You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెట్రోల్ ధరలు: వ్యూహాత్మక చమురు నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేస్తే ధరలు తగ్గుతాయా? 7 ప్రశ్నలకు సమాధానాలు
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో నవంబరు 25నాడు లీటర్ పెట్రోలు ధర రూ.108గా ఉంది. డీజిల్ ధర రూ.95కు అటూఇటూగా కొనసాగుతోంది.
ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడమే దీనికి కారణం.
ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా తమ నియంత్రణలోని ‘‘స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్’’లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అమెరికా ప్రకటించింది.
అమెరికా బాటలోనే తాము కూడా ఈ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి 5 మిలియన్ల బ్యారెళ్లను విడుదల చేయనున్నట్లు భారత్ ప్రకటించింది.
దీంతో అసలు వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే ఏమిటి? భారత్ ఎందుకు చమురును నిల్వ చేస్తోంది? ఎప్పటి నుంచి ఈ విధానం అమలులో ఉంది. వీటిని ఎలా విడుదల చేస్తారు? ధరలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? తదితర ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.
1. వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే?
చమురును ఉత్పత్తి చేసే దేశాల నుంచి సరఫరా నిలిచిపోయినప్పుడు సంక్షోభం తలెత్తకుండా దేశాలు ‘‘వ్యూహాత్మక చమురు నిల్వల’’ను ఉంచుకుంటాయి.
చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) సమాచారం ప్రకారం భారత్‌లో దాదాపు 85 శాతం చమురు అవసరాలకు దిగుమతులే ఆధారం.
చమురు దిగుమతుల్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు, దేశంలో ఎలాంటి సంక్షోభం తలెత్తకుండా భారత్ ముందు జాగ్రత్తగా వ్యూహాత్మక నిల్వలు ఉంచుకుంటుంది. ఇవి బఫర్ స్టాక్‌లా పనిచేస్తాయి.
దేశంలోని చమురు సంస్థలు చేసే నిల్వలకు అదనంగా ప్రభుత్వం ఈ నిల్వలను నిర్వహిస్తుంది. సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం వీటిని విడుదల చేస్తుంది.
2. ఎంత మొత్తంలో నిల్వలు ఉంటాయి?
ఈ స్ట్రాటజిక్ రిజర్వులు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలోని టెక్సాస్, లూసియానాల్లోని అండర్‌గ్రౌండ్ రిజర్వులలో 605 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉంది.
వీటిలో 50 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీచేశారు.
భారత్‌లో 5.33 మిలియన్ టన్నుల(38 బిలియన్ బ్యారెళ్ల) చమురు ప్రభుత్వ రిజర్వుల్లో ఉంది. వీటి నుంచి 5 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియాలతోపాటు తాము కూడా రిజర్వుల నుంచి చమురును విడుదల చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
3. భారత్‌లో ఎక్కడ నిల్వ చేస్తారు?
భారత్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఈ రిజర్వులు ఉన్నాయి. ఒడిశాలోని చండీఖోల్‌లో మరో అండర్‌గ్రౌండ్ నిల్వల నిర్మాణం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 1.33 టన్నుల చమురును నిల్వ చేయొచ్చు. కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాదుర్‌లో 2.5 మిలియన్ టన్నులను నిల్వ చేసే అవకాశముంది.
ఈ మూడు చోట్ల మొత్తంగా 5 మిలియన్ టన్నులకుపైగానే చమురు నిల్వ చేయొచ్చు. ఈ నిల్వలు భారత్‌లో 9.5 రోజులకు సరిపోతాయని కేంద్ర పెట్రోలియం, సహయ వాయువు మంత్రిత్వ శాఖ గత ఫిబ్రవరిలో ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ నిల్వలకు అదనంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో 64.5 రోజులకు సరిపడా నిల్వలను ఉంచుకుంటాయి. మొత్తంగా భారత్‌లో 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం పాదుర్‌లో మరో 2.5 మిలియన్ టన్నులు, చండీఖోల్‌లో 4 మిలియన్ టన్నుల స్టోరేజీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
4. ఈ రిజర్వులు ఎవరి ఆధీనంలో ఉంటాయి?
విశాఖపట్నం, మంగళూరు, పాదుర్‌లలో చమురు నిల్వలు ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ఐఎస్పీఆర్‌ఎల్) ఆధీనంలో ఉంటాయి.
భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలోని ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు (ఓఐడీబీ) కింద ఐఎస్పీఆర్‌ఎల్ ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ స్టోరేజీల్లోని నిల్వలను మార్కెట్‌లోని చమురు కంపెనీలకు సరఫరా చేస్తారు. ఫలితంగా మార్కెట్‌లో చమురు సరఫరా పెరుగుతుంది.
5. వీటిని ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1991లో ఆర్థిక సంక్షోభ సమయంలో భారత విదేశీ మారకపు నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే అప్పుడు అందుబాటులో ఉండేవి.
ఆనాటి సంక్షోభం నుంచి గట్టెక్కిన తర్వాత, భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసేందుకు అప్పుడే ‘‘స్ట్రాటజిక్ రిజర్వ్’’ల ప్రతిపాదన వచ్చింది.
అయితే, ఆ తర్వాత పశ్చిమాసియాలోని గల్ఫ్ యుద్ధంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో భారత దిగుమతి బిల్లు అమాంతంగా పెరిగింది.
అప్పుడు ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఆనాటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ‘‘స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్’’ల పేరుతో చమురు రిజర్వులను ఏర్పాటుచేసింది.
6. ఇప్పుడు ఎందుకు రిజర్వులను విడుదల చేస్తున్నారు?
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతుండటంతో, సరఫరాను పెంచాలని పెట్రోలియం ఎగుమతుల దేశాల సంస్థ (ఒపెక్)ను పలుమార్లు అమెరికా కోరింది.
అయితే, ఒక్కసారిగా ఉత్పత్తిని పెంచే బదులు, క్రమంగా పెంచుతామని ఒపెక్ చెబుతోంది. మళ్లీ కరోనావైరస్ కేసులు పెరిగితే, ఆంక్షల నడుమ డిమాండ్ పడిపోయే అవకాశముందని ఒపెక్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. అందుకే ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ వెనకడుగు వేస్తోంది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లను ప్రభుత్వాలు సడలిస్తుండటంతో మళ్లీ చమురు గిరాకీ పెరిగింది.
ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో తమ దగ్గరున్న నిల్వలతో సరఫరాను పెంచడం ద్వారా ధరలు తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
ఈ విషయంపై భారత్, చైనా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలతోనూ అమెరికా చర్చలు జరిపింది. తమ దగ్గరున్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి, సరఫరాను పెంచాలని కోరింది.
7. ధరలపై ప్రభావం ఉంటుందా?
అమెరికా సంప్రదింపుల అనంతరం భారత్ కూడా వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించింది.
భారత పెట్రోల్, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అమెరికా, చైనా జపాన్, దక్షిణ కొరియాలతోపాటు తాము కూడా రిజర్వులను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
చమురును భారీగా ఉత్పత్తిచేసే దేశాలతోపాటు అమెరికా ఇలా రిజర్వులను విడుదల చేయడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. అయితే, ధరల విషయంలో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వారు వివరించారు.
‘‘ధరలను సముచిత స్థాయిలో తగ్గించడానికి ఈ రిజర్వులు సరిపోవు. ఒక్కోసారి ఈ నిర్ణయాలు బెడిసికొట్టే ముప్పు ఉంటుంది. వీరు విడుదల చేసిన రిజర్వులకు సమానంగా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే..? ఒపెక్ దేశాల జాబితాలో రష్యా కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని క్యాపిటల్ ఎకనమిక్స్ చీఫ్ కమోడిటీస్ ఎకనమిస్ట్ కరోలిన్ బ్రైన్ అన్నారు.
మరోవైపు, భారత్‌లో స్ట్రాటజిక్ నిల్వలను ఏర్పాటుచేసింది ఇలాంటి పరిస్థితుల కోసం కాదని గత వారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు లేదా విపత్కర పరిణామాల వల్ల చమురు ఉత్పత్తి పడిపోయినప్పుడు ఆ రిజర్వులను ఉపయోగించాలి’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌కు దత్తతగా వచ్చిన బిడ్డను తిరిగి కేరళ ఎందుకు తీసుకెళ్లారు... అసలేంటీ వివాదం?
- చలికాలంలో చౌకగా దొరకాల్సిన టమాటా రేటు ఎందుకు ఇంతగా పెరుగుతోంది?
- బిట్‌కాయిన్‌ను కేంద్రం నిషేధిస్తుందా.. క్రిప్టోకరెన్సీపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- పూంచ్ ఎన్కౌంటర్: తొమ్మిది మంది భారత సైనికులు చనిపోయిన ఈ ఆపరేషన్‌లో సమాధానాలు లేని ప్రశ్నలెన్నో...
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)