అన్‌లాక్ 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలా హోం క్వారంటైనా

దేశ వ్యాప్తంగా ఐదవ దశలో కోవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో అనేక రవాణా సేవలు ప్రారంభమయ్యాయి . కంటైన్మెంట్ జోన్లలో మాత్రం జూన్ 30 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మే 24న జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది.

ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలా, సడలించాలా అనే రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవలని సూచించింది.

లాక్ డౌన్ నాలుగో దశలోనే మే 25 నుంచి దేశవ్యాప్తంగా విమాన సేవలు మొదలయ్యాయి. జూన్ 1 నుంచి కొన్ని మార్గాల్లో 200 రైల్ సర్వీసులు మొదలయ్యాయి.

దీంతో, లాక్ డౌన్ కి ముందు వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రజలు తాము వెళ్లాల్సినచోటుకి ప్రయాణమయ్యారు.

అయితే, కోవిడ్ 19 ప్రయాణ స్వరూపాన్నే మార్చేసింది. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్లాలంటే గతంలోలా టికెట్ మాత్రం బుక్ చేసుకుంటే చాలదు.

టికెట్‌తో పాటు ఆయా రాష్ట్రాలలో విధించిన నియమ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని రాష్ట్రాలకి ప్రయాణం చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి వివిధ రవాణా మార్గాల ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణీకులు అనుసరించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్

చెన్నై, ముంబయి , దిల్లీ , గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విమాన ప్రయాణం చేసి వచ్చిన వారెవరైనా 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలి.

ఇవి కాకుండా , మిగిలిన ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వెళ్లేవారు 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.

టికెట్ కొనుక్కోవడానికి ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పందన వెబ్‌సైట్లో తమ వివరాలను నమోదు చేసుకుని ఇ- పాస్ తీసుకోవాలి. ఇది లేని పక్షంలో ప్రయాణానికి అనుమతించరు.

ఎయిర్పోర్ట్‌లో భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవడం తప్పని సరిగా పాటించాలి.

జూన్ 01‌వ తేదీ నుంచి మొదలైన 200 రైళ్లలో 22 రైళ్లు రాష్ట్రంలో పలు మార్గాలలో ప్రయాణించి సుమారు 70‌కి పైగా రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కష్ట సాధ్యం కావడంతో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కడప, గుంతకల్, అనంతపురం, విశాఖపట్టణం, రేణిగుంట, గుంతకల్ లో మాత్రమే రైళ్లని ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు పేర్కొన్నాయి.

ఈ స్టేషన్లలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి అందుబాటులో ఉన్న వేరే రవాణా మార్గాల ద్వారా ప్రజలు వారి గమ్య స్థానాలకు వెళ్ళవచ్చు.

కోవిడ్ ముప్పు తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్లో ఉండవచ్చు. అధిక ముప్పు కలిగిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోవిడ్- 19 నెగిటివ్ వస్తే 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్న తర్వాత ఇంకొక 7 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి.

హోమ్ క్వారంటైన్లో ఉన్నపుడు ప్రాంతీయ వైద్య సిబ్బంది తరచుగా వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు.

కోవిడ్ -19 పరీక్షలు ఎవరికి నిర్వహిస్తారు?

చెన్నై, ముంబయి , దిల్లీ , గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణీకులకు కోవిడ్-19 వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని క్వారంటైన్ కి పంపిస్తారు.

ఇతర రాష్ట్రాల నుంచి రోడ్ ప్రయాణం చేసి వచ్చిన వారికి రాష్ట్రం సరిహద్దుల్లోనే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి ప్రయాణం చేసేవారికి ఎటువంటి తనిఖీలు నిర్వహించటం లేదు.

విమానంలో భయంకరమైన నిశ్శబ్దం

దిల్లీ నుంచి తన సొంతూరు విశాఖపట్నానికి ప్రయాణించిన వంశీ చైతన్య విమాన ప్రయాణ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటిస్తూ, ఎయిర్ పోర్ట్ వెలుపల ఉన్న కియోస్క్ లోనే బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలి వెళ్లాలని చెప్పారు.

"పీపీఈ కిట్లని ధరించిన విమాన సిబ్బంది మాకు స్వాగతం పలికారు. విమానంలో భయంకరమైన నిశ్శబ్దం నెలకొనడం మొదటి సారి చూసాను. ఎయిర్ హోస్టెస్ లు కూడా వారి స్థానాల లోనే ఉన్నారు తప్ప విమానంలో తిరుగుతూ ప్రయాణికుల అవసరాలను చూడటం, ఆహారం, డ్రింకులు లాంటివి అందించటం లాంటి పనులు చేయటం లేదు. ప్రతీ ప్రయాణికుడికి ఒక శానిటైజేషన్ కిట్ ని మాత్రం ఇస్తున్నారు. అందులో ఒక మాస్క్, శానిటైజర్, ఫేస్ మాస్క్, కవర్ ఉన్నాయి".

ఎక్కడికక్కడ ఉష్ణోగ్రత తనిఖీలు, గమ్య స్థానం చేరిన వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే క్వారంటైన్ కి పంపిస్తున్నారు. క్వారంటైన్ దగ్గర వదిలి వచ్చే వరకు పోలీసులు వెంటే ఉంటున్నారని వంశీ తెలిపారు.

తెలంగాణ

దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రం చేరేవారికి ప్రభుత్వ క్వారంటైన్లో ఉండవలసిన అవసరం లేదు. ఉష్ణోగ్రత తనిఖీలు మాత్రం నిర్వహిస్తున్నారు.

అయితే వీరు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో మాత్రం ఉండాలి.

ప్రయాణీకులకు ఇతర నియమ నిబంధనలేవీ అమలులో లేవు.

రైలు ప్రయాణీకులందరికీ ఉష్ణోగ్రత తనిఖీ చేసి, వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటికి పంపిస్తున్నారు. కోవిడ్-19 లక్షణాలు లేని ప్రయాణీకులని హోమ్ క్వారంటైన్‌కి పంపిస్తున్నారు.

కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ క్వారంటైన్‌కి పంపిస్తున్నారు.

కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ప్రయాణీకులందరూ తమ మొబైల్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.

సంబంధిత రవాణా అధికారులు ప్రయాణీకులందరికీ ప్రయాణానికి ముందు, తర్వాత కూడా ఉష్ణోగ్రత తనిఖీలు నిర్వహించేలా చూడాలి.

ప్రయాణీకులంతా మాస్క్‌ని తప్పనిసరిగా ధరించాలి. చేతుల పరిశుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం.

ప్రయాణీకులంతా మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరం పాటించాలి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)