తెలంగాణ‌ బోనాలు: ప్లేగు మహమ్మారి నేపథ్యంలో మొదలైన ఈ వేడుకలు కరోనా మహమ్మారి వల్ల ఇంటికే పరిమితం అవుతాయా?

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏటా వైభ‌వంగా నిర్వ‌హించే బోనాల వేడుక‌ల్ని అంద‌రూ ఇంటిలోనే నిర్వ‌హించుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచించింది. క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న న‌డుమ ప్ర‌జ‌లు ఆల‌యాల‌కు రావొద్ద‌ని వివ‌రించింది.

రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, మ‌హ‌మూద్ అలీల‌తోపాటు దేవా‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ త‌దిత‌రులు స‌మావేశ‌మై ఈ నిర్ణయం తీసుకున్నారు.

సామూహికంగా ప్ర‌జ‌లు పాల్గొనే ఎలాంటి మ‌త వేడుక‌లూ ఇప్పుడు నిర్వ‌హించొద్ద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది.

కొన్ని రోజుల క్రితం‌ కేర‌ళ కూడా త్రిస్సూర్ పూరం వేడుక‌ల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌జ‌లు పెద్ద‌యెత్తున గుమిగూడే వేడుక‌ల్లో ఇది కూడా ఒక‌టి.

"సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రి"

1813వ సంవత్సర కాలంలో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ప్లేగు విజృంభించింది. వేల మంది బ‌లి తీసుకుంది.

ప్లేగును అదుపు చేయాలంటూ ఉజ్జ‌యినిలోని మ‌హంకాళి దేవాల‌యంలో హైద‌రాబాద్ నుంచి వెళ్లిన సైన్యం మొక్కుకుంది. ఆ దేవ‌తే ప్లేగును అదుపు చేసింద‌ని అప్ప‌ట్లో అంద‌రూ న‌మ్మేవారు. ఆమె పేరుతో గోల్కొండ కోట ప‌రిస‌రాల్లో మ‌హంకాళి ఆల‌యాన్నీ నిర్మించారు. ఇక్క‌డి నుంచే ఆషాఢ మాస తొలి ఆదివారంనాడు బోనాల జాత‌ర మొద‌ల‌వుతుంది.

బోనాల ఉత్స‌వాలు 1813లో మొద‌ల‌య్యాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్ర‌భుత్వం సూచించిన విధంగా పూజారులు మాత్ర‌మే వేడుక‌లు నిర్వ‌హిస్తార‌ని, ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆల‌యానికి రావొద్ద‌ని మ‌హంకాళి ఆల‌య ఈవో అన్న‌పూర్ణ చెప్పారు.

"ఆల‌యాలు తెర‌చేట‌ప్పుడు మాకు కొన్ని నిబంధ‌న‌లు పాటించ‌మ‌ని సూచించారు.. అంద‌రూ ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. శానిటైజ‌ర్లు వాడాలి. మాస్క్‌లు పెట్టుకోవాలి. దేవాల‌యం లోప‌ల‌కు అడుగుపెట్టేవారికి థర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌నిస‌రిగా చేయాలని ప్ర‌భుత్వం సూచించింది. ఏ వేడుక‌లైనా వీటిని అనుస‌రించే నిర్వ‌హిస్తాం."

"ప్ర‌జ‌లు ఇళ్ల‌లో, ఆల‌యం లోప‌ల వేడుక‌లు ఎలా నిర్వ‌హించాలి అనే విష‌యంలో ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తుంది. నాలుగైదు రోజుల్లో ప్ర‌భుత్వం వీటిపై ప్ర‌క‌ట‌న చేస్తుంది"అని ఆమె అన్నారు.

"ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు"

200 ఏళ్ల‌కుపైనే చ‌రిత్ర ఉన్నట్లు చెబుతున్న ఈ వేడుక‌లను ఇలా నిర్వ‌హించ‌డం బ‌హుశా ఇదే తొలిసార‌ని రేణుకా ఎల్లమ్మ దేవాల‌య అర్చ‌కులు శ్ర‌వ‌ణకుమారాచా‌ర్యులు తెలిపారు.

"1970ల్లో అత్య‌యిక ప‌రిస్థితి విధించిన‌ప్పుడు కూడా బోనాలు కొన‌సాగాయి. ఎప్పుడూ ఈ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌లేదు. కొన్నిసార్లు అంత ఘ‌నంగా జ‌ర‌గ‌క‌పోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ లేదు."

"ప్లేగు లాంటి వ్యాధుల్ని నియంత్రించ‌డంతోపాటు భ‌క్తుల కోరిక‌ల‌ను నెర‌వేరుస్తున్నందుకు అమ్మ‌వారికి కృతజ్ఞతగా ఈ వేడుక‌లు నిర్వ‌హిస్తాం. అయితే జ‌బ్బులే ఉత్స‌వాలు జ‌రుపుకోకుండా అడ్డుప‌డుతున్నాయి."

"భోనం అంటే భోజ‌నం. మ‌న‌సులో అమ్మ‌వారిని త‌ల‌చుకొని కొంద‌రు ఇంట్లో దేవుడి ప‌టం ముందు భోజ‌నం పెడుతుంటారు. మ‌రికొంద‌రు ఆరుబ‌య‌ట సూర్య భ‌గ‌వానుడి ద‌గ్గ‌ర భోజ‌నం పెడ‌తారు. మైస‌మ్మ‌, పోచ‌మ్మ‌, ఎల్ల‌మ్మ‌, డొక్క‌ల‌మ్మ‌, పెద్ద‌మ్మ‌, పోలేర‌మ్మ‌.. ఇలా అమ్మ‌వార్ల‌లో ఎవ‌రో ఒక‌ర్ని మ‌న‌సులో త‌ల‌చుకొని భోజ‌నం పెడితే స‌రిపోతుంది."

"ఎవ‌రూ పిల‌వ‌ట్లేదు"

బోనాల ఉత్స‌వం ప్ర‌త్యేక‌త‌ల్లో పోతురాజుల వీరంగం ఒక‌టి. పోతురాజు గ్రామదేవతకు సోదరుడని స్థానికుల నమ్మకం. పోతురాజుకు సంబంధించిన పద్దతులు గ్రామాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. మ‌హంకాళి దేవాల‌యం ద‌గ్గ‌ర పోతురాజు వేషం వేసేవారిలో దేవ‌ర‌కొండ యాద‌గిరి కూడా ఒక‌రు.

యాద‌గిరికి సెలూన్ షాప్ ఉంది. బోనాలు జరిగే నెల‌లో ఆయ‌న పూర్తిగా సెల‌వు పెడ‌తారు. తమ ప్రాంతంలో లేదా తమ కుటుంబం చేసే ఉత్సవంలో పోతురాజు ఉండాలనుకున్న వాళ్లు పోతురాజులను ముందుగా సంప్రదించి, డబ్బు, తేదీలు మాట్లాడుకుని బుక్ చేసుకుంటారు.

అయితే ఈ సారి పోతురాజు వేషం కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారు క‌రువ‌య్యార‌ని ఆయ‌న చెప్పారు. "బోనాల‌కు నెల రోజుల‌ ముందే పోతురాజు కోసం దాదాపు 50 నుంచి 60 మంది నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటారు. ఈ సారి ఎవ‌రూ ఫోన్ కూడా చేయ‌లేదు. ఇప్పుడు ఇంట్లోనే బోనాలు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించిన త‌‌ర్వాత అడిగేవారు కూడా లేరు"అని ఆయ‌న అన్నారు.

బోనాలు రోజు కోడి లేదా మేకను అమ్మవారికి బలిగా నోటితో స‌మ‌ర్పిస్తారు. దీన్నే గావు పట్టడం అంటారు. యాద‌గిరి మూడేళ్ల నుంచి గావు పడుతున్నారు. అయితే ఈ సారి గావు కోసం కూడా ఎవ‌రూ త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని యాద‌గిరి చెప్పారు.

రంగం ఉంటుందా?

బోనాల సందర్భంగా స్వర్ణలత "రంగం" చెప్పడం ఆనవాయితీ. కుండ‌పై నిల‌బ‌డి ఆమె చెప్పే మాట‌ల‌ను భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు. బోనాల ఉత్స‌వం చివ‌రి రోజు సికింద్రాబాద్‌లోని మ‌హంకాళి ఆల‌యం ద‌గ్గ‌ర ఏటా స్వ‌ర్ణ‌ల‌త రంగం ఉంటుంది.

ఆ స‌మ‌యంలో భ‌క్తులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స్వ‌ర్ణ‌ల‌త స‌మాధానం ఇస్తారు. వ‌ర్షాలు, వ్య‌వ‌సాయం, వ్యాధులు.. ఇలా చాలా విష‌యాల‌పై ఆమెను భ‌క్తులు ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు.

ఈ సారి మ‌హంకాళి ఆల‌యం ద‌గ్గ‌ర స్వ‌ర్ణ‌ల‌త వీరంగం చెబుతారా? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త‌లేదు.

"ఈ ఏడాది రంగం ఉంటుందా? లేదా అనే విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మా‌చారం లేదు. ఇంకా ఉత్స‌వానికి ప‌ది రోజుల‌కుపైనే స‌మ‌యం ఉంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది" అని మ‌హంకాళి ఆల‌య ఈవో చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)