You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన... నిర్మాణంపై అభ్యంతరాలేమిటి ?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన పార్లమెంటు భవన సముదాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునాదిరాయి వేశారు.
అయితే, ఈ భవన నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో ప్రస్తుతానికి శంకుస్థాపన వరకు చేయవచ్చని, నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
తుది తీర్పు వచ్చే వరకు తాము ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, చెట్ల నరికివేతలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
కొత్త పార్లమెంటు కోసం రూపొందించిన ప్లాన్‌లో వివిధ అంశాలపై ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు ఈ మొత్తం ప్లాన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజీవ్ సూరి అనే న్యాయవాది పిటిషన్ వేశారు.
పార్లమెంటు హౌస్ ప్రాంతంలో కొత్త భవన నిర్మాణంపై నిషేధం ఉందని పిటిషనర్లు బీబీసీ లీగల్ రిపోర్టర్ సుచిత్రా మొహంతీకి తెలిపారు. ఇక్కడి భూ వినియోగానికి సంబంధించి చేసిన అనేక మార్పులపై రాజీవ్ సూరీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
“ప్రభుత్వం డబ్బును వృథాగా ఖర్చు చేస్తోంది. ఈ నిర్మాణంపై ఎలాంటి అధ్యయనం లేదు. ప్రస్తుత పార్లమెంటు భవనం వాడలేని స్థితిలో ఉందని ప్రభుత్వం నిరూపించలేదు” అని పిటిషనర్లలో ఒకరైన లాయర్ శ్యామ్‌దేవాన్ అన్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం 1927 లో నిర్మించారని, ఇప్పుడది పాతబడిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. భద్రతా సమస్యలు, స్థలాభావం, భూకంపాల నుంచి రక్షణలాంటివి లేవని కోర్టుకు తెలిపింది.
ఈ భవనాల పునర్నిర్మాణంపై చర్చించామని, దాని ఆచరణను కూడా పరిశీలించామని కేంద్రం తెలిపింది. న్యాయస్థానం సూచనల మేరకు అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలూ ఉండవని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు.
ఈ కేసులన్నింటిలో తీర్పు వచ్చేవరకూ.. అక్కడ ఉన్న చెట్లను వేరే ప్రాంతాలకు తరలించడం, ఆ ప్రాంతాల్లోని ఏవైనా నిర్మాణాలనూ కూల్చివేయడం, వాటి స్వభావం మార్చడం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాల్లో స్థితిని ఏమాత్రం మార్చకుండా 2020 డిసెంబర్ 10న నిర్దేశించిన భూమిపూజ కార్యక్రమంతో పాటు, విధానపరమైన ప్రక్రియలను అధికారులు కొనసాగించవచ్చని ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది ఎప్పుడు?
2020 అక్టోబర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ వివరాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలై, 2022 అక్టోబర్ నాటికి పూర్తి కావచ్చు.
కొత్త భవనం ఎందుకన్న తృణమూల్ ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి హర్దీప్ పురి, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఉన్న వసతులు, సౌకర్యాలు 93 ఏళ్ల పురాతనమైనవని, పార్లమెంట్ ప్రస్తుత డిమాండుకు అవి తగినట్లు లేవని చెప్పారు.
"లోపల తగినంత ఆఫీస్ స్పేస్ లేదు. ఎంపీలకు వ్యక్తిగత చాంబర్లు కూడా లేవు. ఈ భవనం ఉభయ సభల పార్లమెంటుకు ఉద్దేశించినది కాదు. ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున మరమ్మతులు జరగడం వల్ల దానిపై చాలా ఒత్తిడి ఉంది. కొత్త భవనంలో మెరుగైన సీటింగ్ సామర్థ్యం ఉంటుంది" అని కూడా పురి చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందిస్తుందని, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ విస్తరించిన ప్రాంతాన్ని సందర్శించే పర్యటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు.
పాత భవనం చరిత్ర ఏమిటి?
ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు భవనానికి న్యూదిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ డిజైన్ చేశారు. ఈ భవనానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
అప్పట్లో దీనికి 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు.
ప్రస్తుత పార్లమెంట్ భవనం వృత్తాకారంలో 560 అడుగుల వ్యాసార్థంతో ఉంటుంది.
పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌ను ఎర్రటి శాండ్‌స్టోన్‌తో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసివేసేలా ఇనుప గ్రిల్స్, ఇనుప తలుపులతో నిర్మించారు. దీనికి మొత్తం 12 గేట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- చైనా ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందా? వృథా చేయవద్దని జిన్‌పింగ్ ఎందుకంటున్నారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- Cyclone Nivar: తుపాన్లకు పేరెందుకు పెడతారు, ఎవరు నిర్ణయిస్తారు?
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)