టమాటా ధర: చలికాలంలో చౌకగా దొరకాల్సిన టమాటా రేటు ఎందుకు ఇంతగా పెరుగుతోంది?

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శీతాకాలం వచ్చిందంటే దేశంలో టమాటా ధరలు బాగా తగ్గిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో రూ. 15 లేదా రూ.20కే కిలో టమాటాలు వస్తాయి.

కానీ, ఈ సంవత్సరం పరిస్థితి తారుమారైంది. కొన్ని నగరాల్లో టమాటా ధరలు మండిపోతున్నాయి.

చాలాచోట్ల రిటైల్ మార్కెట్‌లో దీని ధర కిలో రూ.80పైనే ఉంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని నగరాల్లో కిలో టమాటా ధర రూ. 120కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు పెట్రోలు ధరల కన్నా పెరిగిపోయాయని, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 108 ఉంటే, కేజీ టమాటాలు రూ. 100 నుంచి రూ. 110లకు దొరుకుతున్నాయని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక తెలిపింది.

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె హోల్‌సేల్ మార్కెట్ యార్డు దేశంలోని అతి పెద్ద టమాటా మార్కెట్ యార్డులలో ఒకటి.

కిందటి వారం మదనపల్లె హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 100కు చేరుకుంది. గత ఐదేళ్లల్లో ఇదే అత్యధిక ధర అని ఆ పత్రిక తెలిపింది.

కేరళలో కిలో ధర రూ. 90 నుంచి రూ. 120 మధ్య ఉందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

అకాల వర్షాలే కారణం

గత నెలన్నరగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో టమోటా సరఫరాకు అంతరాయం కలుగుతోందని, ఫలితంగా ధరలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.

ఈ ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే మరోపక్క రైతులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

వాస్తవానికి అక్టోబర్‌లో కురిసిన అకాల వర్షాలకు టమాటా పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అయితే ఇప్పుడు మిగిలిన పంటకు అధిక ధర గిట్టుబాటు అవుతుండడంతో కొంతైనా తమ నష్టాన్ని పూడ్చుకోగలుగుతున్నామని రైతులు అంటున్నారు.

"రైతులకు కొంత ఊరట కలుగుతోంది. వర్షాలకు చాలా వరకు పంటలు నాశనమయ్యాయి. మిగిలినవి ఇప్పుడు మంచి ధరకు అమ్ముడవుతున్నాయి" అని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన అసిమ్ పఠాన్ అనే రైతు చెప్పారు.

సాధారణంగా పెట్టె టమాటాలు రూ. 300 అమ్ముడైతే మంచి ధర పలికినట్టు లెక్క. ఒక్కొక్క పెట్టెలో 25 కిలోల టమాటాలు పడతాయి. ప్రస్తుతం పెట్టె ధర రూ. 1000 నుంచి రూ. 1400 వరకు అమ్ముడవుతోంది.

అసిమ్ పటాన్ గ్రామం హెబత్‌పూర్-సాలార్‌పూర్‌లో ఎక్కువ మంది రైతులు టమాటాలు సాగు చేస్తారు.

శీతాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాటాలు ఎక్కువ పండిస్తారు. వేసవిలో కొన్నిచోట్ల మాత్రమే పండిస్తారు. అసిం పటాన్ వేసవిలో కూడా టమాటాలు పండిస్తారు.

"చలికాలంలో టమోటా ధరలు ఇంతగా ఎప్పుడూ పెరగలేదు. నవంబర్ నెల వచ్చేసరికి దిగుబడి అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. దాంతో మార్కెట్లో కిలో టమాటాలు రూ. 10కి అమ్ముడుపోవడం కూడా కష్టమయ్యేది. ఈసారి పంటను వర్షం దెబ్బతీసింది. మార్కెట్లో టమాటాలు లేవు. అందుకే ధరలు పెరిగిపోతున్నాయి" అని అసిమ్ చెప్పారు.

"మామూలుగా మా గ్రామానికి, చుట్టు పక్కల గ్రామాలకు టమాటా కొనడానికి వినియోగదారులు వస్తారు. కానీ, ఈసారి చలికాలంలో కూడా బయట వ్యాపారులు వచ్చారు"

"టమాటా సాగు అంత సులభం కాదు. ఖర్చు ఎక్కువ. రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది" అని ఎన్నో ఏళ్లుగా ఇదే పంట సాగుచేస్తున్న అసిమ్ చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా స్వార్ ప్రాంతంలో వర్షాల కారణంగా టమాటా పంటలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తాయి.

ఈ ప్రాంతం నుంచే దిల్లీ ఎన్‌సీఆర్‌కు టమాటాలు సరఫరా అవుతాయి.

"ఈసారి రైతులకు చాలా నష్టం వచ్చింది. పంట చాలావరకు నాశనమైపోయింది. ఇక్కడ చాలా మంది కౌలుకు భూములు తీసుకొని టమాటాలు సాగుచేస్తారు. వర్షాలకు పొలాల్లో టమాటాలు మిగల్లేదు. అందుకే ధరలు పెరిగిపోయాయి" అని స్వార్‌కు చెందిన రైతు రనీష్ ఖాన్ చెప్పారు.

దక్షిణ భారతదేశంలో మండుతున్న ధరలు

తమిళనాడులో కిలో టమాటాల ధర రూ. 100 దాటింది. చెన్నైలో కిలో రూ. 140కి అమ్ముతున్నారు.

బుధవారం ఇక్కడి మార్కెట్లో కిలో ధర రూ.100 నుంచి రూ.110 పలకగా, రిటైల్‌లో రూ.125 నుంచి రూ.140 వరకు పలికింది.

వర్షాల కారణంగా ఇక్కడ కూడా పంటలు దెబ్బతిన్నాయి.

డీజిల్ ధరలు పెరిగి, సరఫరా ఆలస్యం కావడం కూడా టమాటా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు.

టమాటాను కొత్త పెట్రోల్ అంటున్న జనం

దేశంలో పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. లీటరు రూ.100 దాటింది.

అయితే, ఇప్పుడు టమాటాలు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

పెట్రోల్, టమాటా ధరలను పోలుస్తూ సోషల్ మీడియాలో యూజర్లు మీమ్స్, కార్టూన్లు పోస్టు చేస్తున్నారు.

దేశంలో గ్యాస్, ఎడిబుల్ ఆయిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగాయి.

ప్రస్తుతం పెరుగుతున్న టమాటా ధరలతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌కు గండిపడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)