You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- రచయిత, జేమ్స్ గాల్లహర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, హెల్త్ అండ్ సైన్స్
ప్రపంచవ్యాప్తంగా శిశుజననాలు గణనీయంగా తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు. సగం దేశాలు.. తమ జనాభా రేటును కాపాడుకునేందుకు కూడా ఇబ్బందిపడుతున్నాయని తాజా అధ్యయనం చెబుతోంది.
అధ్యయనాల ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని పరిశోధకులు అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో మనుమలు, మనుమరాళ్లకంటే, బామ్మలు, తాతల జనాభానే ఎక్కువగా ఉంటుంది.
శిశు జననాలు ఎంత తగ్గాయంటే..
1950 నుంచి 2017వరకూ ప్రతి దేశం అనుసరించిన సామాజిక పోకడలపై 'లాన్సెట్' సంచికలో ఒక అధ్యయనం ప్రచురించారు.
దీని ప్రకారం, 1950లో మహిళల జీవితకాలంలో ప్రసవాల రేటు సగటు 4.7 ఉండేది. కానీ ప్రస్తుతం ఈ సగటు రేటు సగానికి అంటే 2.4కు పడిపోయిందని 2017 గణాంకాలు చెబుతున్నాయి.
పలు దేశాల మధ్య ఈ సగటు ప్రసవాల రేటులో చాలా వ్యత్యాసం ఉంది. పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఈ సగటు 7.1గా ఉంటే, సిప్రస్ ద్వీపంలోని మహిళలు తమ జీవితకాలంలో కేవలం ఒక బిడ్డను మాత్రమే కనగలుగుతున్నారు.
ఏ దేశంలోనైనా సగటు ప్రసవాల రేటు అందాజుగా.. 2.1కంటే తక్కువకు పడిపోతే, ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గుతుంది. శిశు జననాల్లో పతనాన్ని 'బేబీ బస్ట్' అంటారు. సాధారణంగా శిశుమరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ బేబీ బస్ట్ సమస్య తలెత్తుతుంది.
1950లో కనీసం ఒక్క దేశం కూడా ఈ బేబీ బస్ట్ సమస్యను ఎదుర్కోలేదని తాజా అధ్యయనం చెబుతోంది.
ప్రపంచంలో సగం దేశాలు శిశుజననాల పతనం (బేబీ బస్ట్) సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఈ లోటు పూడ్చలేనిదని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ముర్రే బీబీసీతో అన్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే ఆ దేశాల జనాభా క్షీణిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
''ఇది ఒక అసాధారణమైన పరిణామం. ప్రపంచదేశాల్లో సగం దేశాలు బేబీ బస్ట్ సమస్యను ఎదుర్కొంటున్నాయన్న విషయం నాకే కాదు.. చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది'' అని క్రిస్టోఫర్ ముర్రే అన్నారు.
బేబీ బస్ట్ సమస్య ఎదుర్కొంటున్న దేశాలు ఏవి?
ఆర్థికంగా అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాలోని చాలా దేశాలతోపాటు దక్షిణ కొరియాలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది.
శిశు జననాలు, శిశుమరణాలు, వలసల ఆధారంగా జనాభాను లెక్కిస్తారు. శిశుజననాల రేటులో మార్పు రావాలంటే ఒక తరం పడుతుంది.
ఈ సమస్యకు కారణం ఏమిటి?
సంతానోత్పత్తి సమస్యలు అనగానే సాధారణంగా వీర్యకణాల సంఖ్య తగ్గడం గురించిన ఆలోచనలు వస్తాయి. కానీ..
గర్భనిరోధక విధానాలు, మహిళలు అధిక సంఖ్యలో విద్య, ఉద్యోగ రంగాల్లో ఉండటం లాంటి ఎన్నో కారణాలు శిశుజననాల రేటు తగ్గడంపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రభావం ఎలా ఉండబోతుంది?
వలసలు లేని దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరగడం, జనాభా తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
''జనాభాలో చోటుచేసుకున్న ఈ పెను మార్పు.. మన జీవితాల్లోని ప్రతీ అంశంపై ప్రభావం చూపుతుంది. ఒకసారి తల తిప్పి మీ కిటికీ నుంచి బయటకు చూడండి.. ఆ వీధులు, ఆ రోడ్లపై మనుషుల రద్దీ కనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం.. ఆ వీధులు, ఆ రోడ్లు.. అన్నీ మారిపోతాయి'' అని ఆక్స్‌ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ ఏజింగ్ డైరెక్టర్ డా.జార్జ్ లీసన్ బీబీసీతో అన్నారు.
ఉద్యోగ రంగంలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉందని, ఉదాహరణకు ఇంగ్లండ్‌లో పదవీ విరమణ వయసు 68సం.గా ఉంది. ఇలాంటి విధానాన్ని అస్సలు ప్రోత్సహించకూడదని జార్జ్ అన్నారు.
బేబీ బస్ట్ సమస్య ఎదుర్కొంటున్న దేశాల్లోకి బయట నుంచి వస్తున్న వలసల గురించి ఓసారి ఆలోచించాలి. ఈ వలసలు కొత్త సమస్యలను సృష్టిస్తాయి. మరోవైపు.. ఆయా దేశాలు ఎక్కువమంది పిల్లలకు జన్మనిచ్చేలా మహిళలను ప్రోత్సహించాలి అని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ అనాలిసిస్ నివేదిక పేర్కొంది.
''ఈకాలంలో భార్యాభర్తలు తక్కువ మంది పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు 65ఏళ్లకు పైబడ్డ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ పోకడలతో అంతర్జాతీయ సమాజం మనుగడ సాగించడం చాలా కష్టం!'' అని గ్లోబల్ బర్డెన్ నివేదిక రూపొందించిన ప్రొ.ముర్రే అన్నారు.
''పిల్లలకంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాన్ని ఓసారి ఊహించుకోండి.. ఈ విషయంలో జపాన్ చాలా అప్రమత్తంగా ఉంది. ఆ దేశం జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటోంది. కానీ పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. బేబీ బస్ట్(శిశుజననాల రేటు తగ్గుదల) సమస్య ఎదుర్కొంటున్న దేశాల్లో తగ్గుతున్న జనాభాను, ఆ దేశాల్లోకి వస్తున్న వలసదారులు భర్తీ చేస్తున్నారు'' అని ముర్రే వివరించారు.
చైనాలో పరిస్థితి ఎలా ఉంది?
చైనాలో జనాభా పెరుగుదల 1950 నుంచి ఇప్పటివరకు.. 50 కోట్ల నుంచి, 140 కోట్లకు పెరిగింది. కానీ చైనా కూడా సంతానోత్పత్తి రేటులో తగ్గుదల సమస్యను ఎదుర్కొంటోంది.
2017లో మహిళల జీవితకాలంలో సగటు ప్రసవాల సంఖ్య కేవలం 1.5 మాత్రమే.
ఈమధ్యకాలంలో ఒక బిడ్డను మాత్రమే కనాలి అనే విధానాన్ని ప్రభుత్వం విరమించుకుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లోని మహిళల సగటు ప్రసవాల సంఖ్య 2.1కు చేరాలని చెప్పడానికి కారణం.. పుట్టిన ప్రతి బిడ్డ యుక్తవయసు వచ్చేవరకు కచ్చితంగా జీవిస్తారని చెప్పలేం.
చైనాలోని శిశుజనన నిష్పత్తిని పరిశీలిస్తే, 117 మంది మగశిశువులు: 100 ఆడ శిశువులుగా ఉంది. అంటే.. మగబిడ్డ కోసం భ్రూణహత్యలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)