ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1971, మే 24 మధ్యాహ్నం పన్నెండవుతోంది. దిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంసద్ మార్గ్ బ్రాంచ్‌లో చీఫ్ క్యాషియర్ ‌వేద్ ప్రకాశ్ మల్హోత్రా టేబుల్‌పై ఉన్న ఫోన్ మోగింది.

ఫోన్‌లో అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి తాను ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి పీఎన్ హక్సర్‌నని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నారు.

‘‘బంగ్లాదేశ్‌లో ఓ రహస్య కార్యక్రమం చేపట్టేందుకు ప్రధానమంత్రికి రూ.60 లక్షలు కావాలి. ఆ డబ్బు తీసుకుని, సంసద్ మార్గ్‌లోనే ఉన్న బైబిల్ భవన్ దగ్గర నిల్చొని ఉండే వ్యక్తికి ఇవ్వండి. డబ్బంతా రూ.100 నోట్లలో ఉండాలి’’ అని ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా విని మల్హోత్ర కంగారుపడిపోయారు.

ఇంతలో అవతలి వ్యక్తి ‘‘ఇదిగో ప్రధానమంత్రితోనే మాట్లాడండి’’ అని అన్నారు.

కొన్ని సెకన్ల తర్వాత ఫోన్‌లో ఓ ఆడ గొంతు వినిపించింది.

‘‘మీరే స్వయంగా ఆ డబ్బు తీసుకుని బైబిల్ భవన్‌కు రండి. అక్కడ ఓ వ్యక్తి మిమ్మల్నికలుస్తారు. ‘బంగ్లాదేశ్ కా బాబూ’ అని కోడ్ వర్డ్ చెబుతారు. మీరు బదులుగా ‘బార్ ఎట్ లా’ అని అనండి. ఆ తర్వాత డబ్బు ఆ వ్యక్తికి అప్పగించండి. ఈ వ్యవహారం చాలా రహస్యంగా ఉండాలి’’ అని ఆమె మల్హోత్రాతో అన్నారు.

ఆ తర్వాత ఓ క్యాష్ బాక్స్‌లో రూ.60 లక్షలు పెట్టమని డిప్యుటీ చీఫ్ క్యాషియర్ రామ్ ప్రకాశ్ బత్రాకు మల్హోత్రా చెప్పారు.

బత్రా మధ్యాహ్నం 12.30 కి స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లి, డబ్బు తెచ్చారు.

బత్రా, ఆయన సహచరుడు హెచ్ఆర్ ఖన్నా ఆ డబ్బును క్యాష్ బాక్స్‌లో పెట్టారు.

రిజిస్టర్‌లో ఎంట్రీపై డిప్యుటీ హెడ్ క్యాషియన్ రుహేల్ సింగ్ సంతకం చేసి, పేమేంట్ ఓచర్‌ తయారుచేశారు. దానిపై మల్హోత్రా సంతకం చేశారు.

ఆ తర్వాత ఇద్దర అటెండర్లు ఆ పెట్టెను బ్యాంకు వాహనంలో పెట్టారు. మల్హోత్రా స్వయంగా ఆ వాహనం నడుపుకొంటూ బైబిల్ హౌజ్ వద్దకు వెళ్లారు.

కారు ఆగగానే... పొడవుగా, తెల్లగా ఉన్న ఓ మనిషి మల్హోత్రా దగ్గరికి వచ్చి కోడ్ వర్డ్ చెప్పారు.

ఆ తర్వాత ఆ వ్యక్తి, బ్యాంకు కారులోనే కూర్చొని సర్దార్ పటేల్ మార్గ్, పంచశీల్ మార్గ్ జంక్షన్‌లోని టాక్సీ స్టాండ్ చేరుకున్నారు.

అక్కడ ఆ వ్యక్తి డబ్బున్న పెట్టెను కారులోంచి బయటకు తీశారు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి, ఆ డబ్బుకు ఓచర్ తీసుకోమని సూచించారు.

ఫోన్ చేసేందుకు నిరాకరించిన హక్సర్

‘‘మల్హోత్రా తనకు చెప్పింది చెప్పినట్లు చేశారు. ఆ తర్వాత తెలిసింది ఆయన దగ్గరికి వచ్చిన వ్యక్తి పేరు రుస్తుం సోహ్రబ్ నాగర్వాలా అని. కొంతకాలం ముందు ఆయన భారత సైన్యంలో కెప్టెన్ హోదాలో పనిచేశారు. భారత గూఢచార సంస్థ రా కోసం పనిచేశారు’’ అని ఇందిరా గాంధీ జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో కేథరిన్ ఫ్రాంక్ పేర్కొన్నారు.

మల్హోత్రా ప్రధానమంత్రి నివాసానికి వెళ్లారు. అయితే, ఇందిరా గాంధీ పార్లమెంటుకు వెళ్లారని అధికారులు ఆయనకు చెప్పారు. ఆయన వెంటనే పార్లమెంటుకు వెళ్లారు. అయితే, అక్కడ ఆయన ఇందిరా గాంధీని కలవలేకపోయారు. కానీ, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ నారాయణ్ హక్సర్‌ను మల్హోత్రా కలిశారు. ఆయనతో మాట్లాడాక ఎవరో తనను మోసం చేశారని తెలుసుకుని, మల్హోత్రా కంగు తిన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తాము అలాంటి ఫోన్ కాల్ ఏదీ చేయలేదని హక్సర్ చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేయమని సూచించారు.

ఈ సమయంలోనే డబ్బులకు ఓచర్ గురించి ఆర్‌బీ బత్రాను రెండు, మూడు సార్లు రుహేల్ సింగ్ ఆరా తీశారు. బత్రా ఏదో సర్ది చెప్పారు.

బత్రా చాలా సమయం వేచిచూశారు. ఓచర్ రాలేదు. ఇటు మల్హోత్రా కూడా తిరిగి రాలేదు. దీంతో విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ల సూచన మేరకు సంసద్ మార్గ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటు పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు.

నాగర్వాలా అరెస్టు

ఆ రోజు రాత్రి పావు తక్కువ పదింటికి నాగర్వాలాను దిల్లీ గేట్ సమీపంలోని పార్సీ ధర్మశాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. డిఫెన్స్ కాలనీలోని ఆయన స్నేహితుడి నివాసం (ఎ-277) నుంచి రూ.59.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు దీనికి ‘ఆపరేషన్ తూపాన్’ అని పేరు పెట్టుకున్నారు.

ఆ రోజు అర్ధరాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, కేసు పరిష్కరించినట్లు పోలీసులు ప్రకటించారు.

నాగర్వాలా టాక్సీ స్టాండ్ నుంచి రాజేంద్ర నగర్‌లోని ఇంటికి వెళ్లారని, ఆ తర్వాత అక్కడి నుంచి ఓ సూట్‌కేసు తెచ్చుకున్నారని పోలీసులు చెప్పారు. అనంతరం పాత దిల్లీలోని నికల్సన్ రోడ్డుకు వెళ్లారని, అక్కడే డ్రైవర్ ముందు పెట్టె నుంచి డబ్బును సూట్‌కేస్‌లోకి మార్చారని వివరించారు.

ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా ఉండేందుకు డ్రైవర్‌కు నాగర్వాలా రూ.500 ఇచ్చారని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి.

‘‘అనుకున్నట్లుగానే పార్లమెంటులో ఈ విషయమై హంగామా నడిచింది. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ఇందిరా గాంధీ అంతకుముందు ఎప్పుడైనా మల్హోత్రాతో మాట్లాడారా?

ఒకవేళ మాట్లాడి ఉండకపోతే, ఆయన ఇందిరా గాంధీ గొంతును ఎలా గుర్తుపట్టారు?

బ్యాంకు కేషియర్ ఇలా మౌఖిక ఆదేశాలపై ఇంత పెద్ద మొత్తాన్ని బయటకు తీయవచ్చా? అసలు ఈ డబ్బు ఎవరిది?... ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి’’ అని ‘ఇందిరా గాంధీ: ఎ పర్సనల్ అండ్ పొలిటికల్ బయోగ్రఫీ’ అనే పుస్తకంలో ఇందర్ మల్హోత్రా రాశారు.

నాగర్వాలాకు నాలుగేళ్ల జైలు

1971, మే 27న కోర్టు ముందు నాగర్వాలా తన నేరం అంగీకరించారు. అదే రోజు పోలీసులు కోర్టులో కేసు ఫైల్ చేశారు.

మూడు రోజుల్లోపలే ఓ వ్యక్తి అరెస్టై, కేసు విచారణ జరిగి, శిక్ష కూడా పడటం భారత న్యాయ చరిత్రలో బహుశా అదే తొలిసారి కావొచ్చు.

నాగర్వాలాకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా పడింది. అయితే, ఈ ఉదంతం లోలోతుల్లోకి ఎవరూ వెళ్లలేకపోయారు.

బంగ్లాదేశ్‌లో రహస్య కార్యక్రమం అని నాటకమాడి, మల్హోత్రాను మోసం చేసినట్లు నాగర్వాలా కోర్టులో అంగీకరించారు.

కానీ, ఆ తర్వాత ఆయన మాట మార్చారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. కేసుపై పునర్విచారణ జరపాలని ఆయన అభ్యర్థించారు. అయితే, 1971 అక్టోబర్ 28న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

విచారణ జరిపిన అధికారి మృతి

ఈ కేసు విచారణలో పాలుపంచుకున్న అధికారి ఏఎస్పీ డీకే కశ్యప్ 1971 నవంబర్ 20న ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. హనీమూన్‌కు వెళ్తున్న సమయంలో ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు.

ఆ సమయంలో ప్రముఖ వార పత్రిక కరెంట్ ఎడిటర్ డీఎఫ్ కరాకాకు నాగర్వాలా తాను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నానని తెలియజేస్తూ ఓ లేఖ రాశారు.

అయితే కరాకా అప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ఇంటర్వ్యూ కోసం తన అసిస్టెంట్‌ను ఆయన పంపారు. అయితే, ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నాగర్వాలా నిరాకరించారు.

1972 ఫిబ్రవరిలో తిహార్ జైలు ఆసుపత్రిలో నాగర్వాలాను చేర్చారు.. అక్కడి నుంచి ఫిబ్రవరి 21న ఆయన్ను జేబీ పంత్ ఆసుపత్రికి తరలించారు. మార్చి 2న ఆయన పరిస్థితి విషమించింది. గుండెపోటుతో నాగర్వాలా మరణించారు.

అదే రోజు నాగర్వాలా 51వ పుట్టిన రోజు.

ఈ మొత్తం ఉదంతం వల్ల ఇందిరా గాంధీకి చెడ్డ పేరు వచ్చింది.

1977లో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాగర్వాలా మృతి చెందిన పరిస్థితులపై విచారణ జరిపేందుకు జగన్మోహన్ రెడ్డి కమిషన్‌ను వేసింది.

ఈ కమిషన్ విచారణలో కొత్త విషయాలేవీ వెలుగుచూడలేదు. నాగర్వాలా మరణం విషయంలోనూ అసాధారణ కోణాలేవీ బయటపడలేదు.

ఇంత పెద్ద మొత్తం డ్రా చేసేందుకు బ్యాంకు మేనేజర్‌ను కాకుండా, చీఫ్ క్యాషియర్‌ను ఎందుకు సంప్రదించారు? చెక్కులు, వౌచర్లు లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు స్టేట్ బ్యాంకుకు అధికారం ఇచ్చారా? అనే ప్రశ్నలు ఉదయించాయి.

సీఐఏ ఆపరేషన్?

రా సంస్థ చెప్పిందాని ప్రకారం బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ కోసం ఈ డబ్బులు డ్రా చేశారంటూ పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి.

‘‘రా మాజీ అధిపతి రామ్‌నాథ్ కావ్‌ను, సంస్థలో నెంబర్ 2గా పనిచేసిన సంకరన్ నాయర్‌ను ఈ విషయం గురించి అడిగాం. వాళ్లిద్దరూ ఈ కథనాలను ఖండించారు. ఈ వ్యవహారంతో రాకు అస్సలు సంబంధం లేదని అన్నారు’’ అని ‘మిషన్ ఆర్ అండ్ డబ్ల్యూ’ అనే పుస్తకంలో ఆర్‌కే యాదవ్ రాశారు.

స్టేట్ బ్యాంకులో రా సంస్థకు రహస్య ఖాతా ఉందన్న వాదనను కూడా ఆ అధికారులు ఖండించారు.

ఇందిరా గాంధీ మరణించిన రెండు సంవత్సరాలకు హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనం రాసింది. నాగర్వాలా రా కోసం పనిచేసేవారు కాదని, అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కోసం పనిచేసేవారని అందులో పేర్కొంది. ఇందిరా గాంధీ పేరును చెడగొట్టాలన్న ఉద్దేశంతోనే ఆ మొత్తం వ్యవహారం జరిగిందని, ఆ సమయంలో బంగ్లాదేశ్ విధానంలో భారత్ తీరుతో అమెరికాలోని నిక్సన్ ప్రభుత్వం చాలా అసంతృప్తితో ఉందని రాసింది.

కానీ, ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ ఆ కథనం చూపించలేదు. ఎలాంటి పత్రాలూ లేకుండా ఓ బ్యాంకు క్యాషియర్ అంత పెద్ద మొత్తాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఎలా అప్పగిస్తారనే ప్రశ్నకు కూడా సమాధానం దొరకలేదు.

అయితే, ఆ ఉదంతంలో ఒక్క రూ.5వేలు పోనూ మిగతా డబ్బంతా రికవర్ అయ్యింది. ఆ రూ.5వేలను మల్హోత్రా భరించారు. బ్యాంకుకు ఈ వ్యవహారం వల్ల నష్టమేమీ జరగలేదు. కానీ, చెడ్డ పేరు వచ్చింది. డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ తర్వాత మల్హోత్రాను స్టేట్ బ్యాంకు ఉద్యోగం నుంచి తీసివేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పదేళ్ల తర్వాత మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ స్థాపించినప్పుడు, మల్హోత్రాను సంస్థ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా అప్పటి ప్రభుత్వం నియమించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)