You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జమ్మలమడక పిచ్చయ్య: బాల్ బ్యాడ్మింటన్ తెలుగు తేజం 104వ ఏట అస్తమయం
వెటరన్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు జమ్మలమడక పిచ్చయ్య వరంగల్ లో ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. క్రీడారంగంలో విశిష్ట కృషికి భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకున్న పిచ్చయ్య వయసు 104 ఏళ్లు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
పిచ్చయ్య తన నైపుణ్యంతో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు వన్నె తెచ్చారు. ఇటీవలే, డిసెంబర్ 21న ఆయన తన 104వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆయన కృష్ణా జిల్లా కూచిపూడిలో 1918 డిసెంబర్ 21న నాగమ్మ, పున్నయ్య దంపతులకు జన్మించారు. వారి కుటుంబం ఉపాధి కోసం 1945లో వరంగల్‌కు వచ్చింది.
పిచ్చయ్య వరంగల్ లోని 'ఆజంజాహీ మిల్లు' లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వరంగల్‌లోనే స్పోర్ట్స్ ఆర్టికల్ షాపును చాలాకాలం నడిపారు.
బ్యాడ్మింటన్ క్రీడలో జమ్మలమడక పిచ్చయ్యది మూడు దశాబ్ధాలకు మించిన సుదీర్ఘమైన కెరీర్. 1955-1970 మధ్య కాలంలో ఆయన కెప్టెన్‌గా 9 సార్లు జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు.
ఆయన తన 53 వ ఏట 1970లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డును అందుకున్నారు. ఈ క్రీడలో అర్జున అవార్డ్ అందుకున్న తొలి వ్యక్తి పిచ్చయ్య కావడం విశేషం.
బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో పిచ్చయ్య నైపుణ్యం పై వరంగల్ లో కథలు కథలుగా చెప్పుకుంటారు.
'ఆయన బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కోర్ట్‌లో ఓ మూలన రూపాయి నాణెం ఉంచి దాన్ని గురిచూసి కొట్టేవారు. ఆ సందర్భంలో చాలా ఆశ్చర్యపోయేవాళ్లం' అని వరంగర్ జిల్లా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ బీబీసీ తో అన్నారు.
'వరంగల్ లో క్రీడల అభివృద్దికి పిచ్చయ్య విశేష కృషి చేశారు. యువతరానికి స్పూర్తి ప్రదాత. గొప్ప క్రీడాకారుడు. అర్జున అవార్డీని అన్న గర్వం లేకుండా సామాన్యుడిలా కలివిడిగా ఉండేవారు. ఆయన నాటకాలు కూడా ఇష్టపడేవారు. తన సోదరుడు కృష్ణమూర్తి తో కలిసి నాటకరంగం అభివృద్దికి ఈ ప్రాంతంలో కృషి చేశారు' అని బండ ప్రకాశ్ వివరించారు.
వరంగల్ కు వచ్చిన తొలిరోజుల్లో భద్రకాళీ చెరువు లో ఈత కొట్టడం ఆయన రోజువారి వ్యాపకంగా ఉండేది. ఆయన దేశాయిపేటలోని తన అక్క ఇంట్లో నివసించేవారు.
పిచ్చయ్య మృతి పట్ల ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
"పిచ్చయ్య మరణం క్రీడారంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేశారు" అని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- SCAM ALERT: ‘నా దగ్గర నూటికి నూరు శాతం లాభం వచ్చే ప్రాజెక్ట్ ఉంది.. రోజుకు రూ.150 - 800 సంపాదించవచ్చు’
- జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ-ముస్లిం మైత్రి: భయంకరమైన మంటల్లో కూడా చెదిరిపోని ఇద్దరు యువకుల స్నేహం
- Photo Feature: ఒడిశాలో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పం, క్రిస్మస్ గిఫ్ట్ అందుకున్న రైనో
- ఆంధ్రప్రదేశ్: భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సాదరంగా ఆహ్వానం పలికిన సీఎం జగన్ - Newsreel
- జో బైడెన్: ‘లెట్స్ గో, బ్రాండన్...’ అమెరికా అధ్యక్షుడిపై క్రిస్టమస్ రోజున ఓ తండ్రి ప్రాక్టికల్ జోక్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)