You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్ళెవరు...
- రచయిత, దినేష్ ఉప్రేతీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
చాలా దేశాల క్రికెట్ ఆటగాళ్లు ప్రస్తుతం భారత్‌లోజరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ సత్తా చూపిస్తున్నారు.
20-20 ఓవర్ల ఈ టోర్నమెంటులో ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆయా దేశాల సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
సెలక్షన్ కోసం బోర్డర్ లైన్‌లో ఉన్న ఆటగాళ్లు తమ మెరుగైన ప్రదర్శనతో వరల్డ్ కప్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో ఈ టోర్నమెంట్ చాలా ప్రత్యేకంగా నిలిచింది.
మే నెల చివర్లో ఇంగ్లండ్‌లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత్ జట్టును సోమవారం ముంబయిలో ప్రకటించనున్నారు.
టీమిండియాను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జాతీయ సెలక్షన్ కమిటీతోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొంటారు.
వరల్డ్ కప్ కోసం ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీకి పంపించడానికి ఏప్రిల్ 23 ఆఖరి తేదీ.
కానీ భారత సెలక్టర్లు ఈ పనిని ఒక వారం ముందే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎంపికైన ఆటగాళ్లు మానసికంగా సిద్ధం కావడానికి వారికి తగిన సమయం ఇవ్వాలనుకోవడం కూడా దీని వెనుక కారణం కావచ్చు.
సెలక్టర్ల మనసులో 20 మంది ఆటగాళ్ల పూల్ ఉందని, దాని గురించి ఎలాంటి ఆందోళనా లేదని ఎమ్మెస్కే ప్రసాద్ రెండు నెలల ముందే స్పష్టం చేశారు.
ఇప్పుడు వారిలో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాలి. వరల్డ్ కప్ జట్టులో ఎంపిక కోసం ఆటగాడి ఐపీఎల్‌లో ప్రదర్శనను ఆధారగా తీసుకోమని కూడా ఆయన చెప్పారు.
అంటే ఒకవేళ జట్టులో దాదాపు పక్కాగా భావించే ఏ ఆటగాడైనా ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చూపించలేకపోయినా, దానివల్ల జట్టులో స్థానం కోల్పోవడం అనేది ఉండదు.
కానీ ప్రసాద్ ఈ ఫార్ములా నిజంగా ఆటగాళ్లందరి విషయంలో వర్తిస్తుంది అనేది కూడా చెప్పలేం.
అందుకే, సెలక్షన్ కోసం బార్డర్ లైన్లో ఉన్న ఆటగాళ్లకు ఈ ఐపీఎల్ ఎంత కీలకమైనదో కూడా తెలిసొస్తుంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో నంబర్ వన్‌గా ఉన్న భారత్ ఇప్పటివరకూ రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
మొదట 1983లో భారత్ కపిల్ దేవ్ నేతృత్వంలో ఇంగ్లండ్‌లో చాంపియన్ అయ్యింది. తర్వాత 2011లో సొంతగడ్డపై మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది.
50 ఓవర్ల ఈ ఫార్మాట్‌లో ఒక బలమైన జట్టు కాంబినేషన్ అంటే, ఐదుగురు బ్యాట్స్‌మెన్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక వికెట్ కీపర్ అని భావిస్తారు.
అయితే వరల్డ్ కప్ టికెట్ పక్కా అయిన ఆటగాళ్లెవరో ఒకసారి చూద్దాం. వీరి గురించి సెలక్టర్లు ఏకాభిప్రాయానికి రావచ్చు.
టీమ్ ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఇద్దరిలో ఎవరినీ తప్పించే ధైర్యం చేస్తారని అనుకోలేం.
రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
కొన్ని రోజుల్లో 32 ఏట అడుగు పెడుతున్న ఈ కుడిచేతి డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు ఏరోజైనా ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉంది.
206 వన్డే మ్యాచ్‌ల అనుభవం ఉన్న రోహిత్, వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్. సుమారు 88 స్ట్రయిక్ రేట్ ఉన్న రోహిత్ సగటు 47.39. త
రోహిత్ శర్మ పేరున 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఇతడు 8010 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ 2015లో జరిగిన ప్రపంచకప్ 8 మ్యాచుల్లో 47.14 సగటుతో 330 రన్స్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 91.66. ఈ టోర్నీలో అతడు ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
శిఖర్ ధవన్
33 ఏళ్ల ఎడమచేతి బ్యాట్స్‌మెన్ ధవన్‌ను జట్టు సభ్యులు ముద్దుగా గబ్బర్' అని పిలుచుకుంటారు. 128 వన్డే మ్యాచ్‌ల అనుభవం ఉన్న ధవన్ 16 సెంచరీలు కొట్టాడు. 44.62 సగటుతో మొత్తం 5355 రన్స్ చేశాడు.
ధవన్‌కు ఐసీసీ టోర్నమెంటులో మెరుగైన రికార్డ్ ఉంది. ధవన్ 2013లో ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో 5 మ్యాచుల్లో ఒక సెంచరీతోపాటు 363 రన్స్ చేశాడు. తన సగటు 90.75. భారత్ ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
2015 వరల్డ్ కప్‌లో ధవన్ 8 మ్యాచుల్లో 412 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నమెంటులో ధవన్ సగటు 91.75.
ఇంగ్లండ్‌లో ఆడిన 2017 ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో కూడా ధవన్ 5 మ్యాచుల్లో 67.60 సగటుతో 338 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ( కెప్టెన్)
ఐసీసీ బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి 227 వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
30 ఏళ్ల కోహ్లీ వన్డేల్లో 41 సెంచరీలు, 49 అర్థ సెంచరీలు కొట్టాడు. తన పేరున 10,843 పరుగులున్నాయి.
విరాట్ కోహ్లీకి ఇది మూడో వరల్డ్ కప్ అవుతుంది. 2011 వరల్డ్ కప్‌లో కోహ్లీ 9 మ్యాచుల్లో 282 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
2013 ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో కోహ్లీ 5 మ్యాచుల్లో 176 రన్స్ చేశాడు. తన సగటు 58.66.
2015 వరల్డ్ కప్‌లో కోహ్లీ 8 మ్యాచుల్లో 50.83 సగటుతో 305 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 5 మ్యాచుల్లో 258 రన్స్ చేశాడు.
అంబటి రాయుడు లేదా విజయ్ శంకర్
భారత సెలక్టర్లు నాలుగో స్థానంలో ఆటగాడిని ఎంపిక చేసేందుకు కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ కోసం అంబటి రాయుడు, విజయ్ శంకర్ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
అయినా ఈ నంబరులో చాలా కాలం నుంచీ ప్రయోగాలు జరుగుతున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ గతంలో ఈ స్థానంలో కేఎల్ రాహుల్, ధోనీ, సురేష్ రైనా, కేదార్ జాదవ్, మనీష్ పాండేలను ఆడించి చూసింది.
కానీ ఆసియా కప్, తర్వాత వెస్టిండీస్‌తో అంబటి రాయుడు ఈ స్థానంలో మెరుగైన ప్రదర్శనతో తన స్థానం దాదాపు పక్కా చేసుకున్నాడు.
న్యూజీలాండ్‌తో ఐదో వన్డేలో 90 పరుగుల రాయుడి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ చూసి ఆ స్థానం లోటు తీరిందని సంతోషపడ్డ సెలక్టర్లు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో రాయుడు మొదటి మూడు వన్డేల్లో చతికిలపడేసరికి ఆలోచనలో పడ్డారు. అతడిని చివరి రెండు వన్డేల నుంచి తప్పించారు.
హైదరాబాద్ ఆటగాడైన 33 ఏళ్ల రాయుడికి 55 వన్డేల అనుభవం ఉంది. తన సగటు 47.
బహుశా రాయుడు అంత ఫాంలో లేడన్న మాట నిజమే. కానీ క్రికెట్‌లో ఒక మాటుంది. ఫాం ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్.
రాయుడికి నాలుగో స్థానంలో విజయ్ శంకర్ పోటీ ఇవ్వచ్చు.
శంకర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో 30 సగటుతో 112 స్ట్రైక్ రేటుతో 120 పరుగులు చేసి కెప్టెన్ కోహ్లీ, సెలక్టర్లను ప్రభావితం చేశాడు. దానితోపాటు మంచి బౌలింగ్ కూడా చేస్తాడు.
2003 వరల్డ్ కప్‌లో వీవీఎస్ లక్ష్మణ్ స్థానంలో దినేష్ మోంగియాను కూడా ఇలాంటి కారణాలతోనే జట్టులోకి తీసుకున్నారు.
2011 వరల్డ్ కప్‌లో కూడా యువరాజ్ సింగ్ బ్యాట్స్‌మెన్‌తోపాటూ ఏడో బౌలర్ పాత్ర కూడా చాలా బాగా పోషించారు. యువీ మొత్తం టోర్నమెంటులో 15 వికెట్లు పడగొట్టాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
37 ఏళ్ల ధోనీ ఐసీసీ మూడు టోర్నమెంట్లలో జట్టును గెలిపించిన ఏకైక కెప్టెన్.
341 వన్డేల అనుభవం ఉన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ధోనీ 50.22 సగటుతో 10,500 రన్స్ చేశాడు. తన పేరున 10 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ధోనీకి ఇది 4వ వరల్డ్ కప్ టోర్నమెంట్ అవుతుంది.
వెస్టిండీస్‌లో 2006-07లో ఆడిన మొదటి వరల్డ్ కప్‌లో ధోనీకి తన మెరుపులు చూపించే అవకాశం రాలేదు. ధోనీ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 29 రన్స్ చేయగలిగాడు.
కానీ ఆ తర్వాత నాలుగేళ్లకు 2011లో ధోనీ తన కెప్టెన్సీలో జట్టును ప్రపంచ చాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నమెంటులో 9 మ్యాచుల్లో 48.20 సగటుతో 241 రన్స్ చేశాడు.
2015లో వరల్డ్ కప్‌లో ధోనీ తన బ్యాట్ పదును చూపాడు. 8 మ్యాచుల్లో 59.25 సగటుతో 237 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
కేదార్ జాదవ్ లేదా దినేష్ కార్తీక్
కేదార్ జాదవ్ పాత్ర జట్టులో అటూఇటుగా ఆల్‌రౌండరే అనచ్చు. కుడిచేతి బ్యాట్స్‌మెన్ అయిన 34 ఏళ్ల జాదవ్ 59 వన్డేలు ఆడాడు.
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో రాణించచడంతోపాటు వన్డేల్లో 27 వికెట్లు కూడా తీశాడు.
దినేష్ కార్తీక్ జట్టులో చోటు దక్కించుకోగలడా లేదా అనేది స్పష్టంగా చెప్పలేం.
కానీ వికెట్ కీపర్ కూడా అయిన అతడు ఫస్ట్ డౌన్ నుంచి చివరి వరకూ ఏ క్రమంలో అయినా సత్తా చూపించగల బ్యాట్స్ మెన్.
33 ఏళ్ల కార్తీక్ 91 వన్డేలు ఆడాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకోవడానికి తనకు చాలా అవకాశాలు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా లేదా రవీంద్ర జడేజా
2018లో జరిగిన ఆసియా కప్ ముందు వరకూ హార్దిక్ పాండ్యా గ్రాఫ్ చాలా వేగంగా పైకెళ్లింది. చాలా మంది క్రికెట్ నిపుణులు అతడిని మరో 'కపిల్ దేవ్' అని కూడా అనేశారు.
కానీ గాయం వల్ల పాండ్యా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి గైర్హాజరీని రవీంద్ర జడేజాను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చినా, టీవీ ప్రోగ్రాంలో వ్యాఖ్యల వల్ల మరోసారి జట్టును వీడాల్సి వచ్చింది.
అయితే తన బ్యాటింగ్, బౌలింగ్‌తో హార్దిక్ చాలాసార్లు జట్టుకు చాలా కీలకం అనిపించుకున్నాడు. హార్దిక్ 45 వన్డేలు ఆడి 731 రన్స్ చేయడంతోపాటు 44 వికెట్లు కూడా పడగొట్టాడు.
హార్దిక్ పాండ్యాకు చివరి పదకొండు ఆటగాళ్లలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నుంచిగట్టి పోటీ రావచ్చు.
151 వన్డేలు ఆడిన 30 ఏళ్ల జడేజా 2035 రన్స్ చేశాడు. ఎడమచేతి బౌలరైన జడేజా 174 వికెట్లు పడగొట్టాడు.
జడేజాకు ఈసారీ అవకాశం వస్తే ఇది అతడికి ఇది రెండో వరల్డ్ కప్ అవుతుంది. 2015 వరల్డ్ కప్‌లో జడేజా 8 మ్యాచ్‌లలో 57 రన్స్ చేశాడు. దానితోపాటు 9 వికెట్లు కూడా పడగొట్టాడు.
భువనేశ్వర్ కుమార్
ఇంగ్లండ్ వికెట్‌పై భువనేశ్వర్ కుమార్ స్వింగ్ చాలా ఎఫెక్టివ్, డేంజరస్ అని నిరూపితం కావచ్చు. అందుకే, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ చాలా కీలకంగా భావిస్తున్నారు.
29 ఏళ్ల భువనేశ్వర్ 105 వన్డేల్లో 118 వికెట్లు పడగొట్టాడు. కింది క్రమం బ్యాట్స్‌మెన్లలో నమ్మదగిన వారిలో భువీ కూడా ఉంటాడు.
కుల్దీప్ యాదవ్
గత కొన్ని నెలలుగా కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు.
అతడు బంతిని ఫ్లైట్ చేస్తూ భయపెట్టడమే కాదు, తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు వచ్చినపుడు బెదిరిపోకుండా ఉండగలడు.
44 వన్డేలు ఆడిన కుల్దీప్ ఇప్పటివరకూ 87 వికెట్లు పడగొట్టాడు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టి తన సత్తా చూపాడు. ఇంగ్లండ్‌లో కూడా 9 వికెట్లు తీశాడు.
2018 ఆసియాకప్‌లో కుల్దీప్ 10 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా భారత పర్యటనలో కూడా 10 వికెట్లు సాధించాడు.
యజువేంద్ర చహల్
కుల్దీప్, యజువేంద్ర చహల్ జోడీ 'కుల్చా' పేరుతో పాపులర్ అయ్యింది. 23 ఏళ్ల చహల్ లెగ్ బ్రేక్ గుగ్లీలో పట్టు సాధించాడు. తను మొత్తం 41 వన్డేల్లో 72 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికాలో చహల్ 6 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో కూడా ఇతడు జట్టుకు తురుపుముక్కగా మారాడు. 5 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.
జస్‌ప్రీత్ బుమ్రా
కెప్టెన్ కోహ్లీ తన బౌలర్లలో అందరికంటే ఎక్కువ నమ్మే బౌలర్ ఎవరంటే అది జస్‌ప్రీత్ బుమ్రానే.
గత కొన్ని మ్యాచుల్లో బుమ్రా చివరి ఓవర్లలో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
తన బౌలింగ్‌లో వైవిధ్యంతో బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడమే కాదు, వికెట్లు కూడా పడగొట్టి సత్తా చూపిస్తున్నాడు.
25 ఏళ్ల బుమ్రా 49 వన్డేలు ఆడి 85 వికెట్లు పడగొట్టాడు.
కానీ, ఐపీఎల్ మ్యాచ్‌ల అలసట, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్‌పై ప్రభావం చూపవచ్చని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
మహమ్మద్ షమీ
కుడి చేతి ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ షమీకి మూడో ఫాస్ట్ బౌలర్‌గా జట్టులో చోటు లభించవచ్చు.
28 ఏళ్ల షమీకి 63 వన్డేల అనుభవం ఉంది. ఇతడు మొత్తం 113 వికెట్లు పడగొట్టాడు. 4 సార్లు నాలుగేసి వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించాడు.
2015 వరల్డ్ కప్‌లో షమీ 7 మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు.
షమీని ఎంపిక చేస్తే ఇది అతడికి రెండో వరల్డ్ కప్ అవుతుంది. 2015 వరల్డ్ కప్‌లో అతడు 7 మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు.
వీరితోపాటు సెలక్టర్లు చర్చించే వారిలో దిల్లీ డాషింగ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఆజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, సురేష్ రైనా కూడా ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- రోజూ ఒక్క పెగ్గేసినా గుండెకు ముప్పే: ద లాన్సెట్
- పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది
- బెలారస్: భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ వెయ్యి అస్థి పంజరాలు
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలియదు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)