You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరవరరావు: ఇప్పుడు ఎందుకీ అరెస్టులు.. పోలీసులేమంటున్నారు, కార్యకర్తలు ఏం చెబుతున్నారు?
పౌరహక్కుల కార్యకర్తలు, విప్లవ రచయితల నివాసాలపై దేశవ్యాప్తంగా మంగళవారం పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. పెండ్యాల వరవరరావు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో వరవరరావు, ఆయన కుమార్తెల నివాసాలు, విరసం సభ్యుడు- పాత్రికేయుడు క్రాంతి నివాసాల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.
ముంబయిలో అరుణ్ ఫెరీరా, వర్నన్ గోంజాల్వెజ్లను అరెస్ట్ చేశారు. హర్యానాలోని సూరజ్ కుండ్ సమీపంలో పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కార్యకర్త సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. దిల్లీలో పియుడిఆర్ హక్కుల నేత గౌతమ్ నవలాఖాను అరెస్ట్ చేశారు. గోవాలో ప్రముఖ దళిత రచయిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్దుంబ్డే నివాసం దగ్గరకు పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో ఆయన అక్కడ లేరు. రాంచిలో ఫాదర్ స్టాన్ స్వామి నివాసంలోనూ పోలీసులు సోదాలు జరిపారు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ, రాంచి, నగరాల్లో పోలీసులు ఏకకాలంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పుణే జాయింట్ కమిషనర్ శివాజీ భద్కే వెల్లడించారు. బీమా కోరెగావ్ హింసకు సంబంధించి ముఖ్యంగా ఎల్గార్ పరిషత్ కార్యకలాపాలకు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని ప్రశ్నించే గొంతునొక్కడం తప్ప మరేమీ కాదని అంటున్నాయి. ఈ అరెస్టులను సవాల్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు వరవరరావు సమీప బంధువు, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్ వెల్లడించారు. గౌతమ్ నవలాఖాను పుణే తరలించకుండా దిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతానికి ఆయన హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. అరెస్టయిన వారిమీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (యుఏపిఏ)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు సమాచారం.
ఎందుకీ దాడులు? ఏమిటీ ఎల్గార్ పరిషత్?
మహారాష్ట్రలోని బీమా కోరెగావ్ వద్ద గత జనవరిలో అల్లర్లు జరిగాయి. హింస చెలరేగింది. ఎల్గార్ పరిషత్ పేరుతో దళిత మేధావులు, వామపక్ష కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారంటూ పోలీసులు ఐదుగురు కార్యకర్తలను జూన్ మాసంలో అరెస్ట్ చేశారు. దళిత సైనికులు బ్రిటీషర్లతో కలిసి పీష్వారాజుల సైన్యంపై పోరాడి విజయం సాధించిన ఘట్టానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఎల్గార్ పరిషత్ పేరుతో కొందరు దళిత , వామపక్ష కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత చెలరేగిన హింసకు కారకులంటూ హక్కుల కార్యకర్తలు రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, సుధీంధ్ర గాండ్లింగ్, ప్రొఫెసర్ షోమాసేన్, మహేశ్ రౌత్ లను అరెస్ట్ చేశారు. దిల్లీ కేంద్రంగా పనిచేసే హక్కుల కార్యకర్త రోనా విల్సన్ దగ్గర మావోయిస్టులు రాసిన లేఖ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్రపన్నారని.. ఆ వివరాలు ఈ లేఖలో ఉన్నాయని వెల్లడించారు. వీరందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయిని పేర్కొన్నారు. మావోయిస్టులు రాసినట్టుగా చెపుతున్న ఒక లేఖను వారు ఆధారంగా చూపించారు. రాజీవ్ గాంధీ తరహాలో మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు ఆ లేఖలో ఉందని, వరవరరావు ఆ కుట్రకు ఆర్థిక సాయం చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. అయితే ఆ లేఖ పోలీసుల కల్పితమని వరవరరావు చెప్పారు. అనేక హక్కుల సంఘాలు, రచయితల సంఘాలతో పాటు సంజయ్ నిరుపమ్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఉత్తరం కల్పితమని విమర్శించారు. పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవడానికి మోదీ సర్కారు ఇలాంటి డ్రామాలు ఆడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
పట్టణ మేధావులపై ఫోకస్
పోలీసులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల పరిభాషలో అర్బన్ మావోయిస్టులు అనే పదం ఇటీవల తరచుగా దొర్లుతున్నది. పట్టణాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి అర్బన్ నక్సలైట్స్ పనిచేస్తున్నారని చెపుతోంది. మైదాన ప్రాంతాల్లో నక్సలైట్లు విస్తరించడానికి పట్టణాల్లో కొందరు మేధావులు పనిచేస్తున్నారని పోలీసు అధికారులు ఇలాంటి సందర్భాలో చెపుతూ వస్తున్నారు. ఇవాళ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్న వారందరినీ ఆ కేటగిరీలోనే చూస్తున్నారు. నక్సలైట్ ఉద్యమం ఇటీవల వెనుకపట్టు పట్టిందని బలహీనపడిందని ప్రభుత్వం చెపుతూ వస్తున్నది. ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇదే విషయాన్ని మీడియాతో చెప్పారు. చత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతానికే ప్రధానంగా పరిమితమైందని కొందరు విశ్లేషకులు కూడా చెపుతూ వస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రాబల్యం లేకపోవడం గురించి మావోయిస్టు నాయకులు కూడా కొన్ని చోట్ల ప్రస్తావించి ఉన్నారు. అందువల్ల అటు నక్సలైట్ల వైపు నుంచి పట్టణాల గురించిన చర్చ కొంత జరుగుతూ ఉంది. నగరాల్లో ఉంటూ దళిత బహుజన హక్కుల కోసం ఆదివాసీ హక్కుల కోసం కోర్టుల్లొను, బయటా వేర్వేరు రూపాల్లో పోరాడుతున్న పలువురు లాయర్లు, ప్రొఫెసర్లపై కేంద్రం నిఘా ఉంచిందని, వారిని వేధించే ప్రయత్నాలు చేస్తున్నదని హక్కుల కార్యకర్తలు కొంత కాలంగా చెపుతూ వస్తున్నారు. ముఖ్యంగా దిల్లీ ఫ్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్ తర్వాత ఈ అంశం మీద ఫోకస్ ఎక్కువైంది. బీమా కోరెగావ్ తర్వాత నగరాల్లో పనిచేస్తున్న పౌరహక్కుల కార్యకర్తలపై ఒత్తిడి పెరిగింది. ఇవాల్టి ఆపరేషన్‌తో ప్రభుత్వం తన ధోరణిని చాటి చెప్పింది.
పోలీసులేం చెపుతున్నారు?
అరెస్టయిన వారందరూ మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారేనని పూణే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివాజీ బోద్కే బీబీసీతో అన్నారు. మావోయిస్టుల హింసకు వీరు కారకులవుతున్నారని చెప్పారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నినట్టుగా గతంలో పోలీసులు బయటపెట్టిన లేఖపై నిర్దుష్టంగా మాట్లాడ్డానికి ఆయన ఇష్టపడలేదు. పూర్తి వివరాలు రేపు ప్రెస్‌మీట్లో చెప్తామని మాత్రం వెల్లడించారు. బీమా కోరెగావ్‌లో హింస వెనుక మావోయిస్టు పార్టీ ఉన్నదని ఆయన చెప్పారు.
మరోవైపు ప్రభుత్వ చర్యలను పౌరహక్కుల సంఘాలు, పలు దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడానికి రకరకాల అభియోగాలు మోపుతున్నారని వారు వాదిస్తున్నారు.
కార్యకర్తల్ని జైళ్లకు పంపండి.. ఫిర్యాదు చేసే వాళ్లను కాల్చేయండి - రాహుల్ గాంధీ
పౌర హక్కుల సంఘాల నాయకులు, కార్యకర్తల అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘దేశంలో ఒకేఒక్క ఎన్జీఓకు స్థానం ఉంది. దానిపేరు ఆర్ఎస్ఎస్. మిగతా ఎన్జీఓలు అన్నింటినీ మూసేయండి. కార్యకర్తల్ని జైళ్లకు పంపండి. ఫిర్యాదు చేసే వాళ్లను కాల్చేయండి. సరికొత్త భారతదేశానికి స్వాగతం’’ అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
హంతకులకు సన్మానాలు - హక్కుల కార్యకర్తలకు బేడీలు.. అరుంధతీ రాయ్
మతోన్మాదంతో మూకదాడులు చేసి హత్యలు చేస్తున్నవారిని చల్లగా చూస్తున్న ప్రభుత్వం లాయర్లు, రచయితలు, మేధావులు, దళితహక్కుల కార్యకర్తలపై ఈ విధంగా కేసులు మోపడం చూస్తే ప్రభుత్వం ఏ దిశగా పాలన సాగిస్తున్నదో అర్థమవుతోందని ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ బీబీసీ తెలుగుతో అన్నారు. ''హంతకులకు సన్మానాలు చేస్తున్నారు. హిందూ ఆధిపత్య పాలనను విమర్శించేవాళ్లపై నేరాలు మోపుతున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసం పన్నాగమా!'' అని ఆమె అరెస్టులను ఖండిస్తూ తన అభిప్రాయం చెప్పారు.
గట్టిగా గొంతెత్తి మాట్లాడేవారిని ఇలాగ వేధించి భయభ్రాంతులు సృష్టించడమే ప్రభుత్వ పన్నాగం కావచ్చని మానవ హక్కుల వేదిక నాయకుడు వి ఎస్ కృష్ట అభిప్రాయపడ్డారు. బెయిల్ రావడం కష్టమైన యుఏపిఏ చట్టం కింద కేసులు మోపడం కార్యకర్తలను వేధించడానికే నని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఫాసిజం వైపు ఫాస్ట్ ఫార్వర్డ్?’
- ‘భీమా-కోరెగాం అల్లర్ల వెనుక అసలు కుట్ర ఏమిటి?’
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- స్ఫూర్తి ప్రదాతల కోసం దళితుల వెదుకులాట
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- ఇప్పటికీ నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు.. ఎందుకు?
- నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?
- ‘మోదీ గంటల కొద్దీ గొప్పలు చెప్పి.. చివర్లో సన్యాసిని అంటారు’
- ‘మోదీ మాటకారితనం ఏమైపోయింది?’
- జశోదాబెన్: ‘మోదీతో నాకు పెళ్లైంది, అబద్ధాలు ప్రచారం చేయకండి’
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు : భాగ్యనగరాన్ని నిర్మించింది నిజాంలు కాదు BBC Special
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- వెనెజ్వేలా: శృంగార జీవితాన్ని దెబ్బతీస్తున్న ద్రవ్యోల్బణం
- ఆసియా క్రీడలు: చరిత్ర సృష్టించిన సింధు.. బ్యాడ్మింటన్‌లో రజతం
- షామీ పోకో ఎఫ్ 1: మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఇక ధరల యుద్ధమే
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)