క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం టీచర్

వీడియో క్యాప్షన్, క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న టీచర్

ఐఐటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పని చేస్తూ నెలకు దాదాపు లక్షన్నర జీతం సంపాదించేవారు. రెండు మూడు నెలల కిందటే ఎవరోచెబితే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట్లో లాభాలు రావడంతో మరింతగా పెట్టుబడులు పెట్టారు. చివరికి భారీ మొత్తంలో నష్టపోయారు.

ఇది ఖమ్మం జిల్లాకు చెందిన గుండెమెడ రామలింగస్వామి కథ. ఐఐటీ ఫ్యాకల్టీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామలింగస్వామి గత కొంతకాలంగా వివాన్ అనే స్కూలు నడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

మొదట్లో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వచ్చింది. ఆ తరువాత పెట్టుబడులను వివిధ రూపాల్లో సమీకరించి దాదాపు కోటీ 30 లక్షలను క్రిప్టోలో పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆయన పూర్తిగా దెబ్బతిన్నారు. క్రిప్టో మైనింగ్‌లో రామలింగస్వామి దాదాపు 70 లక్షల రూపాయలు నష్టపోయారని ఆయన కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.ఇంట్లోని బంగారం అమ్మినా కూడా ఆయన అప్పులు తీరలేదన్నారు.

కలత చెందిన రామలింగస్వామి నవంబర్ 22న సూర్యాపేటలోని ఒక హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. అందులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

"నేను ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రెషర్ తట్టుకోలేక ఇలా చేశాను. అర్థం చేసుకో. నువ్వు ధైర్యంగా ఉండాలి" అంటూ తన భార్య స్వాతికి చెబుతూ సూసైడ్ నోట్ రాశారు. సర్పంచ్ తన మీత ఒత్తిడి తెచ్చారని, ఖాళీ పత్రాల మీద సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.

ఆయనకు ఇద్దరు పిల్లలు. "తండ్రి చనిపోయినట్లు ఇంకా పిల్లలకు చెప్పలేదు. వాళ్లు చిన్నవాళ్లు. మాకు ఇంకేమీ లేదు. చెప్పడానికేమీ లేదు" అని స్వాతి అన్నారు.

సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

క్రిప్టోకరెన్సీలో నష్టాల కారణంగా ఇప్పటికే పంజాబ్, కేరళ, నోయిడా ప్రాంతాల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే మొదటి కేసని పోలీసులు చెబుతున్నారు.

(హెచ్చరిక: ఈ వీడియో మీ మనసుల్ని కలచివేయవచ్చు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)