కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా: "నేను చనిపోవాలని కొందరు ప్రార్థించారు.. కానీ, నాకు ఏ వ్యాధీ లేదు, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా"

“నా ఆరోగ్యం గురించి ఆందోళనకు గురైన అందరికీ నా సందేశం”

ఈ ట్వీట్‌ను భారత హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో పెట్టారు. దానితోపాటు ఆయన ట్విటర్‌లో ఒక సుదీర్ఘ ప్రకటన కూడా పోస్ట్ చేశారు.

నిజానికి కొన్ని రోజుల నుంచీ అమిత్ షా ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది ఆయనకు క్యాన్సర్ వచ్చిందని అంటుంటే, మరికొందరు కరోనా వచ్చిందని చెబుతున్నారు.

ఈ వదంతులకు కారణం బహుశా హోం శాఖ మంత్రి కొంతకాలం కనిపించకపోవడమే అయ్యుంటుంది. అయితే, కొన్నిరోజుల ముందు ప్రధాని మోదీ, ఇతర మంత్రులతో సమావేశం అయినపుడు, అందులో ఆయన కూడా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. అప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి ఊహాగానాలు ఆగలేదు.

చివరికి అమిత్ షా స్వయంగా ట్వీట్ చేసి దాని గురించి సమాచారం ఇవ్వాల్సి వచ్చింది.

ట్విటర్‌లో అమిత్ షా ప్రకటన

“గత కొన్నిరోజులుగా కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో నా ఆరోగ్యం గురించి చాలా కల్పిత వదంతులు వ్యాపించేలా చేశారు. కొంతమందైతే నేను చనిపోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు కూడా చేశారు.

దేశం ఇప్పుడు కరోనా లాంటి విశ్వ మహమ్మారితో పోరాడుతోంది. దేశ హోంమంత్రిగా అర్థరాత్రి వరకూ నా పనుల్లో బిజీగా ఉండడం వల్ల నేను వీటన్నిటిమీదా దృష్టి పెట్టలేదు. ఇవి నా దృష్టికి రాగానే, అందరూ తాము కల్పించిన ఆలోచనలతో సంతోషిస్తున్నారని గ్రహించాను. అందుకే, నేను ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ నా పార్టీకి చెందిన లక్షలాది కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు గత రెండు రోజులుగా చాలా ఆందోళనకు గురయ్యారు. వాటిని పట్టించుకోకుండా ఉండలేను. అందుకే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, నాకు ఎలాంటి వ్యాధీ లేదని ఈరోజు స్పష్టం చేయాలనుకుంటున్నాను”.

‘‘హిందూ విశ్వాసాల ప్రకారం ఇలా భావించడం, ఇలాంటి వదంతులు పుట్టించడం వల్ల అవి మనం మరింత ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తాయి. అందుకే అలా చేస్తున్న అందరూ ఇక పనికిరాని విషయాలను వదిలి, నన్ను నా పనిచేసుకోనిస్తారని, వారు కూడా వారి పని చూసుకుంటారని ఆశిస్తున్నాను.

నా క్షేమం గురించి అడిగినందుకు, నా గురించి ఆందోళన చెందినందుకు నా శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను.

ఈ వదంతులు సృష్టించింది ఎవరైనా, వారిపట్ల నా మనసులో ఎలాంటి పగ, ద్వేషం లేదు. మీకు కూడా ధన్యవాదాలు."

- అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ఈ ట్వీట్ తర్వాత ట్విటర్‌లో #AmitShah ట్రెండ్ అయ్యింది. ఈ సమాచారం ఇచ్చినందుకు కొందరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన దీర్షాయుష్షును కోరుకున్నారు.

జార్ఖండ్‌ బీజేపీ సీనియర్ నేత రఘువర్ దాస్ “జాకో రాఖే సయ్యా మార్ సకే నా కోయ్”(దేవుడి ఆశీస్సులు ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు) అని ట్వీట్ చేశారు.

‘‘మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, మీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ అని అనుజ్ మిశ్రా ట్వీట్ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)