International Yoga Day: కోవిడ్ సమయంలో యోగాతో కలిగే ప్రయోజనాలేమిటి

జూన్ 21న ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఐక్యరాజ్యసమితిలోనూ ఈ వేడుకలు జరుగుతాయి.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఈ ఏడాది కూడా గత ఏడాదిలానే వేడుకలు వర్చువల్‌గా జరగబోతున్నాయి. ఏడో యోగా దినోత్సవాన్ని సోమవారం 8.30 గంటలకు ఐరాస వెబ్ టీవీలో లైవ్ చూడొచ్చు. పది గంటల వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి.

ప్రతి సంవత్సరం యోగా వేడుకలకు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది దీన్ని ‘‘ఆరోగ్య సంరక్షణకు యోగా’’గా నిర్ణయించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రజలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు, కుంగుబాటు లక్షణాలను దూరం చేసేందుకు ఈ వ్యాయామం తోడ్పడుతుందని ఐరాస వివరించింది.

‘‘కోవిడ్-19 వ్యాప్తి నడుమ కుంగుబాటు, సోషల్ ఐసోలేషన్‌తో వచ్చే దుష్ప్రభావాలపై పోరాడేందుకు యోగాను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు యోగా తోడ్పడుతుంది. ఆందోళనను తగ్గించడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది’’అని ఐరాస ఒక ప్రటకనలో పేర్కొంది.

అలా మొదలైంది...

2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభను ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అప్పుడే అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు.

యోగాను భారత పురాతన సంస్కృతి, సంప్రదాయాలు మనకు అందించిన అమూల్యమైన బహుమతిగా మోదీ అభివర్ణించారు.

ఆయన ప్రతిపాదించిన తీర్మానానికి 175 దేశాలు మద్దతు పలికాయి. ఇన్ని దేశాలు ఇలా మద్దతు పలకడం చాలా అరుదు. దీంతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటిచింది.

ఏటా వేడుకలు..

తొలి యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న దిల్లీలోని రాజ్‌పథ్‌లో అధికారికంగా నిర్వహించారు. మోదీతోపాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు.. ఇలా మొత్తంగా 36,000 మంది దీనిలో పాల్గొన్నారు.

30 నిమిషాలపాటు 21 యోగా ఆసనాలు వీరు వేశారు. ఈ వేడుకల థీమ్.. ‘‘శాంతి, సామరస్యం’’.

రెండో యోగా దినోత్సవం చండీగఢ్‌లో నిర్వహించారు. మోదీతోపాటు 150 మంది దివ్యాంగులు కూడా దీనిలో పాల్గొన్నారు. మొత్తంగా 30,000 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల థీమ్ ‘‘యువతతో సమ్మేళనం’’.

మూడో యోగా దినోత్సవాన్ని, 2017 జూన్ 21న లఖ్‌నవూలో నిర్వహించారు. దీనిలో 51,000 మంది పాల్గొన్నారు. ఈ ఏడాది వేడుకల థీమ్.. ‘‘ఆరోగ్యం కోసం యోగా’’.

నాలుగో యోగా దినోత్సవం దేహ్రాదూన్‌లో జరిగింది. దీనిలో 50,000 మంది పాల్గొన్నారు. దీని థీమ్.. ‘‘శాంతి కోసం యోగా’’.

2019లో ఐదో యోగా దినోత్సవానికి రాంచీ వేదికైంది. పర్యావరణం కోసం యోగా దీని థీమ్.

కోవిడ్ వ్యాప్తి నడుమ ఆరో యోగా దినోత్సవాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. కుటుంబంతో కలిసి యోగాగా దీని థీమ్‌ను నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)