You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్ బోట్లు: మున్ముందు కనుమరుగైపోతాయా?
కశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దాల్ సరస్సుకు ఆభరణాల వంటివి అక్కడి హౌస్ బోట్లు. కశ్మీర్ సందర్శించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ హౌస్ బోట్ల మీద ప్రయాణించాలని కోరుకుంటారు. అయితే ఇపుడు వాటి భవితవ్యం ప్రమాదంలో పడింది.
స్థానిక అధికారులు కొత్తగా హౌస్ బోట్ల నిర్మాణాన్ని, పాత వాటి మరమ్మతులను కూడా నిషేధించారు. శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ కథనం.
కొన్నేళ్ల కిందట ఈ సరస్సులో 3,500 పైగా పడవ ఇళ్లు ఉండేవి. కానీ ప్రస్తుతం వేయి కన్నా తక్కువైపోయాయి. పర్యావరణానికి చేటు చేస్తున్నాయంటూ ప్రభుత్వం వీటి నిర్మాణాన్ని, మరమ్మతులను నిషేధించింది. ప్రస్తుతం ఈ హౌస్ బోట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది.
‘‘మా బోటును మా నాన్న 50 ఏళ్ల క్రితం తయారు చేశారు. ఇప్పుడు ఈ పడవ శిథిలావస్థకు చేరి మునిగిపోయే ప్రమాదంలో ఉంది. కానీ దీనికి మేము మరమ్మతులు చేయలేం’’ అని ముహమ్మద్ ఆమీన్ అనే ఓ హౌస్ బోట్ యజమాని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఈ పడవ ఇళ్లపై ఆధారపడ్డ వారి జీవితాలు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
‘‘ఇది మా ఆదాయ వనరు మాత్రమే కాదు.. మా వారసత్వ సంపద కూడా. మా నాన్న ఈ బోటును నడిపే వారు. ఇపుడు నేను నా సోదరులు ఈ పడవను నడుపుతున్నాం. మేం చదువుకున్నాం. మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ హౌస్ బోట్లను సమస్యగా భావిస్తే మాకు మరో ఉపాధిని చూపించి వీటిని నిషేధించవచ్చు’’ అని ఇంకో హౌస్ బోట్ యజమాని హబీబుల్లాహ్ ఖాన్ పేర్కొన్నారు.
‘‘హౌస్ బోట్లు అంతరించిపోతాయని భయమేస్తోంది‘’
‘‘కశ్మీర్ లోని దాల్ సరస్సు, నిగీన్ సరస్సు, జీలం నది, చార్ చినార్‌లలో దాదాపు 3,500 బోట్లు ఉండేవి. కానీ గత ఏడేళ్ల కాలంలో వాటి సంఖ్య 950 కి పడిపోయింది. రాబోయే పదేళ్లలో ఈ సంఖ్య మరింత తగ్గిపోతుందేమోనన్న భయం వేస్తోంది’’ అన్నారు హౌస్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ వాంగ్నూ.
అనేక కారణాల వల్ల ఏర్పుడుతున్న కాలుష్యాన్ని తగ్గించడమే నిషేధం ప్రధాన లక్ష్యంమని అధికారులు అంటున్నారు.
‘‘మేం హౌస్ బోట్లను లేకుండా చెయ్యాలనుకోవడం లేదు. సరస్సుల పర్యావరణ వ్యవస్థలో ఇవి కూడా కీలకం అన్న విషయం మాకు తెలుసు. ఇక్కడి సరస్సుల సంస్కృతికి ఈ పడవ ఇళ్లు అద్దం పడతాయి. అయితే సరస్సులను కాలుష్యం బారి నుంచి కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతో ఒక సురక్షితమైన విధానాన్ని అమలు చేయాలని మాత్రమే మేం భావిస్తున్నాం’’ అని శ్రీనగర్ డిప్యూటీ కమీషనర్ సయెద్ అబిద్ రషీద్ చెప్పారు.
‘‘మేం ఎవరిని నిరుత్సాహపరచం , ఈ హౌస్ బోట్లను కొనసాగించేందుకు మేము చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఏదేమైనా హౌస్ బోటు యజమానులు మాత్రం తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ సంస్కృతిలో భాగమైపోయి ఆ రాష్ట్ర పర్యాటకంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ పడవ ఇళ్లు ఇకపై కనిపించవేమో అన్న భయం ఇటు పర్యాటకుల్లో కూడా ఉంది.
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?
- షుజాత్ బుఖారీ హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతుందా?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)