You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బడి పిల్లలకు కూరకు బదులు ఉప్పు: వార్త రాసిన జర్నలిస్టుపై యూపీ పోలీసుల కేసు
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు కూరకు బదులుగా ఉప్పుతో రొట్టెలు తినిపించిన ఘటన ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ వార్త రాసిన స్థానిక జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ కుట్రపన్నారని అధికారులు ఆరోపించారు.
మీర్జాపూర్ ఎస్పీ అవదేశ్ కుమార్ పాండే మాట్లాడుతూ, ''ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేశాం. అందులో జర్నలిస్టు పవన్ జైస్వాల్ ఒకరు'' అని తెలిపారు.
పోలీసులు ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.
హిందీ దినపత్రికలో పనిచేస్తున్న స్థానిక జర్నలిస్టు పవన్ జైస్వాల్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ, ''నా పని నేను చేస్తుంటే కొందరికి లక్ష్యంగా మారాను. నా మీద ఎఫ్ఐఆర్ నమోదైందని తెలియగానే భయమేసింది'' అని చెప్పారు.
నేరపూరిత కుట్ర, మోసం కింద పవన్ జైస్వాల్‌పై కేసు నమోదైంది.
వీడియోలో ఏముంది?
మీర్జాపూర్ జిల్లాలోని షియుర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు కూరకు బదులుగా ఉప్పు నంజుకుంటూ చపాతీలు తింటున్న ఘటనను పవన్ వీడియో తీశారు.
పవన్ తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తర్వాత సంబంధిత అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి.
''పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవకతవకలపై స్థానికులు నాకు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. మీడియా ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని కోరారు'' అని పవన్ బీబీసీకి చెప్పారు.
''ఆగస్టు 22న ఓ గ్రామస్తుడు నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. నేను బడికి వెళ్లడానికంటే ముందు విద్యాధికారికి ఫోన్ చేశాను. మధ్యాహ్నం 12 గంటలకు నేను అక్కడికి చేరుకునేటప్పటికి బడిపిల్లలు ఉప్పుతో చపాతీలు తింటున్నారు. దాన్నే నేను వీడియో తీశాను'' అని పవన్ నాటి ఘటనను చెప్పుకొచ్చారు.
''నేను దినపత్రికలో పనిచేస్తున్నాను. ఈ ఘటనపై కలెక్టర్‌ను వివరణ అడుగుతారనే ఉద్దేశంతో వీడియోను మా జిల్లా స్థాయి జర్నలిస్టుకు పంపాను. వీడియో బయటకు రాగానే కలెక్టర్ దర్యాప్తు జరిపి ఇద్దరిని సస్పెండ్ చేశారు. స్థానిక అధికారులు కూడా ఈ ఘటనపై ఐదు సార్లు దర్యాప్తు చేసి నేను తీసిన వీడియోలో ఉన్నది నిజమేనని చెప్పారు. అయితే, జిల్లా అభివృద్ధి అధికారి ప్రియాంక నిరంజన్ ఆరోసారి దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని నాకు సూచించారు. అయితే, ఒక జర్నలిస్టుగా వార్తలు రాయడం నా పని కానీ, ఫిర్యాదు చేయడం కాదు అని చెప్పాను'' అని ఆయన వివరించారు.
సమాచారమిచ్చిన వర్గాలను అరెస్టు చేశారా?
తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పవన్ తెలిపారు.
''ఈ ఘటన వెలుగు చూశాక ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి స్థానిక అధికారులు వారిని రక్షించుకునేందుకు నన్ను ఇరికిస్తున్నారు'' అని పవన్ ఆరోపించారు.
పవన్‌పై ఐపీసీలోని సెక్షన్ 120బీ( నేరపూరిత కుట్ర), 420 (మోసం), 193 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు అరెస్టు చేస్తారని పవన్ భయపడుతున్నారు.
ఈ ఘటనపై దర్యాపు చేసిన అధికారి ధర్మేశ్ పాండే బీబీసీతో మాట్లాడుతూ ''మేం ఆ బడిని సందర్శించాం. వంటవాళ్లను ప్రశ్నిస్తే కూరగాయలు రావడానికి ఆలస్యమవడంతో పిల్లలకు చపాతీలో నంజుకోడానికి ఉప్పు ఇచ్చామని వారు చెప్పారు'' అని ఆయన వివరించారు.
ఇదే ఘటనపై కలెక్టర్ అనురాగ్ తివారీ వివరణ కోసం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన నుంచి సమాధానం రాలేదు.
ఆయన కూడా ఈ ఘటనపై స్వయంగా దర్యాప్తు చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ''అవకతవకలు జరిగాయి. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద పాలుపండ్లు కూడా ఇస్తున్నాం. వీడియో తీసిన ఘటన రోజు పిల్లలకు పప్పు, చపాతీ పెట్టాల్సిందిపోయి ఉప్పుతో చపాతీ ఇచ్చారు. ఇది పెద్ద గందరగోళానికి దారితీసింది. దీనికి సంబంధించి ఇద్దరిని సస్పెండ్ చేశాం'' అని చెప్పారు.
పవన్ జైస్వాల్‌తో పాటు, రాజ్‌కుమార్ పాల్ అనే మరోవ్యక్తిపైనా అధికారులు కేసు పెట్టారు.
బడిలో వంటవాళ్ల దగ్గర కూరగాయలు లేవని తెలిసినప్పటికీ గ్రామ సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను తీయించారని అధికారులు పేర్కొన్నారు.
''మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంది. బడిలో కూరగాయలు లేవని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాలి. వంటవాళ్లకు కూరగాయలు సరఫరా చేయాలి'' అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
పవన్ జైస్వాల్ తీసిన వీడియో వైరల్ అయిన తరువాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పందించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- సైబీరియన్ కొంగలు... చింతపల్లి వారి చుట్టాలు
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన మహిళలు
- శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్ బోట్లు: మున్ముందు కనుమరుగైపోతాయా?
- కళ తప్పుతున్న గుజరాత్ నల్సరోవర్ సరస్సు
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
- పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)