You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిథాలీ రాజ్ వర్సెస్ రమేశ్ పొవార్: మహిళల టీ20 వరల్డ్ కప్ సమయంలో వివాదం ఇలా మొదలైంది
మహిళా టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఘోర పరాజయం భారత అభిమానులను నిరాశపరిచింది.
కానీ తర్వాత వారంలోపే బీసీసీఐకి పంపిన ఈమెయిళ్లు లీకవడంతో కోచ్ రమేష్ పొవార్, ఆ మ్యాచ్‌లో ఆడని సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ మధ్య వివాదం రాజుకుంది.
ఇంగ్లండ్‌తో 8 వికెట్ల ఓటమిపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు మహిళా జట్టును, మేనేజ్‌మెంటును కోరారు. కానీ వారి నుంచి వచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
మిథాలీ రాజ్ జట్టు తన సొంత రికార్డుల కోసం ఆడుతోందంటూ రమేష్ పొవార్ బీసీసీఐకి 10 పేజీల లేఖ రాశారు.
ఇటు మిథాలీ కూడా కోచ్ తనతో మాట్లాడ్డానికి నిరాకరించారని, తుది జట్టుకు దూరం చేశాడని ఆరోపించారు.
ఇదంతా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
నవంబర్ 9 ఇండియా-న్యూజీలాండ్
ఐసీసీ మహిళా వరల్డ్ టీ20 టోర్నీని భారత్ ఘనంగా ప్రారంభించిది. టీమిండియా ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు(194/5) చేసింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ చేసింది. కానీ మిథాలీ రాజ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఓపెనింగ్‌కు బదులు ఆమెను 8వ స్థానంలోకి కిందికి నెట్టేశారు.
"టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో మిథాలీకి త్వరగా స్కోరు చేసే ఉద్దేశం లేకపోవడంతో నేనే ఆ నిర్ణయం తీసుకున్నా" అని కోచ్ రమేశ్ పొవార్ ఈమెయిల్ రివ్యూలో చెప్పారు.
మిథాలీ స్థానంలో పొవార్ తాన్యా భాటియాను ఆడించారు. ఆమె బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ పరుగులు సాధిస్తుందని, వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు ప్రయోజనాలు, వ్యూహాల కోసమే ఆడుతుందని చెప్పారు.
దీనికి జవాబుగా "ఎలాంటి ఎదురు ప్రశ్నలు వేయకుండానే, చాలా రోజులుగా ఆడని మిడిల్ ఆర్డర్లో కూడా దిగడానికి నేను అంగీకరించానని" మిథాలీ చెప్పారు.
"నేను జట్టు ప్రయోజనాల కోసమే దానికి ఒప్పుకున్నాను. నాకు అన్నిటికంటే ముందు జట్టు ముఖ్యం" అని మిథాలీ తన లేఖలో రాశారు.
నవంబర్ 10 - మిథాలీ బ్లాక్ మెయిల్?
తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించిన భారత్ తర్వాత దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజయం టోర్నీలో జట్టుకు చాలా బలం అవుతుంది.
ఈ మ్యాచ్ ముందు "తనను ఓపెనర్ గా ఆడించాలని, లేదంటే క్రికెట్ నుంచే తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని" రమేశ్ పొవార్ చెప్పారు.
"తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై మిథాలీ అప్ సెట్ అయ్యారు. బ్యాగ్ సర్దుకుని ఉదయం రిటైర్మెంట్ ప్రకటించి వెళ్లిపోవాలని అనుకున్నారు. ఆమె చెప్పింది విని షాకయ్యాను" అని పొవార్ తన లేఖలో తెలిపారు.
దీనికి బదులుగా మిథాలీ "టోర్నమెంటు ప్రారంభం నుంచి కోచ్ పొవార్ నేనంటేనే చాలా పక్షపాతం, వివక్ష చూపేవారు. జట్టు సమావేశాల్లోకూడా నన్ను పట్టించుకునేవారు కాదు. ఆయన వరకూ నేను జట్టులో లేను. నేను ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఆయన వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయేవారు" అన్నారు.
నవంబర్ 11 భారత్-పాకిస్తాన్
ఆటకు ముందు ఎన్ని జరిగినా పాకిస్తాన్ మ్యాచ్ కోసం జట్టును ప్రకటించినప్పుడు మిథాలీ రాజ్‌ను ఓపెనర్‌గా దించారు.
"ఆమె డిమాండ్లను ఒప్పుకోవడం వల్లే అలా చేశాం. ఓపెనింగ్ ఇవ్వకబోతే ఇంటికి వెళ్లిపోతానని (రిటైర్మెంట్) మిథాలీ బెదిరించడం వల్లే ఆమెను ఓపెనర్‌గా చేశాం" అని పొవార్ చెప్పారు.
ఈ మ్యాచ్‌లో మొదట ఆడిన పాకిస్తాన్ భారత్‌కు 134 పరుగుల లక్ష్యం ఇచ్చింది. తర్వాత ఓపెనర్‌గా దిగిన మిథాలీ 47 బంతుల్లో 56 పరుగులు చేశారు. వీటిలో 17 డాట్ బాల్స్ ఉన్నాయి.
మిథాలీ స్కోరు ఈ మ్యాచ్‌లో భారత జట్టు పైచేయి సాధించడానికి సాయపడింది. ఆమె ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయ్యారు. జట్టులో ఆమె స్ట్రైక్ రేట్ అందరికంటే అత్యధికంగా 119గా నిలిచింది.
అయినా పొవార్ 'డాట్ బాల్స్' వివాదాన్ని లేవనెత్తారు. "ఒక ఓపెనర్‌గా ఆమె చాలా స్లోగా ఆడింది. దానివల్ల రన్ రేట్ నెమ్మదించింది. తర్వాత బ్యాటింగ్ చేసేవారిపై ఒత్తిడి పెరిగింది" అన్నారు.
ఈ మ్యాచ్ తర్వాత తనను ప్రశంసిస్తూ వ్చచిన ట్వీట్లను మిథాలీ రీ ట్వీట్ చేశారు. వాటిలో ఆమె మళ్లీ ఓపెనర్‌గా రావడాన్ని ప్రశంసించిన ఒక పోస్ట్ కూడా ఉంది.
నవంబర్ 15 ఇండియా-ఐర్లండ్
మిథాలీ స్లో బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పొవార్ ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమెకు మరో అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా జట్టు వ్యూహాలను తను అమలు చేయగలనని నిరూపించుకోవాలని సూచించాడు.
జట్టు ఒక ఉద్దేశం(భారీస్కోరు) దిశగా బ్యాటింగ్ చేయాలని పొవార్ భావించాడు.
కానీ అంతా ముందు మ్యాచ్ లాగే జరిగింది. భారత్ మళ్లీ గెలిచింది. మిథాలీ 50 పరుగులు చేసింది. మళ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. కానీ ఆ మ్యాచ్‌లో కూడా ఆమె రన్ రేటు స్లోగా ఉంది.
ఐర్లాండ్ మ్యాచ్‌లో మిథాలీ స్ట్రైక్ రేటు 100 కంటే తక్కువగా ఉంది. జట్టులో అందరి కంటే ఆమెదే తక్కువ. రాజ్ 50 పరుగుల్లో 25 డాట్ బాల్స్ ఉన్నాయి.
ఆ మ్యాచ్ తర్వాత మిథాలీ బ్యాటింగ్‌ను పొవార్ తప్పుబట్టాడు. "జట్టుపై అదనపు ఒత్తిడి పడింది, ఎక్కువ పరుగులు సాధించాలనే తొందరలో రెండు వికెట్లు కూడా కోల్పోయాం" అన్నాడు.
అయితే, ఆ మ్యాచ్‌లో మిథాలీ మోకాలికి గాయమైంది. దాంతో గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడడానికి ఆమె ఫిట్ కాలేకపోయారు.
నవంబర్ 17 ఇండియా-ఆస్ట్రేలియా
బీ గ్రూపులో టాప్ టూ స్థానాల్లో ఉన్న భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది.
మిథాలీ స్థానంలో మళ్లీ తాన్యా భాటియా జట్టులోకి వచ్చింది. కేవలం 2 పరుగులే చేసింది.
కానీ, వరసగా నాలుగు విజయాలతో భారత్ తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
అంటే సెమీ ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఏడాది క్రితం వుమెన్ వరల్డ్ కప్ వన్డే ఫైనల్లో తమను ఓడించిన జట్టుతో సెమీస్‌లో తలపడుతుంది.
పొవార్ తన రిపోర్టులో "ఈ విజయం తర్వాత మిథాలీ జట్టును ప్రశంసిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అని అన్నారు.
నవంబర్ 21 ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ముందు
మిథాలీ రాజ్ మోకాలి గాయం నయమైంది. సెమీ ఫైనల్లో తిరిగి ఓపెనర్‌గా ఆడాలని భావించింది. కానీ ఆమెకు కనీసం తుది జట్టులో కూడా స్థానం లభించలేదు.
మ్యాచ్ కు ముందు తన నిర్ణయం గురించి పొవార్ ఆమెతో చర్చించానని చెప్పాడు. "ఆటలో పైచేయి సాధించడానికి నా వ్యూహం ఏంటని ఆమె నన్ను అడిగారు" అన్నాడు.
మిథాలీ తన బదులు భాటియాను మళ్లీ ఓపెనర్‌గా జట్టులోకి తీసుకోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ పొవార్ నిర్ణయాన్ని టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా సమర్థించారు.
వన్డేలలో కౌర్‌కు కెప్టెన్‌గా ఉన్న మిథాలీ రాజ్ "పొవార్ నిర్ణయాన్ని కౌర్ సమర్థించడం నాకు బాధ కలిగించింది" అన్నారు.
నవంబర్ 22 భారత్ - ఇంగ్లండ్ సెమీ ఫైనల్
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కంగుతింది. టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న జట్టు కలలు కల్లలయ్యాయి.
భారీ స్కోరు చేయాలన్న జట్టు వ్యూహం బెడిసికొట్టింది. భాటియా 19 బంతుల్లో 11 పరుగులు చేస్తే, మరో ఓపెనర్ స్మృతి మంథాన 34 పరుగులు చేసింది.
కానీ 89/2 స్థాయి నుంచి జట్టు 112 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మరో మూడు ఓవర్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
మ్యాచ్ ముగియగానే మాట్లాడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ "మిథాలీ రాజ్‌ను తీసుకోకపోవడం గురించి మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు" అంది.
"మేం ఏ నిర్ణయం తీసుకున్నా, అది కొన్నిసార్లు జట్టుకు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు" అంది.
కానీ దీనిపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఘన విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో జట్టు కుప్పకూలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
దాంతో అసలు తెర వెనుక ఏం జరిగిందనేదానిపై తీవ్రంగా చర్చ జరిగింది.
మిథాలీని ఆడించకపోవడం తప్పిదం-గావస్కర్
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మిథాలీని తప్పించి భారత మేనేజ్‌మెంట్ తప్పు చేసిందని అన్నారు.
"విరాట్ కోహ్లీ లాంటి ఆడగాడు ఒక మ్యాచ్‌లో గాయపడి, తర్వాత మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటే అతడిని వదులుతారా" అని ప్రశ్నించారు
ఇటు "దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలని కోరుకున్నానని. కానీ మేం ఒక మంచి అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని" మిథాలీ అన్నారు.
నవంబర్ 26 - నివేదిక
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబా కరీం టీ20 జట్టు ప్రదర్శనపై ఒక నివేదిక సిద్ధం చేయడం ప్రారంభించారు
అందరూ తమ వివరణను ఈమెయిల్ చేయాలని జట్టుకు సంబంధించిన వారిని కోరారు.
నవంబర్ 27 - మిథాలీ వాదన
జట్టు నుంచి తనను తప్పించారని మిథాలీ బీసీసీఐకి లేఖ రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
జోహ్రీ, కరీంకు పంపిన మెయిల్లో "అధికారంలో ఉన్న కొంతమంది నా కెరీర్ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు" అని మిథాలీ తెలిపారు.
మిథాలీ రాజ్ ముఖ్యంగా మాజీ ప్లేయర్ డయానాపై ఆరోపణలు చేశారు. "జట్టు నుంచి తప్పించాలనే నిర్ణయాన్ని ఆమె సమర్థించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఇలా చేస్తారని నేను ఊహించలేదు. అక్కడ జరిగిన అన్ని వాస్తవాలను ఆమెకు నేను వివరంగా చెప్పాను" అని తెలిపింది.
పొవార్‌కు వ్యతిరేకంగా రాసిన తన ఈ-మెయిల్లో "ఆయన నాతో పక్షపాతంతో, వివక్షతో వ్యవహరించారు. అందరితో బాగానే ఉంటూ నన్ను పట్టించుకోకపోవడం ఒత్తిడికి గురిచేసింది. అయినా దేశం కోసం నేను నిరుత్సాహపడలేదు" అని తెలిపారు.
"నన్ను ఎంత అవమానించినా, ఎట్టి పరిస్థితిల్లో నేను నా దేశానికి సేవలందించాలనే ఆలోచించేదాన్ని" అని చెప్పారు.
నవంబర్ 28 - పొవార్ ప్రతిస్పందన
మిథాలీ మెయిలుకు జవాబుగా పొవార్ బీసీసీఐకి పది పేజీల నివేదిక పంపారు
మిథాలీ జట్టులో స్థానం కోసం తనను బ్లాక్ మెయిల్ చేసిందని, ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆమె తీరు సరిగా ఉండేది కాదని చెప్పారు
"జట్టు నుంచి తప్పిస్తే వెళ్లిపోతానని మిథాలీ బెదిరించడం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ ముందు జట్టును కవరపాటును గురిచేసిందని" పొవార్ తెలిపారు.
నవంబర్ 29 స్పందించిన మిథాలీ
పొవార్ వివరణ చదివిన తర్వాత మిథాలీ ఒక ట్వీట్ చేశారు.
"నా జీవితంలో ఇది చీకటి రోజు’’ అని తెలిపారు.
బీసీసీఐ ప్రస్తుతం జోహ్రీ, సాబా కరీం అందించబోయే నివేదిక కోసం ఎదురుచూస్తోంది
నవంబర్ 30కి మహిళా క్రికెట్ టీమ్ కోచ్‌గా పొవార్ కాంట్రాక్ట్ ముగిసింది.
మిథాలీ రాజ్ ప్రస్తుతం టెస్ట్, వన్డే ప్లేయర్‌గా ఉన్నారు.
తుది నివేదిక కచ్చితంగా ఎవరో ఒకరి తీరును తప్పుబడుతుంది. కానీ అది ఎవరు?
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- క్రికెట్: ఇంగ్లండ్‌లో భారత జట్టు విజయాలను చేజార్చుకోవడానికి నాలుగు కారణాలు
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- #FIFA2018: క్రికెట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- బీజేపీకి శబరిమల రూపంలో మరో ‘అయోధ్య’ దొరికిందా?
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)