You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాదయాత్ర చేస్తే అధికారం దక్కినట్లేనా
పాదయాత్రలు చేస్తే అధికారం వస్తుందన్న ఆనవాయితీ తెలుగునాట మరోసారి కొనసాగింది.
'ప్రజాసంకల్ప యాత్ర' పేరుతో ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోన్ రెడ్డి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు.
రాజశేఖరరెడ్డి విజయంతో..
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర చేసిన నాయకునికే సీఎం కుర్చీ దక్కడం ఇది మూడోసారి.
2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2003లో అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పేరిట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 1467 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి మొదటిసారిగా అధికారం దక్కించుకున్నారు.
అప్పటికే వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలవారు, ఉద్యమకారులు వేర్వేరు కారణాలతో పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర వాటన్నికంటే భిన్నమైనది.
పాదయాత్రతో వైఎస్ సీఎం కావడంతో అప్పటి నుంచి పాదయాత్రల ఫలాలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది.
చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం'
వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన తెలుగు దేశం పార్టీని కూడా 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేసింది పాదయాత్రే.
2004 తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి దూరమైన చంద్రబాబు 2009లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆయన నేతృత్వంలోని టీడీపీ కేవలం 47 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఆ తర్వాత ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం టీడీపీని మరింత చిక్కుల్లో పడేసింది.
ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. 2012 అక్టోబర్ 2న 'వస్తున్నా.. మీకోసం' అంటూ చంద్రబాబు నాయుడు 2340 కిలోమీటర్లు నడిచారు.
60 ఏళ్లు దాటినా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వెరవక పాదయాత్ర పూర్తిచేశారు. ఆ తర్వాత విభజిత ఆంధ్ర ప్రదేశ్‌లో 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
(ఆధారం: కథనంలో పాదయాత్రలకు సంబంధించిన గణాంకాలకు ఆధారం ఆయా రాజకీయ పార్టీల వెబ్‌సైట్లు)
ఇవి కూడా చదవండి.
- ‘జగన్కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్కు మాత్రమే ఉండేది’
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా?
- 57 ఏళ్ల తరువాత తెలుగు నేలపై యంగ్ సీఎం
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- 40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
- అభిప్రాయం: సమ న్యాయం జరిగేలా స్థానికతను నిర్వచించాలి
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)