ్యవస్థల ఏర్పాటుకు దిగడంతో రష్యా నుంచి ఇండియా ఆయుధాల కొనుగోళ్ల వాటా 70% నుంచి 49% శాతానికి పడిపోయినప్పటికీ, ఇప్పటికీ రష్యాయే అతిపెద్ద రక్షణ ఆయుధాల సరఫరాదారు.
అలాగే రష్యా ఎస్-400 అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌కు సరఫరా చేస్తోంది. చైనా, పాకిస్తాన్‌లను ఎదుర్కొనే క్రమంలో ఇది అత్యంత ముఖ్యమైన రక్షణ వ్యూహం. అమెరికా ఆంక్షలు, బెదిరింపులకు దిగినప్పటికీ భారత్ వీటిని రష్యా నుంచి కొనుగోలు చేస్తూనే ఉంది.
రక్షణ సామాగ్రి ముఖ్యం
అనేక సమస్యలపై రష్యాతో దశాబ్దాల దౌత్య సహకార చరిత్రను దిల్లీ అంత సులభంగా విస్మరించలేదు. కశ్మీర్‌ను ద్వైపాక్షిక సమస్యగా ఉంచడంలో భారత్‌కు సహాయపడటానికి మాస్కో గతంలో భద్రతామండలి తీర్మానాలను వీటో చేసింది. ఈ నేపధ్యంలో భారత్ ఎవరికీ ఇబ్బంది కలగకుండా 'చర్చలతో పరిష్కారం' అనే నినాదాన్ని అందుకున్నట్లు కనిపిస్తోంది.
ఇది భారతదేశం ఇంతకు ముందు నుంచీ అనుసరిస్తున్న వ్యూహమేనని, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని విల్సన్ సెంటర్ అనే థింక్ ట్యాంక్ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు. ''యుక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు దిల్లీకి రుచించకపోవచ్చు. కానీ అది తన వైఖరిని మార్చుకునే అవకాశం లేదు'' అని ఆయన అన్నారు.
రక్షణ, భౌగోళిక రాజకీయ అవసరాల కారణంగా ఇండియా ఆ వ్యూహం నుంచి పక్కకు తప్పుకోలేదని కుగెల్‌మాన్ అన్నారు. యుక్రెయిన్‌లో పరిణామాలు తనకు నచ్చలేదని చెప్పేందుకు ఇండియా తన ప్రకటనలో కొన్ని బలమైన పదాలను వాడిందని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇక యుక్రెయిన్ నుంచి 20,000 మంది పౌరులను, అందులోనూ ఎక్కువమంది విద్యార్థులను స్వదేశానికి తరలించడం కూడా భారత్ ముందున్న అతి పెద్ద సవాల్.
''తన పౌరుల భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉన్నచోట భారతదేశం ఒకపక్షం వైపు మొగ్గు తీసుకోవడం కష్టం. అంతే కాకుండా, అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలన్న వ్యూహాన్ని భారత్ కొనసాగిస్తోంది'' అని మాజీ భారత దౌత్యవేత్త అనిల్ త్రిగుణియత్ అన్నారు. మాస్కోలో పని చేసిన అనుభవమున్న త్రిగుణియత్, 2011లో లిబియా నుంచి భారత పౌరులను తరలించే ప్రక్రియలో పాల్గొన్నారు.
ఒక విధంగా, ఇటు అమెరికా, అటు రష్యాలతో సత్సంబంధాలు కొనసాగించే దేశాలలో భారతదేశం ఒక ప్రత్యేక స్థానంలో ఉంది.
యుక్రెయిన్ వ్యవహారంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడితో మాట్లాడగా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వాషింగ్టన్‌లో అధికారులతో చర్చలు జరిపారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీతో కూడా మోదీ చర్చలు జరిపారు. రెండు వైపులా దౌత్య మార్గాలను తెరిచి ఉంచడంలో భారతదేశం సమర్ధవంతంగా వ్యవహరించిందని త్రిగుణియత్ అభిప్రాయపడ్డారు.
"భారత్ నేరుగా రష్యాను విమర్శించలేదు. అంటే దాని అర్ధం యుక్రెనియన్ల బాధలపట్ల భారత్‌కు బాధ లేదని కాదు. దౌత్యపరంగా సమతౌల్య విధానాన్ని అవలంబించింది. భద్రతా మండలిలో దేశాల ప్రాదేశిక సమగ్రత గురించి గట్టిగా మాట్లాడింది. ఇది యుక్రెయిన్ దుస్థితిని హైలైట్ చేయడానికి ఉద్దేశించిన వ్యూహం'' అని త్రిగుణియత్ అభిప్రాయపడ్డారు.
అయితే, వాషింగ్టన్, దాని యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగిస్తే, మాస్కోతో వ్యాపారాన్ని కొనసాగించడం భారత్‌కు కష్టంగా మారొచ్చు.
మున్ముందు కూడా సవాళ్లు
ప్రస్తుతానికి భారతదేశపు స్థితిని అమెరికా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అది కొనసాగుతుందని ఎటువంటి హామీ లేవు.ఇటీవల భారత వైఖరి గురించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను అడిగినప్పుడు, ఆయన ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. ''మేము భారతదేశంతో (ఉక్రెయిన్‌పై) సంప్రదింపులు జరపబోతున్నాము. ఆ పని ఇంకా పూర్తి కాలేదు'' అని ఆయన అన్నారు.
రష్యా నుంచి ఎస్-400ల కొనుగోలు మీద ఆంక్షల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థిక, రాజకీయ ఆంక్షలతో రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలను లక్ష్యంగా చేసుకోవడానికి 2017లో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (కాట్సా)ను అమెరికా తీసుకొచ్చింది. ఈ దేశాలతో ఏ దేశమైనా రక్షణ ఒప్పందాలపై సంతకం చేయకుండా కాట్సా అడ్డుకోగలదు.
రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయడానికి ముందు కూడా వాషింగ్టన్ ఈ విషయంలో ఇండియాకు ఎటువంటి మినహాయింపులు వాగ్దానం చేయలేదు. ఈ సమస్య ఇండియా, అమెరికాల మధ్య బేరసారాలకు అవకాశంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇక ఇటు రష్యా కూడా తన విషయంలో ఇండియా వైఖరిలో మార్పులు వస్తే, దాని చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడం ద్వారా ఒత్తిడి పెంచవచ్చు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో ఇండియాకు పెరుగుతున్న సంబంధాలను రష్యా అంగీకరించింది. అయితే యుక్రెయిన్ విషయంలో దిల్లీ రెడ్‌లైన్ దాటరాదని రష్యా భావిస్తోంది.
యుక్రెయిన్ సమస్య సుదీర్ఘంగా కొనసాగి, ద్విధ్రువ ప్రపంచం ఏర్పడితే, ఇలాంటి సమస్యలు అనేకం పుట్టుకొస్తాయని కుగెల్‌మాన్ అన్నారు. "అది జరగరాదని ఆశిద్దాం. కానీ జరిగితే మాత్రం భారతదేశ విదేశాంగ విధానానికి అది అగ్ని పరీక్షే'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా అణు బాంబులు వేస్తుందా? అణ్వాయుధాలను ప్రయోగిస్తే పాశ్చాత్య దేశాలు ఏం చేస్తాయి?
- నవీన్ శేఖరప్ప: ‘ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’
- వోడ్కా బ్యాన్: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు
- పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?
- యుక్రెయిన్‌లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్ల కన్సల్టేషన్.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)