జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్నికల ఫలితాల రోజున వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయం కార్యకర్తలతో కళకళలాడింది. పండుగ వాతావరణం ఉందక్కడ. అదే సమయానికి తెలుగుదేశం కార్యాలయం బోసిపోయింది. చంద్రబాబు విలేకర్ల సమావేశానికి కూడా పెద్దగా హడావుడి లేదు. బాబు ఇంటి బయట కానీ, చుట్టు పక్కల కానీ కార్యకర్తలెవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మరి ఆ లెక్కన జనసేన పరిస్థితి ఎలా ఉండాలి?

కానీ జనసేన కార్యాలయం దగ్గర పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విలేకర్ల సమావేశం నిర్వహించారు. కానీ ఇక్కడ పరిస్థితి తెలుగుదేశం కంటే భిన్నం.

పార్టీ ఘోర పరాజయం తర్వాత కూడా విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయం ముందు వందలాది మంది అభిమానులు గుమిగూడి ఉన్నారు. గంభీరంగా ఉన్నారు. విలేకర్ల సమావేశం కోసం తెరచిన హాల్ అభిమానులతో నిండిపోయింది.

హాలు తలుపులు మూసేయడంతో మెట్లపైనా, రోడ్డుపైనా జనం నిలబడి ఉన్నారు. ఈలోపు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ప్రెస్ మీట్ స్థలం మార్చారు. పైన మరో హాల్లో ఏర్పాటు చేశారు. ఈ హాలు నుంచి ఆ హాలుకు మీడియాను పంపే ఏర్పాట్లు కూడా సక్రమంగా లేవు. ఆ సమావేశంలో పవన్ రెండున్నర నిమిషాలు మాట్లాడేసి వెళ్లిపోయారు.

అక్కడ సమావేశం నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో ఎంతో కన్ఫ్యూజన్, ఆలస్యం ఉన్నాయి. ఆ సమావేశం ముగిసి పవన్ కళ్యాణ్ బయటకు రాగానే, అప్పటి వరకూ మౌనంగా ఉన్న వారంతా గోలగోల చేశారు.

పవన్‌ను చూసి కేకలు వేస్తూ కారు వెంట పరుగులు తీశారు. ఈ ఒక్క దృశ్యం జనసేన పరిస్థితిని చెబుతోంది. పవన్ కల్యాణ్ ఓడినా అభిమానుల్లో తగ్గని క్రేజ్ ఒక పక్కన, అంత క్రేజునీ సరిగా ఉపయోగించుకోలేని దీనమైన పార్టీ వ్యవస్థ మరోవైపు.

జనసేన ప్రభావం ఎలా ఉంటుదన్న ప్రశ్నకు సమాధానం ఆరు నెలలుగా మారిపోతూ వచ్చింది. కానీ ఈ ఫలితాలను మాత్రం ఎవరూ ఊహించలేదు. ఒక చోట నుంచైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని భావించారు అభిమానులు. కానీ ఫలితాలు అంతకంటే ఘోరంగా వచ్చాయి. కారణాలు ఎన్నో ఉన్నాయి.

వ్యవస్థ

ప్రతి పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది. అధినేత ఆదేశాలు అమలు చేసే ఆ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉన్నట్టు. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యవస్థను ఏమాత్రం శ్రద్ధగా నిర్మించలేకపోయారు.

అందుకు ఆయనకు తగిన సమయం లేదు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 2014 ఎన్నికల తర్వాత నుంచి లెక్కేసుకున్నా ఐదేళ్ల సమయం ఏ పార్టీ నిర్మాణానికైనా సరిపోతుంది. రాష్ట్ర, జిల్లా కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నుంచి వార్డు మెంబర్ల వరకూ కమిటీలు.. ఇలా ఏదీ పక్కాగా చేయలేకపోయారు.

అభిమానులు

పవన్ కళ్యాణ్‌కున్న అభిమానులను అవసరమైనట్టు మలచుకుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలం అయింది జనసేన. అభిమానులు కార్యకర్తలుగా మారడం అంత తేలిక కాదు.

మామూలుగా ఏ పార్టీకీ ఉండని ఈ అదనపు బలాన్ని జనసేన.. వాడుకోలేకపోయింది. ఆ మేరకు వారికి సమగ్ర శిక్షణ ఇవ్వలేకపోయింది. ఎక్కడికక్కడ స్థానికంగా తమకు తోచిన రీతిలో అభిమానులు పార్టీ కోసం కష్టపడ్డారు. అంతకుమించి పక్కా ప్రయత్నం జరగలేదు.

నాయకులు

నియోజకవర్గ స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో జనానికి తెలిసిన ముఖం, కార్యకర్తలు లేదా అభిమానులకు అందుబాటులో ఉండగలిగే నాయకత్వం ఒకటి ప్రతీ పార్టీకి ఉండాలి. వారు ప్రధాన నాయకత్వానికి వారధిలా పనిచేస్తారు.

ఎక్కువ మంది కొత్త వాళ్లే కావడంతో జనసేనకు అటువంటి నాయకత్వం చాలా చోట్ల లేదు. రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్ తప్ప ఇక ప్రముఖులెవరూ ఆ పార్టీలో లేరు.

స్పష్టమైన వైఖరి

చాలా రాజకీయ విషయాల్లో జనసేన స్పష్టమైన వైఖరి చూపలేదు. చంద్రబాబుతో బంధం తెగక ముందు, చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేయించిన పనులు ఏమీ లేవు.

చంద్రబాబుతో బంధం తెగిపోయిన తర్వాత ఆయన చేసిన తప్పులను బలంగా ఎత్తిచూపలేదు. గుంటూరు బహిరంగ సభలో లోకేశ్ అవినీతిపై ఆరోపణలు.. అవి కూడా వాళ్ళూ వీళ్లూ అంటున్నారు అనడం, పవన్ ఒక కీలక రాజకీయ విషయాన్ని ఎంత తేలిగ్గా హ్యాండిల్ చేశారు అన్నదానికి చిన్న ఉదాహరణ.

ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పోరాటం మాత్రమే చెప్పుకోవడానికి ఉంది. రాజధాని రైతుల గురించి చేసిన ఆందోళన ఆ స్థాయిలో కొనసాగలేదు.

కోటరీ

పవన్ కల్యాణ్ సాధారణ అభిమానులకు కాకపోయినా, సమాజంలో ప్రభావం చూపగలిగే కీలక వ్యక్తులకు కూడా అందుబాటులో ఉండలేకపోయారు. మీడియా, వివిధ రంగాల ప్రముఖులు పవన్ కల్యాణ్‌ను కలవడం చాలా కష్టమైపోయింది. పవన్ మేలు కోరి ఆయనకు ఏమైనా చెప్పాలనుకున్న వారికీ, పవన్‌కీ మధ్య ఈ కోటరీ అడ్డంకి ఉంది.

జగన్ ప్రభావం

గతంలో ఎన్నడూ లేనంతగా జగన్‌కు ఒక చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావన ఆంధ్రాలో బలంగా ఉంది. దీంతో తటస్థ ఓట్లు కూడా జగన్‌కు వెళ్లాయి.

తెలుగుదేశం ప్రభావం

గత ఎన్నికల్లో పవన్ మాట విని తెలుగుదేశానికి ఓటు వేసిన వారు కూడా ఈ ఎన్నికల్లో పవన్‌కు ఓటు వేయలేదు. పవన్ తెలుగుదేశాల మధ్య బంధం ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ఎక్కువ మంది ఓటర్లు విశ్వసించారు. పైగా తెలుగుదేశం ప్రభుత్వంపై పవన్ తన ప్రభావాన్ని చూపలేకపోయారని కూడా వారికి అసంతృప్తి ఉంది.

రెండు చోట్ల పోటీ చేయడం

గత రెండు దశాబ్దాల్లో తెలుగు ప్రాంతాల్లో రెండుచోట్ల పోటీ చేసి గెలిచిన చరిత్ర ఎవరికీ లేదు. కళ్లముందే ప్రజారాజ్యం ఉదాహరణ స్పష్టంగా ఉన్నా మళ్లీ రెండు చోట్ల పోటీ చేసే ధైర్యం చేశారు పవన్ కల్యాణ్.

దానివల్ల నియోజకవర్గంపై పూర్తి స్థాయి ద‌‌ృష్టి పెట్టలేకపోవడం, గెలిచినా ఈ సీటు వదులుకుంటారన్న ప్రతిపక్ష వాదనలకు సమాధానం చెప్పుకోలేకపోవడం వంటి సమస్యలుంటాయి. గాలి అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి రిస్కులు చేయకూడదన్న కనీస విషయాన్ని జనసేన అర్థం చేసుకోలేకపోయింది.

యువతే మద్దతు

జనసేనకు ఈ ఎన్నికల్లో యువతరం మద్దతుగా నిలిచింది.. కానీ మధ్య వయస్కులు, వృద్ధుల్లో పవన్ కి ఆదరణ పెద్దగా కనిపించలేదు.

ఈ ప్రతికూలతల మధ్యే ఈ ఎన్నికలు పవన్ కల్యాణ్‌కు ఒక మేలు చేశాయి. ఆయనపై ఉన్న కుల ముద్ర పోయింది. ఎందుకంటే, కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కల్యాణ్‌కు పడలేదు. కులాలకు అతీతంగా, పవన్ కోసం ఉద్యోగాలకు సెలవులు పెట్టి వెళ్లి ప్రచారం చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇది కుల పార్టీ ముద్రను చెరపడానికి ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి పవన్ పార్టీ తరపున ఒకరు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు బిజీగా ఉన్నారు. జగన్మోహన రెడ్డిపై కేసుల గురించీ, శ్రీకాకుళంలో పోరాటాలు చేసినా ఓట్లు రాలకపోవడం గురించీ వ్యగ్యంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. 'విత్ పీకే' అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ మీద తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ఎప్పుడూ దీర్ఘ కాలిక రాజకీయం గురించి చెప్పుకొచ్చేవారు. ఆయన దీర్ఘకాలిక రాజకీయాలు చేయాలనుకుంటే, వ్యూహాలు, ఆలోచనలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. జగన్ తొమ్మిదేళ్లు పార్టీని నెట్టుకు రావడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు పవన్ పార్టీ పెట్టి ఆరేళ్లవుతోంది. మరో ఎన్నికలకు ఇంకా ఐదేళ్లుంది.

ఫలితాల తరువాత రోజున మంగళగిరిలో పార్టీ నాయకులతో పవన్ కలిశారు. ఎప్పట్లాగే చాలా సాధారణంగా ఉంది ఆయన శైలి. ముఖంలో నవ్వు కనిపించింది. కానీ, ఆ స్థిరత్వాన్ని ఐదేళ్ల పాటూ కొనసాగించడమే ఇప్పుడు పవన్ ముందున్న పెద్ద సవాల్.

ఎందుకంటే పవన్‌పై ప్రజలకున్నపెద్ద అనుమానం కూడా అదే. ప్రజారాజ్యంలా మళ్లీ జరగదు అన్న భరోసా పవన్ ఇవ్వగలిగితే, ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉండగలిగితే అప్పుడు ఐదేళ్ల తర్వాత మరోసారి ప్రయత్నం చేయవచ్చు.

కానీ ప్రాంతీయ పార్టీలను ఐదేళ్ల పాటూ నడపడం అంత తేలిక కాదు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జనసేనకు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ హోదా దక్కే అవకాశం కూడా లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడిపించాలంటే, దానికి ఎంతో పట్టుదల కావాలి. సొంత విధానం ఉండాలి. అన్నిటికీ మించి ఆర్థిక వనరులు కావాలి. అవి 'తన సిద్ధాంతానికి లోబడే కావాలి.'

విజయవాడలో జనసేన కార్యాలయం పక్కనే మరో పెద్ద భవనం ఉంది. ఆ భవనం నీడ జనసేన భవనంపై పడుతుంది. ఆ పెద్ద భవనంపై "లింగమనేని" అని రాసి ఉంటుంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్తల్లో లింగమనేని ఒకరు. ఒకరి భవనాల నీడలు మరో భవనంపై పడవచ్చు. కానీ భావాలపై పడకూడదు. పవన్ ఆ జాగ్రత్త తీసుకోగలరా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)