కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ బస్సు గద్వాల వైపు వెళ్తున్న తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారని, ఇద్దరు ఆసుపత్రికి తరలించిన తరువాత మరణించారని కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా..

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామానికి చెందినవారు గుంతకల్లులో ఒక వివాహ నిశ్చితార్థ వేడుకకు వెళ్లి తూఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెల్దుర్తి సమీపంలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు డివైడర్‌ మీదుగా దూసుకుపోయి అటువైపుగా వస్తున్న తూఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది.

తూఫాన్ వాహనంలో ఉన్నవారిలో 14 మంది, ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఒకరు ఈ ప్రమాదంలో మరణించారు.

మృతదేహాలు బయటకు తీయడం కూడా కష్టమైంది: ప్రత్యక్ష సాక్షి తమ్మినేని ప్రతాప్

ఘటనా స్థలానికి సమీపంలోని ఎన్.వెంకటాపురం గ్రామానికి చెందిన తమ్మినేని ప్రతాప్ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్నారు. ఆయనతో ‘బీబీసీ తెలుగు’ మాట్లాడింది.

బస్సు ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనం నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీయడం చాలా కష్టమైందని ఆయన చెప్పారు.

బస్సు, తూఫాన్ ఢీకొన్న ఈ స్థలం ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోటని.. ఇక్కడ మలుపు ఉండడం వల్ల గతంలోనూ ప్రమాదాలు జరిగాయని చెప్పారు.

వెల్తుర్తి నుంచి కర్నూలు వెళ్లే బస్సులు ఈ మలుపు మీదుగానే వెళ్తాయని, ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించిన ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌.., వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను కేసీఆర్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)