You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రకాశ్ రాజ్: పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్‌గా వస్తున్నా
విభిన్న పాత్రల్లో మెప్పించే ప్రకాశ్ రాజ్ ఈ ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మరింత బాధ్యతతో కొత్త ప్రారంభం.
మీ మద్దతుతో నేను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను.
నియోజకవర్గం.. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తా’’ అని ప్రకాశ్ రాజ్ ట్విటర్లో వెల్లడించారు.
గత ఏడాది ప్రకాశ్ రాజ్ బీబీసీ తెలుగు ప్రతినిది బళ్ల సతీశ్‌కి ప్రత్యేకంగా ఇంటర్య్వూ ఇచ్చారు.
అప్పుడు నోట్ల రద్దు, గౌరీలంకేశ్ హత్య, దేశంలో రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యత్తు గురించి పలు విషయాలు చెప్పారు.
ఆ విషయాలను కింద చూడొచ్చు.
నోట్ల రద్దు ఆశయం మంచిదే కావొచ్చు, కానీ తీసుకొచ్చిన విధానం సరిగా లేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.
కళ్ల ముందు నల్లధనం ఇంకా తిరగాడుతూనే ఉందని ఆయన చెప్పారు.
అన్ని విషయాలు తెలిసీ మౌనంగా ఉండే వాళ్లు చచ్చిపోయిన వారితో సమానమని ఆయన అన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
పాలకులను కాకుండా మరెవరిని ప్రశ్నిస్తామని ఆయనన్నారు.
పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన నాకు తెలుసు!
తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు ఇష్టం లేదని, ప్రశ్నించడమే ఇష్టమని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన తనకు తెలుసు అన్నారు. పవన్ తనకు నచ్చాడని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ పార్టీ విధానాలు నచ్చితే మద్దతిస్తానని ఆయన వివరించారు.
ఒక అభిమానిగా ఓటు వేస్తే, ఆ తర్వాత ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతారని ఆయన అన్నారు.
తమిళనాడులో కమల్ హసన్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే, పార్టీ విధానాల గురించి తనతో కమల్ హసన్ ఎలాంటి చర్చలు జరపలేదని వివరించారు. కమల్ పార్టీలో తాను చేరబోనని కూడా ఆయన స్పష్టం చేశారు.
'నా ప్రశ్నలకు జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?
తప్పులపై ప్రశ్నిస్తే యాంటీ మోదీ ట్యాగ్ తగిలిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రశ్నిస్తే మీకు కంగారెందుకు, బెదిరింపులు ఎందుకు అని ఆయన నిలదీశారు.
'నా ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?' అని ప్రకాశ్ రాజ్ అడిగారు.
నమ్మిందే చేస్తా! ప్రతీసారి నేనే కరెక్టు కాదు!
తాను నమ్మిందే చేస్తానని, ఎవరినో మెప్పించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
అయితే, ప్రతీసారి తానే కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పారు. టాలీవుడ్ నిర్మాతలతో గొడవలకు తన వైఖరి కూడా కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
న్యాయం దొరికేదాకా..! పది మంది ప్రశ్నించే దాకా!
న్యాయం దొరికేదాకా, పది మంది తనలా ప్రశ్నించే దాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు.
తనకు ఏడు భాషలు వచ్చని, అవసరమే వాటిని నేర్చుకునేలా చేసిందని వివరించారు.
విభిన్న పాత్రల్లో మెప్పించే ప్రకాశ్ రాజ్, తాను సినిమాలు చూడనని చెప్పారు. ఎన్నో పనులు ఉండగా టైమ్ ఎందుకు పాస్ చేయాలని ప్రశ్నించారాయన.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)