కరోనా లాక్‌డౌన్: ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికులపై రసాయనాలు చల్లిన వీడియోలో ఏముంది?

దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిన కొంత మంది వలస కార్మికులపై బరేలి మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది శానిటైజేషన్ పేరుతో రసాయనాలను స్ప్రే చేసిన ఘటన పై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

వీరంతా ఉత్తరప్రదేశ్ లోని బరేలి నగరానికి చెందిన వలస కార్మికులు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో అనేక మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు.

లాక్ డౌన్ ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గుంపులుగా వెళ్లిన ప్రజల ద్వారా ఇది మరింత ప్రబలుతుందేమోనని భయం కూడా ఉంది.

ఈ వీడియోని టైమ్స్ అఫ్ ఇండియా పత్రికకి చెందిన ఒక జర్నలిస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన తర్వాత లక్షలాది మంది చూశారు. ఈ వీడియోలో కార్మికులు రోడ్డు మీద కూర్చుని ఉండగా , రక్షణ సూట్లు ధరించిన వైద్య, అగ్ని మాపక శాఖకి చెందిన సిబ్బంది వీరి పైన రసాయనాలు స్ప్రే చేసినట్లు కన్పిస్తోంది.

బీబీసీ పరిశీలించిన ఈ వీడియోలో, అక్కడ కూర్చున్న వారందరిని కళ్ళు, నోరు మూసుకోమని సిబ్బంది మైక్ లో చెబుతున్నారు. అంతే కాకుండా, అందులో ఉన్న పిల్లల కళ్ళు, నోరు కూడా మూయమని సిబ్బంది ఆదేశాలు ఇస్తూ కన్పించారు.

ఈ ఘటనపై విచారణకి ఆదేశించినట్లు బరేలి జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. రసాయనాల బారిన పడిన వారందరికీ ముఖ్యమంత్రి ఆఫీస్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

బరేలి మున్సిపల్, అగ్నిమాపక సిబ్బందికి బస్సులను శానిటైజ్ చేయమని ఆదేశాలు ఇస్తే అత్యుత్సాహంతో వారు మనుషుల పై కూడా స్ప్రే చల్లారని మేజిస్ట్రేట్ ట్వీట్ లో అన్నారు.

ఈ ఘటన తర్వాత అధికారులను విమర్శిస్తూ అనేక మంది ట్వీట్ చేశారు

ఇదే విధంగా ఎయిర్‌పోర్ట్‌ల్లో, బస్సు స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కూడా అమలు చేస్తున్నారా అని చాలా మంది ప్రశ్నించారు.

దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి వలస కార్మికులకి సంబంధించి వస్తున్న వీడియోలలో ఇది మొదటిది కాదు.

వలస కార్మికులు రోజు కూలిపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఒకే సారి పనులు ఆగిపోవడంతో వారి స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. కొన్ని ప్రాంతాలలో వాళ్ళ స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం బస్సులను పంపించగా, కొంత మంది నడక దారి పట్టారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)