You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టోక్యో ఒలింపిక్స్: ధాబాలో ప్లేట్లు కడిగిన ఒక దళిత కుర్రాడు భారత హాకీ టీమ్‌కు ఎలా ఎంపికయ్యారు
- రచయిత, సౌరభ్ దుగ్గల్
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ ప్రతినిధి, బీబీసీ కోసం
ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడే పురుషుల హాకీ జట్టు క్రీడాకారుల పేర్లను హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఆ జట్టులో హరియాణాకు చెందిన సుమిత్ కుమార్ కూడా ఉన్నారు.
సుమిత్ హాకీ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు.
సుమిత్ కుమార్ భూమి కూడా లేని ఒక దళిత కూలీ కుటుంబంలో పుట్టారు. హైవే పక్కన ఒక ధాబాలో క్లీనర్‌గా పని చేశారు.
కొన్ని సార్లు ఖాళీ కడుపుతోనే పడుకునేవారు. మరికొన్ని సార్లు ఉత్త రొట్టెతోనే కడుపు నింపుకునేవారు. పాలు కొనుక్కుని తాగడం అంటే ఆ రోజుల్లో ఆయనకు లగ్జరీతో సమానం.
అంతర్ జిల్లా హాకీ పోటీలకు వెళ్లేటప్పుడు ఒక్క పూట భోజనానికి లేదా పళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు మిగుల్చుకునేందుకు ఆయన టికెట్టు లేకుండా రైలులో ప్రయాణించారు.
ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూనే హాకీలో రాణించారు. ఇప్పుడు 16 మంది సభ్యులుండే భారత హాకీ జట్టుకు ఎంపికయ్యారు.
టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఎంపికవ్వడం ఆయన సాధించిన ఘన విజయమని చెప్పవచ్చు.
"ఇది మా కుటుంబం గర్వపడే క్షణం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. తను ఆఖరికి ధాబాలో క్లీనర్‌గా కూడా పని చేయాల్సింది వచ్చింది. తన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులను అనుభవించారు"
"కానీ, ఎన్ని కష్టాలెదురైనా హాకీపై తన ఆసక్తే తనను ముందుకు నడిపించింది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఎంపికై మాకందరికీ గర్వకారణమయ్యారు" అని సుమిత్ పెద్దన్నయ్య అమిత్ చెప్పారు.
ఆయనకు కూడా హాకీ అంటే చాలా ఆసక్తి ఉండేది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే వదిలిపెట్టాల్సి వచ్చింది.
"మేమిద్దరం మూర్తల్‌లో ఉన్న రతన్ ధాబా, మదన్ ధాబాలో పని చేసేవాళ్లం. మేము తెల్లవారుజామున అక్కడ క్లీనర్ పని చేస్తేనే మా కుటుంబానికి కావాల్సిన ఆహారం లభించేది. పని పూర్తయిన వెంటనే ఉదయం 5.30 గంటలకు హాకీ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కు వెళ్లేవాళ్లం. ఆ తర్వాత నేను హాకీ ఆడటం మానేసాను. కానీ సుమిత్ ఆడటం కొనసాగించారు" అని చెప్పారు.
సుమిత్ ధాబాలలో ఐదేళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాత గుర్‌గావ్‌లో ఉన్న స్పోర్ట్స్ హాస్టల్‌లో సీటు దొరికింది. హాస్టల్‌లోనే ఉండి శిక్షణ తీసుకున్నారు.
"ఆయనకు హాస్టల్‌లోనే భోజన సదుపాయం ఉండేది. హాస్టల్‌లో సీట్ రావడం ఆయన జీవితాన్నే మార్చేసింది" అని అమిత్ అన్నారు.
ఆయనిప్పుడు యూజీసీ నెట్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన చరిత్రలో పరిశోధన చేయాలని అనుకుంటున్నారు.
"మా అమ్మగారు బతికి ఉంటే, అందరికంటే ఎక్కువగా ఆనందించి ఉండేవారు. ఆమె గత నవంబరులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకి మరణించారు"
"ఆమె ఎప్పుడూ విమానం ఎక్కలేదు. నేను భారత జట్టుకు ఎంపికైతే, నేను తనను విమానంలో టోక్యోకు తీసుకుని వెళతానని అనేవాడిని. ఆమె బతికి లేకున్నా, నా జ్ఞాపకాల్లో తను ఎప్పటికీ ఉంటారు. ఆమె ఆశీర్వాదం నాతో ఎప్పుడూ ఉంటుంది" అని 25 సంవత్సరాల సుమిత్ చెప్పారు.
ఆయనిప్పుడు బెంగళూరులో శిక్షణ తీసుకుంటున్నారు.
హరియాణాలో సోనేపట్ జిల్లాలో జాట్ కులస్థులు ఎక్కువగా ఉండే కురాద్ గ్రామంలో సుమిత్ ఒక హీరో. సోనేపట్‌ను భారతీయ కుస్తీ క్రీడాకారులకు మక్కా అని అంటారు. ఇప్పుడది ఒలింపిక్స్‌కి వెళ్లే హాకీ క్రీడాకారులకు కూడా కేంద్రంగా మారింది.
"దారిద్య్రం అన్నిటి కంటే పెద్ద శాపం. ఆరేళ్ళ క్రితం వరకు కూడా నా బాల్యం, నా యవ్వనం అంతా దారిద్య్రంలోనే గడిచింది. ఈ కష్టాలన్నీ నన్ను మానసికంగా దృఢంగా చేశాయి. నా జీవితంలో ఒత్తిడికి, భయానికి చోటు లేదు"
"భారత జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు నా వంతు ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను" అని సుమిత్ అన్నారు.
2017లో సుల్తాన్ అజ్‌లాన్ షా కప్‌తో ఆయన హాకీ కెరీర్ మొదలైంది. 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా సుమిత్ పాల్గొన్నారు.
కుస్తీ నుంచి హాకీకి
సోనేపట్‌లో ప్రతి చిన్నారి ఆడుకోవడానికి ముందుగా అఖాడాకే వెళతారు. కుస్తీ సాధన చేసే స్థలాన్ని అఖాడా అని అంటారు.
అందరిలాగే సుమిత్ కూడా హాకీ టోర్నమెంటు కంటే ముందు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు.
ఆయన రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నారు. కానీ కుస్తీ నుంచి త్వరగానే నిష్క్రమించారు.
కుస్తీ చేయాలంటే బాదం, పాలుతో పాటు బలమైన ఆహారం తినాల్సి ఉంటుంది. కానీ మూడు పూటలా భోజనం దొరకడమే సుమిత్ కుటుంబానికి కష్టంగా ఉండేది.
అదే సమయంలో ఊరులో ఒక హాకీ అకాడమీ మొదలయింది. దాంతో అందులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు సుమిత్.
"మా అన్న అమిత్ హాకీ ఆడుతూ ఉండేవారు. దాంతో నేను కూడా హాకీలో చేరాను.
నేను హాకీలో అత్యున్నత స్థానానికి వెళ్లాలంటే, ముందు నేను శుభ్రమైన ఆహారం తినాలని అర్థమయింది. ఇందుకు నేను నా గ్రామస్థులందరికీ రుణపడి ఉంటాను. గ్రామస్తులంతా ఒకరి తర్వాత ఒకరు నాకు పాలు ఇస్తూ ఉండేవారు" అని సుమిత్ గుర్తు చేసుకున్నారు.
"నాకింకా గుర్తుంది. 10 సంవత్సరాల క్రితం నేను మా గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్‌గఢ్‌లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకుంటున్నాను. నాకు సైకిల్ ఉండేది కాదు. దాంతో నేను ఎవరినైనా లిఫ్ట్ ఇమ్మని అడుగుతూ ఉండేవాడిని"
"ఒక రోజు సాయంత్రం శిక్షణ తర్వాత బాగా అలిసిపోయి, కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. నాకు తెలివి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది. దాంతో రాత్రంతా గ్రౌండ్‌లోనే ఉండిపోయి, మరుసటి రోజు పొద్దున్న శిక్షణ తర్వాత ఇంటికి వెళ్లాలని అనుకున్నాను. అక్కడ నీటిని పెడుతున్న గ్రౌండ్ సిబ్బంది ఒకరు నన్ను చూసి, ఆయన గదిలోకి తీసుకుని వెళ్లి, నాకు భోజనం పెట్టారు"
"నేను ఆ కేంద్రానికి ఎప్పుడు వెళ్లినా కచ్చితంగా ఆయనను కలుస్తాను. ఆయనకు ఏదో ఒక బహుమతి కూడా ఇస్తాను. కష్టకాలంలో సహాయం చేసినవారిని ఎప్పుడూ మర్చిపోకూడదని మా అమ్మ నాకెప్పుడూ చెబుతూ ఉండేవారు" అని సుమిత్ ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.
హరియాణా గ్రామీణ ప్రాంతంలో కుల వ్యవస్థ బాగా బలంగా ఉంది. సుమిత్ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఏమైనా వివక్షకు గురయ్యాడా?
"అలా చూస్తే మా గ్రామస్థులంతా నాకు చాలా మద్దతు ఇచ్చి సహకరించారు"
"కానీ క్రీడల్లోకి రావడానికి చాలా మంది దళిత పిల్లలు సంకోచిస్తూ ఉంటారు. వాళ్లకు ముఖ్యంగా క్రీడలకు అవసరమైన బలమైన ఆహారాన్ని తినే పరిస్థితి ఉండదు"
"కానీ నేను విజయం సాధించడం చూసి దళిత కుటుంబాలకు చెందిన 10-15 మంది పిల్లలు క్రీడల్లో సాధన చేసేందుకు ముందుకు వచ్చారు" అని సుమిత్ చెప్పారు.
"హాకీ ఇండియా లీగ్‌కు ఎంపికైన తర్వాతే నా జీవితంలో నిజమైన మార్పు వచ్చింది. నేను మూడు సీజన్లలో ఆడాను. అక్కడ సంపాదించిన డబ్బుతో నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.
"మేమిప్పుడు భోజనం గురించి, ప్రయాణాలు, లేదా ప్రాథమిక అవసరాల గురించి చింతించే పని లేదు"
"ఒక్కోసారి మా నాన్నగారు కూలి పనికి వెళుతూ ఉంటారు. నేను వెళ్లొద్దని ఆయనకు చెప్పినప్పుడు.. అది తన పనని ఆయన అంటూ ఉంటారు"
"మేము ఇటీవల సోనేపట్‌లో అద్దె ఇంటికి మారాం. కానీ మా అన్నయ్య, నాన్నగారు పల్లెటూరులోనే ఉంటారు" అని సుమిత్ చెప్పారు. ఆయనకు 2017లో ఓఎన్‌జీసీలో ఉద్యోగం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - బీబీసీతో యోగి ఆదిత్యనాథ్
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- ఏపీ: నూతన విద్యా విధానంతో వచ్చే మార్పులేంటి.. ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఎందుకు పంపారు
- క్రీడారంగంలో తమిళనాడు, మహారాష్ట్రల నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఈశా సింగ్ - తెలంగాణ షూటర్: ‘తుపాకీ పేలుతున్న శబ్దం నా చెవులకు సంగీతంలా వినిపిస్తుంది’ - BBC ISWOTY
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)