డెక్సామెథాసోన్: కరోనావైరస్ 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మంగళవారం సాయంత్రం నుంచి డెక్సోనా టాబ్లెట్లు, ఇంజెక్షన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే, ఈ మందు ఇంతకు ముందు కూడా వాడుకలో ఉంది. కానీ ఇప్పుడు ప్రిస్కిప్షన్‌తో వస్తున్నవారందరూ ఒక్కో నెల డోస్ కోసం వస్తున్నారు.’’

ఉత్తర ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఉన్న ఒక మెడికల్ స్టోర్ యజమాని రోహన్ కపూర్‌ ఫోన్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 0.5 ఎంజీ పవర్ డెక్సోనా 30 కోలీలు ఏడు రూపాయలకే దొరుకుతాయి. పట్టణాల్లోనే కాదు, ఇవి గ్రామాల్లో కూడా దొరుకుతాయి అన్నారు రోహన్.

దిల్లీ దగ్గర నోయిడాలో కూడా ఇంచుమించు ఇదే పేరుతో ఉండే మందుల గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం సాయంత్రం ఒక మెడికల్ షాపు దగ్గర ఇద్దరు యజమానితో ఈ మందు గురించి అడుగుతున్నారు.

షాపు యజమాని వారితో “మందు ధర తక్కువే. కానీ మీకు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వలేం. అందులో స్టెరాయిడ్ ఉంటుంది. సులభంగా, కావల్సినన్ని కొనుక్కోడానికి అది క్రోసిన్, కాంబిఫ్లామ్ లాంటి మందు కాదు” అన్నారు.

నిజానికి డెక్సోనా, అదే పేరులా ఉన్న చాలా మందులు భారత్‌లో వాడుకలో ఉన్నాయి. వాటిని డాక్టర్లు చాలాకాలం నుంచి రోగులకు ఇస్తూ వస్తున్నారు. వీటన్నిటి తయారీలో ‘డెక్సామెథాసోన్’ అనే సాల్ట్ లేదా మందు రసాయన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.

సాధారణంగా టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ ద్వారా ఉపయోగించే ఈ మందును డాక్టర్లు ఆర్థరైటిస్, ఆస్తమా, శరీరంలో మంట లేదా అలర్జీ లాంటి సమస్యలకు ఇస్తారు. సెప్సిస్ లాంటి తీవ్రమైన వైద్య పరిస్థితుల్లో కూడా ఈ మందును ఇస్తారు.

డెక్సామెథాసోన్‌కు డిమాండ్ ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా చాలా చౌకగా, సులభంగా లభించే డెక్సామెథాసోన్ కరోనా వైరస్‌తో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడగలదని ఇటీవల బ్రిటన్ నిపుణులు చెప్పారు.

ఈ మందును బ్రిటన్‌లో కరోనా ప్రారంభ సమయంలో ఉపయోగించి ఉంటే దాదాపు ఐదు వేల మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమని వారు అంచనా వేశారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక టీమ్ ఆస్పత్రుల్లో ఉన్న 2000 మంది కరోనా రోగులకు ఈ ఔషధం ఇచ్చింది, ఆ తర్వాత ఈ మందు ఇవ్వని 4 వేలమంది కరోనా రోగులతో ఆ ఫలితాలను పోల్చి చూసింది.

ఇందులో, వెంటిలేటర్ మీద ఉన్న రోగులకు ఈ మందు ప్రభావంతో 40 శాతం నుంచి 28 శాతం వరకూ చనిపోయే ప్రమాదం తగ్గింది. ఆక్సిజన్ అవసరమైన వారిలో మరణించే ప్రమాదం 25 శాతం నుంచి 20 శాతం వరకూ తగ్గింది.

పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం వైరస్ ఇన్ఫెక్షన్ శరీరంలో ఇన్‌ఫ్లేషన్(మంట) పెంచేందుకు ప్రయత్నిస్తుంది. డెక్సామెథాసోన్ ఆ ప్రక్రియను నెమ్మది చేయడంలో సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది.

కానీ, ఈ ఔషధాన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాపై లేదా వెంటిలేటర్ మీద ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. ఈ మందు చౌక కూడా కాబట్టి, పేద దేశాలకు ఇది చాలా ప్రయోజనకరమని నిరూపితం కావచ్చు.

భారత్‌లో డెక్సామెథాసోన్ వాడకం

భారత్‌లో డెక్సామెథాసోన్ ఔషధాన్ని 1960వ దశకం నుంచి ఉపయోగిస్తున్నారు. జనాభా పెరిగేకొద్దీ, దాని వాడకం కూడా పెరిగింది.

ఒక అంచనా ప్రకారం భారత్‌లో డెక్సామెథాసోన్ అమ్మకాలు ఏటా వంద కోట్లకు పైనే ఉంటుంది. ఇది చాలా చౌక కాబట్టే దీని అమ్మకాలు అంత పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

భారత ప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ పాలసీ(అవసరమైన ఔషధాలను నియంత్రించే విధానం) కింద ఈ ఔషధం మాత్రలు, ఇంజెక్షన్ ధర ఐదు నుంచి 10 రూపాయల లోపే ఉండాలి.

ఔషధ పరిశోధన, తయారీ నిపుణులు డాక్టర్ అనురాగ్ హితకారీ మాట్లాడుతూ.. డెక్సామెథాసోన్ సోడియం ఫాస్పేట్ ఒక స్టెరాయిడ్. దాని వాడకం భారత్‌లో చాలా కామన్ అని అన్నారు.

“భారత్‌లో చిన్నా. పెద్దవి కలిపి దీన్ని తయారు చేసే కంపెనీలు 8 వరకూ ఉన్నాయి. ఈ మందుకు రకరకాల ఫార్ములేషన్(టాబ్లెట్, ఇంజెక్షన్ లాంటివి) తయారు చేసే కంపెనీలు 15కు పైనే ఉన్నాయి. దానితోపాటు ఈ మందు కోసం అవసరమైన సాల్ట్స్ విదేశాల నుంచి దిగుమతి కూడా చేసుకుంటున్నారు” అని చెప్పారు.

స్టెరాయిడ్స్‌ లో ఇది కూడా ఒకటి కాబట్టి, భారత్‌లో డెక్సామెథాసోన్ మందు ఫార్ములేషన్‌ను బ్లడ్ క్యాన్సర్, మరికొన్ని క్యాన్సర్ రోగుల చికిత్సకు కూడా ఉపయోగిస్తుంటారు.

స్టెరాయిడ్ మనిషి శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను టార్గెట్ చేస్తుంది. దానివల్ల కీమో థెరపీ ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుంది అని ఇంద్రప్రస్త్ అపోలో, మేదాంత ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగం చీఫ్‌గా పనిచేసిన డాక్టర్ రాకేష్ చోప్రా చెప్పారు.

డెక్సామెథాసోన్‌కు- క్రీడాకారులు, అథ్లెట్లకు కూడా చాలా బలమైన బంధం ఉంది. క్రీడలకు సంబంధించిన తేలికపాటి, తీవ్రమైన గాయాల నుంచి కోలుకోడానికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆటగాళ్లు త్వరగా కోలుకోడానికి దీనిని ఇస్తారు.

అయితే అంతర్జాతీయ డోపింగ్ ఏజెన్సీ డెక్సామెథాసోన్‌ను నిషేధిత మందుల జాబితాలో చేర్చింది. అంటే ఒక పోటీ సమయంలో ఈ మందును తీసుకోవడం పూర్తిగా నిషేధం. కానీ పోటీకి ముందు లేదా తర్వాత చికిత్స సమయంలో దీనిని ఉపయోగించవచ్చు.

డెక్సామెథాసోన్‌ వాడకంలో జాగ్రత్తలు

డెక్సామెథాసోన్ ఒక చౌక, సమర్థమైన మందు కాబట్టి దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దీనిని దుర్వినియోగం చేయడం వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి.

భారత్‌లో అత్యంత మిస్‌యూజ్(దుర్వినియోగం) అయ్యే ఔషధాల్లో డెక్సామెథాసోన్ ఒకటి అని జేఎన్ఎంసీ ఎఎంయూ మెడికల్ కాలేజీ ట్రామా సెంటర్ అధికారి డాక్టర్ అసద్ మహమూద్ చెప్పారు.

“ఈ మందు చాలా రకాల ఆరోగ్య సమస్యలపై వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ రోగులకు వాపు లాంటివి దీనివల్ల తగ్గుతాయి. కానీ, అది పూర్తిగా నయం కాదు, ఎందుకంటే ఆ ప్రభావం తాత్కాలికమే. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ లేకుండానే డాక్టర్లమని చెప్పుకునే వారు ఇచ్చే దాదాపు ప్రతి ప్రిస్కిప్షన్ మీదా ఈ మందు కనిపిస్తుంది” అని మహమూద్ అన్నారు.

ఈ మందును దుర్వినియోగం చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

“స్కిన్ ఎలర్జీ నుంచి కీళ్లనొప్పుల వరకూ దీన్ని ఉపయోగిస్తారు. కానీ డెక్సామెథాసోన్ ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అది మంచిది కాదు” అని దిల్లీలో మాక్స్ హెల్త్ కేర్ సీనియర్ ఎనస్తెస్ట్ డాక్టర్ మనోజ్ సిన్హా చెప్పారు.

ఈ మందును ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్రలేమి, అలసట, బరువు పెరగడం, శరీరంలో నీరు చేరడం లాంటి సమస్యలు వస్తాయి.

భారత్‌లో డెక్సామెథాసోన్ ఔషధాన్ని ప్రీమెచ్యూర్ లేబర్(సమయానికి ముందే ప్రసవించే) గర్భిణులకు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

“ఆ సమయంలో మహిళలు అత్యంత బలహీనంగా ఉంటారు. ఈ మందు వారికి తక్షణ ఉపశమనం అందిస్తుంది. కానీ దీనిని డాక్టర్ ప్రిస్కిప్షన్ మీదే తీసుకోవాలి. లేదంటే దుష్ప్రభావాలు చూపిస్తుంది” అని డాక్టర్ అసద్ మహమూద్ తెలిపారు.

ఇక బ్రిటన్ నిపుణుల వాదనల విషయానికి వస్తే, డెక్సామెథాసోన్ వల్ల విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు సాయం లభిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఇప్పుడు ఈ పరిశోధన పూర్తి ఫలితాలను స్టడీ చేస్తోంది.

“పరిశోధనల్లో కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన రోగులపై ఈ మందు ప్రభావం చూపించిందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే, ఈ మందు లక్షణాలు తక్కువగా ఉన్నవారిపై ప్రభావం చూపించడం లేదు. మేం మొత్తం అధ్యయనం ప్రచురణ కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎవరూ తమకు తాముగా ఈ మందు ఉపయోగించకూడదు” అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే అన్నారు.

దీనికి వైద్యుల పర్యవేక్షణ అవసరం అని ఐసీఎంఆర్ భావిస్తోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)