You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి తలుపులు తెరిచిన కేంద్రం.. ఇస్రో వసతులు వాడుకునేందుకు అవకాశం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకునేందుకు వీలుగా కేంద్రం కొత్త సంస్థ ‘ఇన్ స్పేస్’ను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలకూ ఆమోదం పలికింది.
ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న 1482 పట్టణ, 58 రాష్ట్ర సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.
ఈ మేరకు కేబినెట్ నిర్ణయాల ఆయా శాఖల మంత్రులు మీడియాకు వెల్లడించారు.
అంతరిక్ష పరిశోధనల రంగంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్ స్పేస్)ను ఏర్పాటు చేస్తున్నట్లు అణు విద్యుత్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
భారత అంతరిక్ష సంస్థ మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకొనేందుకు ఇది అవకాశమేర్పరుస్తుందన్నారు.
ఇస్రోలో అంతర్భాగంగా ఇన్-స్పేస్ గతంలోనూ ఉందని.. దాన్ని ఇప్పుడు మరింతగా విస్తరిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఇస్రో ప్రాజెక్టులు, మిషన్లు యథావిధిగా కొనసాగుతాయని.. అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలకు సంబంధించి నిర్ణయాధికారం ఇస్రోకే ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
8.6 కోట్ల మంది మదుపర్లకు ప్రయోజనం
సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వివరించారు.
ఆర్బీఐ పర్యవేక్షణలోకి తేవడం వల్ల సహకార బ్యాంకుల్లో రూ. 4.84 లక్షల కోట్లకుపైగా డిపాజిట్ చేసిన 8.6 కోట్ల మందికిపైగా మదుపర్లకు తమ ధనానికి సంబంధించి మరింత భరోసా దొరుకుతుందన్నారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజనలో శిశు విభాగం కింద రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో రెండు శాతం రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.
మరికొన్ని నిర్ణయాలు
* వెనుకబడిన తరగతుల కులాల్లో ఉప వర్గీకరణపై పరిశీలనకు నియమించిన కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగించారు. 2021 జనవరి 31 వరకు ఈ కమిషన్ అమల్లో ఉంటుంది.
* దిల్లీ సమీపంలోని ఖుషీనగర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)