You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'వరవరరావు ఆరోగ్యం విషమించింది... దయచేసి ఆస్పత్రిలో చేర్పించండి' - భార్య హేమలత విజ్ఞప్తి
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన రచయిత, విరసం నాయకులు వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రాణాలను కాపాడాలని ఆయన సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు, సహచరులు విజ్జప్తి చేశారు.
ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్నవరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లైవ్ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వరవరరావు భార్య, కుమార్తెలు విజ్జప్తి చేశారు.
జైలు అధికారులు మాత్రం ఆయన ఆరోగ్యం బాగుందని చెబుతున్నారని , కానీ వాస్తవాలు వేరుగా కనిపిస్తున్నాయని వారు అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన వరవరరావును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ లేఖలకు కనీసం సమాధానం కూడా లేదని వరవరరావు భార్య హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని, వరవరరావు ఆరోగ్యం విషయంలో సహాయం చేస్తానని ఆయన మాటిచ్చారని హేమలత చెప్పారు.
ఆయన ఆరోగ్యం ఎప్పటి నుంచి విషమంగా ఉంది?
''మే 26 నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదని మాకు తెలిసింది. మే 28న జేజే ఆసుపత్రికి తరలించారు. తర్వాత జూన్1న తిరిగి ఆయన్ను తలోజా జైలుకు తరలించారు. జూన్7వ తారీఖు నుంచి ఆయన మాటలో తేడాను గమనించాం'' అని వరవరరావు భార్య హేమలత మీడియా సమావేశంలో వెల్లడించారు.
''జూన్ 24న ఫోన్ చేసినప్పుడు ఆయన మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడారు. జూలై 2న ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని గుర్తు పట్టే పరిస్థితిలో కూడా లేరు. నిన్న జులై 11న మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రుల అంత్యక్రియల గురించి చెబుతున్నారు. ఈ మాటల తీరు చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అర్ధమవుతోంది'' అని హేమలత బీబీసీతో అన్నారు.
''8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. తల్లి మరణించి 35 సంవత్సరాలైంది. ఇప్పుడు వారి అంత్యక్రియల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అని, ఆయన ఆరోగ్యం గురించి ఎందరికో ఎన్నో విన్నపాలు చేసినీ ఎవరూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు.
బెయిల్ అవసరం లేదు బతికించుకుంటే చాలు : వరవరరావు కుమార్తెలు
వరవరరావుకు బెయిల్ పొందే హక్కుందని, అయితే వస్తుందన్న ఆశ తమకు లేదని తల్లితోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కుమార్తెలు సహజ, అనల, పవన అన్నారు.
''ఇప్పుడు మేం బెయిల్ కోరడం లేదు. కానీ ముందు ఆయన్ను బతికించుకోవాలి. ఆయన శరీరంలో సోడియం, పొటాషియ స్థాయిలు దారుణంగా పడిపోయాయి'' అని పవన అన్నారు.
విడుదల చేయండి-మేమైనా బతికించుకుంటాం: ఎన్.వేణుగోపాల్
''వరవరరావు ఆరోగ్య పరిస్థితి మీద ఒక్క మహారాష్ట్ర గవర్నర్ మినహా ఎవరూ స్పందించ లేదు. ఆయన్ను జైలు నుంచి తక్షణం ఆసుపత్రికి తరలించాలి. లేదంటే మాకు అప్పజెప్పండి. మేము, కుటుంబ సభ్యులు కలిసి ఆయన్ను బతికించుకుంటాం" అని సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ అన్నారు.
వరవరరావుకు బంధువు కూడా అయిన వేణుగోపాల్, కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చేస్తున్న ఒకే ఒక విజ్జప్తి ఒక్కటే, ఆయనను తక్షణమే విడుదల చేయాలి.
వీవీ హక్కులను కాపాడాలి: మేధావులు, సామాజికవేత్తలు
బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావును తక్షణమే విడుదల చేయాలని సామాజిక ఉద్యమకారులు, మేధావులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని, ఆయనకు వైద్యం అందించాలని కాలమిస్టు, సామాజిక ఉద్యమకారుడు సుదీంధ్ర కులకర్ణి అన్నారు. వైద్యం పొందే హక్కు ఆయనకు ఉందన్నారు కులకర్ణి.
ఫాసిస్టు ధోరణితో ప్రశ్నించే వారి గొంతులను కేంద్రం నొక్కేయాలని చూస్తోందని హైదరాబాద్ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆరోపించింది. వరవరరావును మరికొందరిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారని, వారిని తక్షణమే విడుదల చేయాలని ఫోరం ట్విటర్‌లో డిమాండ్ చేసింది.
ఇంత పెద్ద వయసున్న ఒక రచయితను ఇబ్బంది పెడుతున్న వారిని భారతదేశం క్షమించదు. ఆయనకు వైద్యం అందించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సామాజికవేత్త, వామపక్ష నేత దీపాంకర్ అన్నారు.
''80ఏళ్ల వయసులో ఒక వృద్ధ రచయిత, అలుపెరుగని శ్రమజీవిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందరు విజ్జప్తి చేసినా ఈ మూర్ఖ ప్రభుత్వాలలో చలనం రావడం లేదు'' అని విరసం సభ్యుడు పి.వీరబ్రహ్మచారి అన్నారు.
బీమా-కోరెగావ్ కేసులో వరవరరావు, మావోయిస్టులతో సంబంధాల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాల ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడం.. జైళ్లలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వీరిని విడుదల చేయాలని కోరుతున్నారు. వరవరరావు నడవలేని స్థితిలో, పళ్లు తోముకునే స్థితిలో కూడా లేరని జైలులో ఆయన సహచరులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారిలో ఆందోళన అధికమైంది.
ఇవి కూడా చదవండి:
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకొంటారు?
- విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)