You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కొత్తతరం దూసుకొచ్చింది. రాజకీయ వారసులుగా కొందరు ముందుకొస్తే, మరికొందరు తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. వీరిలో చాలామంది ప్రాతినిధ్యం దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చిన్న వయసులోనే సీఎం కాబోతున్న మూడో నేతగా వైఎస్ జగన్ గుర్తింపు సాధించారు. ఆయనకు తోడుగా అనేక మంది యువనేతలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వారిలో కొందరు గడిచిన సభలో కూడా ప్రాతినిధ్యం వహించగా ఈసారి మరికొందరు తోడయ్యారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి విడదల రజినీ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అందరికంటే ఈమే అత్యంత చిన్నవయస్కురాలు. 30 సంవత్సరాల రజినీ, తన సమీప ప్రత్యర్థి, ప్రత్తిపాటి పుల్లారావును 8,301 ఓట్ల తేడాతో ఓడించారు.
చిలకలూరిపేటకు అతి చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగానే కాకుండా ఆ నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదులుకుని వెనక్కువచ్చిన రజినీ, మొదట్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి, ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచిన వారిలో పలాస నుంచి పోటీచేసిన సీదిరి అప్పలరాజు చిన్నవాడు. ఆయన వయసు 39. అప్పలరాజు తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
విజయనగరం జిల్లా కురుపాం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు పాముల పుష్పశ్రీవాణి వయసు 27. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించిన శ్రీవాణి వయసు 32 సంవత్సరాలు.
విశాఖ జిల్లా నుంచి గెలిచిన వారిలో గుడివాడ అమర్ నాథ్ వయసు 35. ఆయన తొసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి అనకాపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పెందుర్తి నుంచి గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ వయసు 35 సంవత్సరాలు. ఈయన, సీనియర్ నేత బండారు సత్యన్నారాయణమూర్తిని ఓడించారు. బరిలో దిగిన తొలిసారే విజయకేతనం ఎగరవేశారు అన్నంరెడ్డి.
తూర్పుగోదావరి జిల్లా నుంచి గెలిచిన వారిలో జక్కంపూడి రాజా ఒకరు. ఆయన వయసు 31 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసత్వంతో తొలిసారిగా బరిలో దిగి విజయం సాధించారు. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రంపచోడవరం నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి వయసు 34 సంవత్సరాలు. రాజకీయ ఆరంగేట్రం చేసిన ఏడాదిన్నరకే ఈమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఏడాది వరకూ ఈమె ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్ స్థానంలో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. ఈమె వయసు 34. తండ్రి ఎర్రంనాయుడు రాజకీయ వారసత్వంతో పాటు మెట్టింటి రాజకీయ అనుభవం కూడా ఆమెకు కలిసివచ్చింది. ఈమె మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గెలిచిన వారిలో దెందులూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని ఓడించిన కొఠారి అబ్బాయ చౌదరి వయసు 37 సంవత్సరాలు.
ఆయనకు 17,458 ఓట్ల ఆధిక్యం దక్కింది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసి, రాజకీయాల్లో అడుగుపెట్టిన అబ్బాయ చౌదరి, పోటీ చేసిన తొలిసారే విజయం సాధించారు.
నెల్లూరు నుంచి గెలిచిన వారిలో పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వయసు 39 సంవత్సరాలు. ఆయన వరుసగా రెండోసారి వైసీపీ తరుపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రి పి.నారాయణను 1988 ఓట్ల తేడాతో ఓడించారు అనిల్.
కర్నూలు నుంచి గెలిచిన వారిలో ఆళ్లగడ్డ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి వయసు 32. ఆయనది రాజకీయ కుటుంబం. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి బరిలో దిగిన తొలిసారే మంత్రి భూమా అఖిలప్రియను ఓడించారు. 35,613 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.
అదే జిల్లా నంద్యాల నుంచి మరో యువ ఎమ్మెల్యే విజయం సాధించారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని 34,560 ఓట్ల తేడాతో ఆయన ఓడించారు.
కడప జిల్లా జమ్మలమడుగులో కూడా మరో యువనేత గెలిచారు. 38 సంవత్సరాల డాక్టర్ ఎం.సుధీర్ రెడ్డి, బరిలో దిగిన తొలిసారే విజయకేతనం ఎగురవేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి రామసుబ్బారెడ్డిని 51,641 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించారు.
గెలిచిన యువ ఎమ్మెల్యేలలో అత్యధికులు విద్యావంతులు. ఉన్నత విద్యాభ్యాసం చేసి, విదేశాలలో ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చిన వారు. ఇలాంటి కొత్తతరం రాజకీయ ప్రవేశం ప్రయోజనకరమని రాజకీయ పరిశీలకులు ఎస్.వెంకట్రావు వ్యాఖ్యానించారు. బీబీసీతో తన అభిప్రాయం పంచుకుంటూ...
''కొత్తతరం రాకతో రాజకీయాల్లో మేలు కలుగుతుంది. కానీ ప్రస్తుతం అనేకమంది రాజకీయ వారసులకే అవకాశం దక్కుతోంది. కుటుంబ రాజకీయాల నేపథ్యం నుంచి వస్తున్న వారు కూడా వాటికే పరిమితం కాకుండా, విశాల దృక్పథంతో కొత్త తరహాగా ఆలోచిస్తే మేలు కలుగుతుంది. పాతతరం నేతలకు భిన్నంగా అటు శాసనసభలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ యువతరం ఎమ్మెల్యేలు వ్యవహరించాలని ఆశిద్దాం'' అని వెంకట్రావు అన్నారు.
ఇవి కూడా చదవండి
- వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్‌ను ఓడించింది ఎవరు?
- 'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- కాకినాడలో బయటపడిన బ్రిటిష్ కాలంనాటి తుపాకులు...
- వైఎస్ జగన్ ప్రెస్ మీట్: నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమూ కోల్పోయిన పవన్ కల్యాణ్
- ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)