You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ-ముస్లిం మైత్రి: భయంకరమైన మంటల్లో కూడా చెదిరిపోని ఇద్దరు యువకుల స్నేహం
- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మాకు స్నేహమే ముఖ్యం. తరువాతే మతం. మాకు హిందూ, ముస్లిం అనే పట్టింపు లేదు. స్నేహానికే మేం పెద్ద పీట వేస్తాం."
పంచమహల్‌కు చెందిన ఖాసీం ఖాన్ మాటలవి.
పంచమహల్‌లోని ఘోఘంబాలో గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ (జీఎఫ్‌ఎల్) కంపెనీలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో గాయపడిన తన స్నేహితుడు అమిత్ కుమార్‌కు ఆస్పత్రిలో సేవ చేస్తున్నారు ఖాసీంఖాన్.
ప్రస్తుతం 25 ఏళ్ల అమిత్ కుమార్ హలోల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్జికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డిసెంబర్ 16న ఘోఘంబాలోని జీఎఫ్ఎల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఈ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన మిగిల్చిన బాధ వారి ముఖాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. శరీరానికి, మనసుకు తగిలిన గాయాలు ఇప్పట్లో మానిపోయేలా లేవు.
ఆస్పత్రిలో ఈ భయానక దృశ్యాల మధ్య మనసును దోచుకున్న సన్నివేశం ఒకటి కనిపించింది.
అదేంటంటే... ఒక హిందు, ఒక ముస్లిం యువకుల మధ్య మైత్రి. ఖాసీం ఖాన్, అమిత్ కుమార్ ఒకరినొకరు "భాయి" అని పిలుచుకుంటారు. రెండు భిన్న మతాల మధ్య సామరస్యానికి సజీవ ఉదాహరణలు వీరిద్దరూ.
వీరి స్నేహం ఎలా మొదలైంది?
అమిత్, ఖాసీం ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్ జిల్లాకు చెందినవారు. అమిత్ కుమార్ ఇంటి పొరుగున ఉన్న ముస్లిం కుటుంబానికి ఖాసీం అల్లుడు.
ఖాసీం తరచూ తన మామగారింటికి వెళుతుండేవారు. అలా వెళ్లినప్పుడు అమిత్‌తో పరిచయం ఏర్పడి కాలక్రమేణ అది స్నేహంగా మారింది.
2020 సంవత్సరంలో ఖాసీం ఉద్యోగం వేటలో గుజరాత్‌కు వచ్చి ఘోఘంబాలోని జీఎఫ్ఎల్ కంపెనీలో చేరారు. 2021లో తన స్నేహితుడు అమిత్‌ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు.
స్నేహితులిద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఒకే చోట కలిసి ఉంటున్నారు.
"మాకు మా స్నేహమే ముఖ్యం. తరువాతే మతం. మాకు హిందూ, ముస్లిం అనే పట్టింపు లేదు. స్నేహానికే మేం పెద్ద పీట వేస్తాం" అని ఖాసీం ఖాన్ బీబీసీకి చెప్పారు.
"మా ఊర్లో కూడా మేం ఎంతో సామరస్యంగా జీవిస్తున్నాం. మా కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నాయి. కూరలు, పళ్లు ఇచ్చిపుచ్చుకుంటాం. మేం వేరు వేరు మతాలకు చెందినవారమన్న భావన మాకెప్పుడూ కలుగలేదు" అని అమిత్ కుమార్ చెప్పారు.
ఆరోజు ఏం జరిగింది?
డిసెంబరు 16వ తేదీ ఉదయం 8 గంటలకు ఎప్పటిలాగే అమిత్ కుమార్ ప్లాంట్‌కు వెళ్లారు.
"ఉదయం 10 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించింది. చుట్టూ పొగ. కళ్లకు ఏమీ కనిపించలేదు. నేను అక్కడి నుంచి బయటపడలేనని అనిపించింది. కానీ, ధైర్యం తెచ్చుకుని యూనిట్ మెట్ల వైపుకు నడక ప్రారంభించాను. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత కింద పడిపోయాను" అంటూ అమిత్ కుమార్ ఆ రోజు జరిగిన ఘటనను వివరించారు.
ఇంతలో మంటలు బాగా వ్యాపించాయి. అమిత్ లేచి నిలబడలేకపోయారు.
"నాకు ఊపిరి ఆడలేదు. చాలా భయమేసింది. ఎలాగోలా మెట్ల మీదకు పాక్కుంటూ వెళ్లాను. అక్కడి నుంచి మెయిన్ గేట్ కనిపించింది. అది కొద్దిగా తెరిచి ఉంది. అది చూశాక ధైర్యం వచ్చింది. అలాగే పాక్కుంటూ గేటు వరకూ వెళ్లాను."
అక్కడి నుంచి బయటపడేసరికి అమిత్ దుస్తులు, ముఖం, చేతులు బాగా కాలిపోయాయి.
"నా పరిస్థితి నాకు అర్థమైంది. అయినా సరే ముందుకు నడించేందుకు ప్రయత్నించాను. ఎక్కడి నుంచో ఖాసీం అరుపు వినిపించింది. నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు."
అమిత్ కుమార్ లాగే ఆరోజు చాలామంది మంటల్లో చిక్కుకుపోయారు. వారంతా ఎలాగోలా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏడుగురు చనిపోయారు
జీఎఫ్ఎల్ ఫ్యాక్టరీ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక యూనిట్‌లో పేలుడు సంభవించింది.
ఆరోజు ఉదయం సుమారు 25 మంది ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటలను అదుపులోకి తెచ్చాక రెండు మృతదేహాలను వెలికితీశారు. సాయంత్రం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. మర్నాడు మరో రెండు మృతదేహాలను గుర్తించారు.
ఈ ఘటన తరువాత ఆగ్రహంతో స్థానికులు కంపెనీపై రాళ్లు రువ్వారని రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ ఘటనకు బాధ్యులు ఎవరు?
ఈ దుర్ఘటనపై ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గానీ, పోలీసులుగానీ ఫిర్యాదు నమోదు చేయలేదు.
సమాచారం కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులో లేరు.
అయితే, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు విలేఖరులకు తెలిపారు.
కంపెనీ నష్ట పరిహారం ప్రకటించిందా?
"జరిగిన ప్రమాదానికి కంపెనీ విచారం వ్యక్తం చేస్తోంది" అని జీఎఫ్ఎల్ అధ్యక్షుడు జిగ్నేష్ షా బీబీసీకి తెలిపారు.
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.
"మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయాలతో అంగవైకల్యానికి గురైన కార్మికులకు రూ.7 లక్షలతో పాటు చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును సంస్థ భరిస్తుంది" అని జిగ్నేష్ షా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
- 1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్ దేవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- 2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..
- సినిమా టికెట్ల వివాదం: నటుడు నాని ఎందుకలా స్పందించారు? మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారు?
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)