ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: బీటలువారిన రాజ వంశీయుల కంచుకోటలు

    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

రాజ కుటుంబీకులకు రాజకీయంగా కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిస్థితులు తారుమారయ్యాయి. సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రభావం చూపుతున్న రాజ కుటుంబీకులంతా 2019 ఎన్నికల్లో పట్టు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన ప్రముఖ నేతలు కూడా ఓటమి పాలయ్యారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానంగా నాలుగు రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అవి విజయనగరం గజపతి రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు, మేరంగి రాజుల కుటుంబాలు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇందిరా గాంధీ హయాంలో రాజ్య భరణాలను రద్దు చేసిన తరువాత ఈ రాజుల వారసులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగారు. కానీ, తాజా ఎన్నికల్లో ఈ ప్రాంత రాజవంశీయులంతా ఓటమి పాలయ్యారు.

అశోక్ గజపతిరాజు

విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అశోక్ గజపతి రాజు 1978 నుంచి 1999 వరకూ వరుసగా విజయనగరం నుంచి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు.

2004లో కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2009లో ఎమ్మేల్యేగా, 2014లో విజయనగరం ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ, 2019 ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓటమి చెందారు.

అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు 2019 ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ పడ్డారు. ఆమె కూడా కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో పరాజయం పొందారు.

కిశోర్ చంద్రదేవ్

కురుపాం రాజవంశానికి చెందిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి పార్టీ మారినా కూడా ఆయనకు పరాజయం తప్పలేదు. అరకు పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయనపై గొడ్డేటి మాధవి విజయం సాధించారు.

అరకు పార్లమెంటరీ నియోజకవర్గ తొలి ఎంపీగాను, అంతకు ముందు పార్వతీపురం ఎంపీగా కిశోర్ చంద్రదేవ్ పనిచేశారు. 1977లో మొదటి సారి ఎంపీగా గెలిచిన నాటి నుంచి 5 సార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒకసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి కిశోర్ చంద్రదేవ్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరో విశేషం ఏమిటంటే కిశోర్ చంద్రదేవ్‌కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె శృతి చంద్రదేవ్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. తండ్రి కుమార్తె ఇద్దరూ పరాజయం పాలయ్యారు.

సుజయ కృష్ణరంగారావు

ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రిగా బొబ్బిలి సంస్థానానికి చెందిన రంగారావు పనిచేశారు కూడా. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు సుజయ కృష్ణరంగారావు కొనసాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకూ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు సుజయకృష్ణ రంగారావు. అయితే, 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో పరాజయం పొందారు.

శత్రుచర్ల విజయరామరాజు కుటుంబం

చినమేరంగి సంస్థానానికి చెందిన శత్రుచర్ల విజయరామరాజు కూడా రాజకీయంగా చక్రం తిప్పిన వారే. 2004 నుంచి 2009 వరకూ మంత్రిగా పనిచేశారు.

పార్వతీపురం ఎంపీ స్థానంగా ఉన్న సమయంలో 10, 12వ లోక్‌‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వడం.. వయో భారంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన బంధువు అయిన నరసింహ ప్రియ థాట్రాజ్ కురుపాం శాసనసభకు పోటీ చేశారు. పాముల పుష్పశ్రీ వాణి చేతుల్లో పరాజయం పాలయ్యారు.

ఇప్పటికీ రాజవంశీయులు ఫ్యూడల్ మనస్తత్వం నుంచి బయటకు రాకపోవడమే వారి ఓటమికి కారణం అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ప్రతినిధి శివశంకర్.

"సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కూడా ప్రజలు రాజుల నుంచి దూరం జరగడానికి కారణం. కిశోర్ చంద్రదేవ్ కానీ, అశోక్ గజపతిరాజు కానీ, బొబ్బిలి సుజయ కృష్ణరంగారావును కానీ సాధారణ ప్రజలు కలిసే పరిస్థితి ఇప్పటికీ లేదు. దీంతో, తమకు అందుబాటులో ఉండి తమ సమస్యలను పరిష్కరించే నేతలనే ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రజలలో చైతన్యం పెరిగింది. దీంతో తమకు అందుబాటులో ఉండే నేతలనే ఎన్నుకుంటున్నారు" అని శివశంకర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)