You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెబ్‌కు 30 ఏళ్లు: పతన దశలో వెబ్... అందరం కలసి కాపాడుకోవాలి- బీబీసీతో టిమ్ బెర్నర్స్-లీ
వెబ్ పతన దశలో ఉందని, ఇది నిరుపయోగ స్థితిలోకి పడిపోకుండా కాపాడుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరగాల్సి ఉందని వెబ్ ఆవిష్కర్త సర్ టిమ్ బెర్నర్స్-లీ బీబీసీతో చెప్పారు. వెబ్ ఆవిష్కరణకు ప్రతిపాదనలు సమర్పించి 30 ఏళ్లయిన సందర్భంగా బీబీసీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ 30 ఏళ్ల వెబ్ ప్రస్థానం మొత్తమ్మీద బాగుందా అని అడగ్గా- మొదటి 15 సంవత్సరాలు చాలా బాగుందని, తర్వాత నుంచి పరిస్థితులు దిగజారాయని, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందని టిమ్ సమాధానమిచ్చారు.
వెబ్‌లో తమ డేటాను ఎలా దుర్వినియోగం చేయొచ్చనేది నిరుడు కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటా గోప్యత ఉల్లంఘనలు, హ్యాకింగ్, తప్పుడు సమాచార వ్యాప్తి లాంటి సమస్యలకు పరిష్కారాలు సాధ్యమేనని టిమ్ తెలిపారు.
వెబ్ అనేది మంచికి ఉపయోగపడే శక్తేనా అనే సందేహం చాలా మందిలో ఉందని ఈ నెల 11న రాసిన ఒక బహిరంగ లేఖలోనూ ఆయన వెల్లడించారు.
వెబ్ భవిష్యత్తు పట్ల తనకు ఆందోళనగా ఉందని టిమ్ బీబీసీతో చెప్పారు. వెబ్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, అనుచితమైన అంశాలు ఉండటం గురించి తాను కలత చెందుతున్నానని తెలిపారు.
వెబ్ యూజర్లుగా తమకు ఎదురయ్యే ముప్పును ప్రజలు అర్థం చేసుకోవడం మొదలయ్యిందని టిమ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
''తాము ఇచ్చిన డేటాను ఎన్నికల్లో దుర్వినియోగం చేశారని కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజలు గుర్తించారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఓపెన్ వెబ్‌తో ముడిపడిన సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే భావన ఇటీవలి సంవత్సరాల్లో తనలో బలపడుతూ వస్తోందని టిమ్ తెలిపారు.
ప్రస్తుతం వెబ్‌ను దెబ్బతీస్తున్న మూడు అంశాలను తన బహిరంగ లేఖలో ఆయన ప్రస్తావించారు. అవేంటంటే-
- హ్యాకింగ్, వేధింపులు
- 'క్లిక్‌బెయిట్' పద్ధతులను ప్రోత్సహించే వ్యాపార నమూనాలు, ఇతరత్రా అంశాలతో కూడిన సమస్యాత్మక సిస్టమ్ డిజైన్
- దుందుడుకుతనంతో కూడిన చర్చలు, మనుషుల మధ్య చీలిక తెచ్చే చర్చలు, ఇతర అవాంఛిత పర్యవసానాలు
ఆన్‌లైన్‌లో అనుచిత తీరును నియంత్రించే కొత్త చట్టాలు, వ్యవస్థలతో ఈ మూడు సమస్యలను కొంత మేర ఎదుర్కోవచ్చని టిమ్ చెప్పారు.
గత ఏడాది తీసుకొచ్చిన 'కాంట్రాక్ట్ ఫర్ ద వెబ్ ప్రాజెక్ట్' లాంటి ప్రయత్నాలు ఈ సమస్యల పరిష్కారంలో దోహదం చేస్తాయని తెలిపారు. సాధారణ ప్రజలు, వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులు సహా సమాజంలోని అందరూ తమ వంతు తోడ్పాటును అందిస్తేనే ఈ విషయంలో ముందడుగు సాధ్యమవుతుందని చెప్పారు.
''ప్రభుత్వ పెద్దలు, సివిల్ సర్వెంట్లు, ప్రజాప్రతినిధులు ఓపెన్ వెబ్‌కు అండగా నిలవాలి. ప్రైవేటు రంగ ప్రయోజనాలు ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించినప్పుడు వీరు తగిన చర్యలు చేపట్టి, ఓపెన్ వెబ్‌ను కాపాడేందుకు ముందుకు రావాలి'' అని టిమ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
- మీ కంప్యూటర్‌పై కేంద్రం కన్నేస్తోందా? ఇందులో నిజమెంత?
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
- వీగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్ పెట్టొచ్చా?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)