కరోనావైరస్ సోకిన ఇండియన్ నేవీ సిబ్బంది ఎక్కడున్నారు.. వారికి ఎలా సోకింది

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన భారత నావికా దళానికి చెందిన 21 మంది జవాన్లలో 20 మంది ఐఎన్ఎస్ ఆంగ్రే’ భవనంలో ఉంటున్నారు.

ఈ భవనం ముంబయి ఫోర్ట్ ప్రాంతంలోని నేవల్ బేస్ డాక్‌యార్డ్ క్యాంపస్‌లో తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ అవివాహిత జవాన్లు ఉంటారు.

ఈ భవనం గురించి తెలిసిన ఒక అధికారి తన పేరు బయటపెట్టకూడదనే షరతుతో “ఐఎన్ఐస్ ఆంగ్రేలో 650 నుంచి 750 మంది నేవీ జవాన్లు ఉండడానికి ఏర్పాట్లు ఉంటాయి. నేవీ భాషలో దీనిని ‘ఇన్-లివింగ్ బ్లాక్’ అంటారు” అని చెప్పారు.

“ముఖ్యంగా ఇది చాలా వరకూ బ్యాచిలర్స్ ఉండే హాస్టల్లా ఉంటుంది. వీరు ఉండే గదుల్లో వంట చేయడానికి విడిగా వంటగది లేదు. దాంతో నేవీ జవాన్లు అందరూ కామన్ ఏరియాలోకి వచ్చి తింటూ ఉంటారు” అన్నారు.

కొందరి వివరాల ప్రకారం ఈ భవనంలో చాలా గదులకు విడిగా బాత్రూంలు కూడా లేవు. దాంతో చాలామంది ప్రతి ఫ్లోర్‌లో ఉన్న కామన్ బాత్రూమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

కరోనా వచ్చిందని ఎలా తెలిసింది?

భారత నావికాదళం దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది. అందులో ముంబయి నేవీ జవాన్ల క్యాంపస్‌లో మొత్తం 21 మందికి కోవిడ్-19 వచ్చింది. వారిలో ‘ఐఎన్ఎస్ ఆంగ్రే’లోని 20 మంది జవాన్లు ఉన్నారు” అని చెప్పింది.

నిజానికి, భారత నావికాదళంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్ 5న ఒక నేవీ జవాన్‌కు కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు బయటపడింది.

ఏప్రిల్ 7న టెస్ట్ ఫలితాల్లో అతడికి పాజిటివ్ అని వచ్చింది. బాధిత జవానుకు ముంబయిలోని ‘ఐఎన్ఎస్ అశ్విని’ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

‘ఐఎన్ఎస్ అశ్విని’ నావీ వెస్టర్న్ కమాండ్‌కు సంబంధించిన అతిపెద్ద ఆధునిక ఆస్పత్రి. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన జవాన్లు, ఏప్రిల్ 7న కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన జవాన్‌ను కాంటాక్ట్ అయ్యారని నావికాదళ అధికారులు చెబుతున్నారు.

కోవిడ్-19 టెస్టులో పాజిటివ్‌గా తేలిన ఈ 20 మంది జవాన్లలో దాదాపు అందరూ ‘ఐఎన్ఎస్ ఆంగ్రే’లో ఉంటున్నవారే కావడంతో ఈ కేసులు బయటపడగానే, నావికాదళం అప్రమత్త మైంది.

నావికాదళం అప్రమత్తం

ఈ జవాన్ల వయసు 20-25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఈ నివాస భవనాన్ని ఇప్పుడు పూర్తిగా క్వారంటైన్ చేసేశారని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు, దేశంలోని వివిధ డాక్‌యార్డులు లేదా స్థావరాల దగ్గర ప్రస్తుతం మోహరించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైరస్ వ్యాపించకుండా ఇండియన్ నేవీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

భారత పదాతి దళంలో కూడా ఇప్పటివరకూ 8 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

గమనించాల్సిన విషయం ఏంటంటే, అత్యంత బలమైనదిగా భావించే అమెరికా నావికా దళ యుద్ధ విమాన వాహక నౌక ‘థియోడోర్ రూజ్‌వెల్డ్‌’ కూడా కోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకుంది.

ఆ నౌకలోని వంద మందికి పైగా నేవీ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత వెంటనే ఈ నౌకలోని 2 వేల మందికి పైగా జవాన్లను క్వారంటైన్ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)