జగన్ : ‘కరోనావైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడమేంటి’

కరోనావైరస్ భయానకమైనదేమీ కాదని.. వయోధికులు, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కరోనావైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది కానీ మిగతా ప్రజలకు అంత ప్రమాదమేమీ లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు.

కరోనావైరస్‌ను సాకుగా చూపించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారని, ఒకవైపు ఎన్నికలు వాయిదా వేసి మరోవైపు అధికారులను బదిలీ చేశారని జగన్ అన్నారు. ఇదేం విచక్షణాధికారమని ఆయన ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను చంద్రబాబు నియమించారు. ఆయన చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగించాయి.

కరోనావైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నామని రమేశ్ కుమార్ చెప్పారు. ఆ సాకు చూపుతూనే, గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, మాచర్ల సీఐ సహా కొందరు అధికారులను తప్పిస్తూ ప్రకటన చేశారు.

చాలా ఆశ్యర్యం కలుగుతోంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు, ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసి ఈ చర్యలన్నీ ఎలా తీసుకుంటారు? ఎన్నికలైనా జరపండి. ఈ సమయంలో ఏవైనా చర్యలు తీసుకోండి. మేమేమీ మాట్లాడం. విచక్షణ అధికారాలు అంటూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు ఉండి ఎందుకు?’’ అని జగన్ ప్రశ్నించారు.

‘ఎవరో ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషనర్ చదువుతున్నారు’

‘‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్లకు రమేశ్‌కుమార్ నిన్న (శనివారం) ఆదేశాలు ఇచ్చారు.

ఎంపీటీసీ స్థానాల్లో 2 వేల మంది వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారన్న వార్త జీర్ణించుకోలేక, చంద్రబాబు నాయుడు పతనమవుతున్నారని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని భావించి ఈ రోజు పొద్దున్నే తాజా ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఎన్నికల కమిష‌న్‌లో ఎవరికీ ఈ ఆదేశాల గురించి తెలియదు. ఎవరో ఇచ్చిన ఆదేశాలను రమేశ్ కుమార్ చదువుతున్నార’’ని ముఖ్యమంత్రి ఆరోపించారు.

రమేశ్ కుమార్‌కు పదవి ఇచ్చింది చంద్రబాబే కావొచ్చు. వాళ్లిద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయ్యుండొచ్చు. కానీ, ఇలా వ్యవహరించడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.

‘అవన్నీ చెదురుమదురు ఘటనలు’

‘రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిపి 10,243 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 54,594 మంది నామినేషన్లు వేశారు. 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి.

2,794 వార్డులు, డివిజన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 15,185 నామినేషన్లు వేశారు. ఇందులో 14 చోట్ల మాత్రమే చెదురమదురు ఘటనలు జరిగాయి.

ఇదివరకు ఏ ఎన్నికల్లోనైనా ఇంత కన్నా తక్కువ చెదురుమదురు ఘటనలు జరిగాయా?

పోలీసులు ఎక్కడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారు. మీడియా విష ప్రచారం చేస్తోంద’’ని ముఖ్యమంత్రి విమర్శించారు.

‘కరోనావైరస్ ప్రభావం ఇంకా పెరిగితే ఏం చేస్తారు’

‘‘ఏకగ్రీవాలు కొత్తేం కాదు. ఇదివరకు ఎన్నికల్లో జరగలేదా? ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంటే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు. వ్యవస్థల్లో తనకున్న తొత్తుల ద్వారా ఎందుకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు?

ఈ ఎన్నికలు జరిగితే, కేంద్రం నుంచి రూ.5వేల కోట్లు రాష్ట్రానికి వస్తాయి. జరగకపోతే రావు. దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?

ఎన్నికలు వాయిదా వేస్తే, పరిస్థితి మెరుగవుతుందా? అప్పుడు కరోనావైరస్ ప్రభావం ఇంకా తీవ్రం అవుతుంది. ఎన్నికలు వాయిదా వేసి, ఏం సాధిస్తారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకుంటున్నార’’ని ఆగ్రహించారు.

చూస్తూ ఊరుకోం..

రమేశ్‌కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు, ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడమని గవర్నరును కోరినట్లు జగన్ చెప్పారు.

‘‘రమేశ్ కుమార్‌ మారకపోతే, ఈ విషయాన్ని పైస్థాయికి తీసుకెళ్లి ఆయన బండారాన్ని బయటపెడతా’’మన్నారు.

‘కరోనావైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’

‘‘కరోనావైరస్ నివారణకు వాడాల్సిన ఔషధం కూడా పారాసిటమాల్. టైఫాయిడ్, న్యుమోనియా వచ్చిన ఇలాంటి చర్యలే తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో 81 శాతం ఇంట్లోనూ ఉంటూ రికవర్ అయ్యారు. 13.8 శాతం కేసుల్లో మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు. 4.7 శాతం మాత్రమే ఐసీయూలో పెట్టిన కేసులున్నాయ’’ని చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్‌లోనూ అన్ని చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

రాష్ట్రంలో 70 కేసుల్లో శాంపిల్స్ తీసుకున్నామని, వారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని.. ఒకే కేసులో పాజిటివ్ వచ్చిందని, ఆ వ్యక్తి కూడా చనిపోలేదని, చికిత్స పొందుతున్నారని జగన్ తెలిపారు.

రాష్ట్రంలో ఒక్కరు కూడా కరోనావైరస్ వల్ల చనిపోకూడదన్న లక్ష్యంతో అన్ని చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

నెల్లూరులో ఒక పాజిటివ్ కేసు వెలుగు చూడగానే ఆ వ్యక్తి ఉన్న చోటి నుంచి కిలోమీటరు పరిధిలోని 20 వేల ఇళ్లలో ప్రతి ఇంటికీ 40 బృందాలు వెళ్లాయి. వాళ్లందరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాం. అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

ఐసోలేషన్ గదులు సిద్ధమవుతున్నాయి

‘‘ఐసోలేషన్‌లో ఉంచినవారిని, విదేశాల నుంచి వచ్చిన వారి పరిస్థితిని గ్రామ వాలంటీర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి మాత్రమే మనకు విదేశాల నుంచి ప్రయాణికులు వస్తారు. విశాఖపట్నంలో ఐసోలేషన్ కోసం 300 పడకలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలో 50 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఐసోలేషన్ గదులను సిద్ధం చేస్తున్నా’మన్నారు.

జాతీయ ప్రతినిధులతో చర్చించాకే నిర్ణయించాం.. దురుద్దేశాలు ఆపాదించొద్దు- ఎస్ఈసీ రమేశ్ కుమార్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) ప్రకటన చేసిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో జాతీయ స్థాయి ప్రతినిధులతో చర్చించిన తరువాతే ఎన్నికల వాయిదాకు నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్రం ఉపసంహరిస్తే ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థని.. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల అధికారి ఉంటాయని గుర్తు చేసిన ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం విచారకరమన్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం: చంద్రబాబు

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను ఏపీ సీఎం జగన్ విస్మరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

కరోనావైరస్ చాలా ప్రమాదకరమని, ఒకరి నుంచి ఒకరికి అదుపు చేయలేని రీతిలో వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే, రాష్ట్ర సీఎం మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

‘‘ఇటలీలో ఫార్మసీలు తప్ప అన్నీ మూసేశారు. లండన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేశారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ స్పష్టంగా దీన్ని మహమ్మారి అని ప్రకటించారు. ఆస్ట్రేలియా జన సాంద్రత చదరపు కి.మీ.కు 3.3. భారత్‌లో జన సాంద్రత చదరపు కి.మీ.కు 420. ఒకవేళ మన దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందితే ఏమవుతుంది? ఆసుపత్రులు చాలుతాయా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

అమెరికాలో 2,175 కరోనావైరస్ పాజిటివ్ కేసులు రాగా, ఆ దేశ అధ్యక్షుడు కట్టడి చర్యల కోసం రూ.3.5 లక్షల కోట్లు కేటాయించారని చంద్రబాబు అన్నారు.

భారత ప్రభుత్వం సైతం దీన్ని నోటిఫైడ్ డిజాస్టర్‌గా ప్రకటించిందని, కరోనావైరస్ కట్టడి కోసం కలిసి పనిచేద్దామని సార్క్ దేశాలను ప్రధాని మోదీ అభ్యర్థించారని చెప్పారు.

‘‘భారత్‌లో 12 రాష్ట్రాల్లో వ్యాపించింది. 107 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ముఖ్యమంత్రికి బుద్ధి అనేది ఉంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘‘65 ఏళ్లు దాటినవారికి ప్రమాదమని సీఎం అంటున్నారు. వైరస్ సోకితే చనిపోరని, పారాసిటమాల్ వేస్తే తగ్గుతుందని చేతకానితనం ప్రదర్శిస్తున్నారు. మన దగ్గర ఈ వైరస్ వ్యాపించడం మొదలైతే, అందరికీ చికిత్స చేయడానికి ఆసుపత్రులు చాలవు. ఔషధాలు చాలవు. క్వారంటీన్ వసతులు లేవు. ఇంతవరకూ సీఎం ఒక్క రోజు కూడా పరిస్థితిపై సమీక్ష చేయలేదు. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయడం లేదు. వారికి కరోనావైరస్ ఎలా వ్యాపిస్తుందన్నదానిపై, ముందుజాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం లేదు’’ అని అన్నారు.

ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే తప్ప కరోనావైరస్‌ను నియంత్రించలేమని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేస్తోందని ఆరోపించారు.

‘‘అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు. బెదిరింపులకు పాల్పడి, ఎంపీటీసీ ఎన్నికల్లో 22 శాతం స్థానాలను ఏకగ్రీవంగా మార్చారు. రక్షించాల్సిన పోలీసులు భక్షిస్తున్నారు’’ అని అన్నారు.

ఎన్నికల కమిషన్ అలసత్వం వహిస్తోందని, హైకోర్టు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించిందని చంద్రబాబు చెప్పారు.

ఎన్నికల కమిషన్‌కు, అధికారులకు కులం ఆపాదిస్తూ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)