దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - బీబీసీతో యోగి ఆదిత్యనాథ్

దేశ విభజన సమయంలో భారత్‌లో ఉండిపోవాలని నిర్ణయించుకొన్న ముస్లింలు వారి నిర్ణయంతో ఈ దేశానికి మేలేమీ చేయలేదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.

"వాళ్లు దేశ విభజనను వ్యతిరేకించి ఉండాల్సింది. దేశ విభజన వల్లే పాకిస్తాన్ ఏర్పడింది" అని ఆయన బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

భారత్‌లో ముస్లింల జనాభా 20 కోట్లు కాగా, వీరిలో దాదాపు పావు భాగం ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉన్నారు.

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)‌కు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపై ముఖ్యంగా ముస్లింలపై ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెద్దయెత్తున బలప్రయోగం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిని బలపరిచే ఆధారాలూ వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చుతున్నారు.

ఒక వర్గానికి చెందిన పిరికిపందలైన మగవారు దుప్పటి కప్పుకొని ఇంట్లో కూర్చుని, సీఏఏపై నిరసన తెలిపేందుకు మహిళలను, పిల్లలను పంపిస్తున్నారని ఆదిత్యనాథ్ బీబీసీతో వ్యాఖ్యానించారు.

దిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆదిత్యనాథ్ అంగీకరించారు. అదే సమయంలో- షాహీన్‌బాగ్ ఆందోళన శాంతియుతమైనది కాదన్నారు. ఈ ఆందోళన స్థానికులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు.

ఈ ఆందోళన శాంతియుతంగానే సాగుతోంది. దిల్లీలోని ఒక పెద్ద రోడ్డుపై దీనిని నిర్వహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. అయితే అత్యవసర వాహనాలకు నిరసనకారులు దారి ఇస్తున్నారు.

షాహీన్‌బాగ్‌లో నిరసనల్లో పాల్గొంటున్న వందల మంది మహిళలకు, చిన్నారులకు దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ బిర్యానీ పంపిస్తున్నారన్న తన ఆరోపణను ఈ ఇంటర్వ్యూలో ఆదిత్యనాథ్ మరోసారి చేశారు.

దిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ ఆరోపణ చేశారు. ఇక్కడ ఈ నెల 8న పోలింగ్ జరుగనుంది.

తాము బిర్యానీ తినేవాళ్లం కాదని ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఉగ్రవాదులకు బిర్యానీ ఇవ్వకుండా, వారిని తూటాలతో కాలుస్తున్నారని చెప్పారు.

దేశంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు, ఇతర హింసాత్మక ఘటనల్లో వందల మంది గాయపడ్డారు. మరణాలు కూడా సంభవించాయి.

పోలీసులే పెద్దయెత్తున బలప్రయోగానికి దిగుతున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు యూపీలో ఉన్నంత తీవ్రంగా మరెక్కడా లేవు.

యూపీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో కనీసం 19 మంది చనిపోయారు.

శాంతియుత ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగానికి దిగారనే ఆరోపణలను ఆదిత్యనాథ్ తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్న సాయుధ విధ్వంసకర మూకలపైనే తమ పోలీసులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)